గ్రెటా థన్‌బర్గ్‌‌ .. దేశాధినేతలనే నిలదీసిన ధైర్యం ఎక్కడిది?

greta thunberg
Source: https://www.facebook.com/gretathunbergsweden/

గ్రెటా థన్‌బర్గ్‌ .. వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. కానీ ఇప్పుడామె గళం ప్రపంచ నేతలనే వణికిస్తోంది. అందులో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఉన్నారు. భూమిపై ఉన్న జంతుజాలం వినాశనానికి దారి తీస్తున్న పర్యావరణ మార్పులపై గ్రెటా థన్‌బర్గ్‌‌ పోరాడుతోంది. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేయకుండా మనిషి తన వినాశనాన్ని తానే కోరుకుంటున్నాడన్నది ఆమె సందేశం.

ద ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ పేరుతో ఆమె ప్రారంభించిన స్కూల్‌ స్ట్రైక్‌ ఉద్యమం ఇప్పుడు వంద దేశాలకు పాకింది. ఆ ఉద్యమంలో ఇప్పుడు కోట్ల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ’మా భవిష్యత్తును నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు.. మీకెంత ధైర్యం.. ఇక చాలు.. మీ చేతగాని మాటలు, ఈ కుంటి సాకులు ఏమాత్రం చెల్లవు.. మీకు నచ్చినా నచ్చకపోయినా ఓ మార్పు వస్తోంది..‘ అంటూ ఈ మధ్య ఐక్య రాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ఆమె చేసిన ప్రసంగం ప్రపంచం మొత్తాన్నీ ఊపేసింది.

ఆమె మాటలు పెద్ద పెద్ద నేతలకు తూటాల్లా తగిలాయి. వాతావరణ మార్పులపై ఏమాత్రం స్పందించకుండా చేతులు ముడుచుకొని కూర్చున్నారంటూ ప్రపంచ నేతలపై గ్రెటా థన్‌బర్గ్‌ కన్నెర్ర చేసింది. ఇది మా భవిష్యత్‌ తరాలకు మీరు చేస్తున్న నమ్మక ద్రోహమే అంటూ ఏకి పారేసింది.

దీంతో అసలు ఎవరీ గ్రెటా థన్‌బర్గ్‌ అని తెలుసుకోవడానికి యువత ఆసక్తి చూపుతోంది. అసలు ఇంత చిన్న వయసులోనే ఆమె ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపించడానికి కూడా ఓ బలమైన కారణమే ఉంది.

అసలు ఆమె ఎవరు? ఈ ఉద్యమం ప్రారంభించడానికి కారణమేంటి? అంతర్జాతీయ వేదికలపై ఆమె చేసిన ప్రసంగాలేంటి? ఆమెపై ట్రంప్‌లాంటి వాళ్లు ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఈ వివరాలన్నింటితో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న సమగ్ర కథనం ఇది.

ఎవరీ గ్రెటా థన్‌బర్గ్‌ ?

గ్రెటా థన్‌బర్గ్‌‌ స్వీడన్‌ దేశస్థురాలు. 2003లో స్టాక్‌హోమ్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు కళాకారులు. తండ్రి యాక్టర్‌‌, తల్లి ఒపెరా సింగర్‌. గ్రెటా ఎనిమిదేళ్ల వయసున్నపుడు అంటే 2011లో తొలిసారి పర్యావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్ గురించి తెలుసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి ఇంత చేటు జరుగుతున్నా ఎవరూ ఎందుకు స్పందించడం లేదన్న ఆలోచన ఆమెలో మొదలైంది. అది కాస్తా ఆమెను డిప్రెషన్‌లోకి నెట్టేసింది. ఆ తర్వాత మూడేళ్లకు ఆమె ఆటిజం బారిన పడింది.

ఆటిజంలో ఒక భాగమైన ఆస్పర్జర్‌ సిండ్రోమ్‌, ఆబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ)తో బాధపడింది. అయితే దీనిని ఆమె ఓ వ్యాధిలా కాకుండా ఓ సూపర్‌ పవర్‌లా భావించింది. అప్పుడే ఈ పర్యావరణ మార్పుల గురించి మరింత సీరియస్‌గా ఆలోచించడం ప్రారంభించింది.

కర్బన ఉద్గారాలను మొదట తన ఇంటి నుంచే తగ్గించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి తన ఇంట్లో అందరినీ శాఖాహారిగా మార్చేసింది. గ్రెటా సూచన మేరకు ఇంట్లో వాళ్లు విమానాల్లో ప్రయాణించడం మానుకున్నారు. అప్పటి వరకు దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె తల్లి.. తన కూతురి కోసం తన సింగింగ్‌ కెరీర్‌ను వదులుకుంది.

గ్రెటా ఉద్యమం మొదలైంది ఇలా..

గతేడాది ఆగస్ట్‌లో గ్రెటా చేసిన ఓ పని ప్రపంచవ్యాప్తంగా సరికొత్త పర్యావరణ ఉద్యమానికి తెర తీసింది. పర్యావరణ మార్పులపై స్వీడన్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె వినూత్నంగా నిరసన తెలిపింది.

climate strike
source: https://www.facebook.com/gretathunbergsweden/

తన స్కూల్‌ నుంచి ఒంటరిగా వెళ్లి స్వీడన్‌ పార్లమెంట్‌ బయట కూర్చుంది. చేతిలో ఓ ప్లకార్డ్‌. దానిపై పర్యావరణం కోసం స్కూల్‌ స్ట్రైక్‌ అని రాసి ఉంది. గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కలిగే అనర్థాలను అక్కడికి వచ్చీపోయే వాళ్లకు వివరించడం మొదలుపెట్టింది.

అది మొదలు ప్రతి శుక్రవారం ఆమె ఇలా స్కూల్‌ నుంచి వెళ్లి పార్లమెంట్‌ ఎదుట నిరసన తెలిపేది. మొదట్లో ఆమెను పెద్దగా పట్టించుకోని తోటి విద్యార్థులు క్రమంగా ఆమె వెంట రావడం ప్రారంభించారు. అలా ద ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఉద్యమం మొదలైంది. అది ఇప్పుడు వంద దేశాలకు పాకింది.

జర్మనీ, యూకే, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికాలాంటి దేశాల్లో కోట్లాది మంది విద్యార్థులు ఈ ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ఉద్యమంలో భాగంగా స్కూల్‌ స్ట్రైక్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ ఆమె ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోయింది. ట్విటర్‌లోనే ఇప్పుడు ఆమెకు 25 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.

టెడ్‌ టాక్‌తో పాపులారిటీ

గతేడాది ఇదే అంశంపై టెడ్‌ టాక్‌ షోలో తొలిసారి గ్రెటా మాట్లాడింది. 11 నిమిషాల పాటు సాగిన ఆ ప్రసంగానికి ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. పర్యావరణ మార్పులు తనపై ఎలాంటి ప్రభావం చూపాయో వివరిస్తూ.. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్న ప్రపంచ నేతలపై విమర్శల వర్షం కురిపించింది.

కొత్తగా మనం చేయాల్సింది ఏమీ లేదు.. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఇప్పటికే పరిష్కారాలను సైంటిస్టులు కనుగొన్నారు. మనం మేలుకోవాలి.. మారాలి అంటూ గ్రెటా చేసిన ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సులోనూ ప్రసంగించింది. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది.

అవకాశం వచ్చినప్పుడల్లా ప్రపంచ వేదికలపై పర్యావరణ మార్పులపై ప్రసంగిస్తూ వచ్చింది. ఈ అంశంలో నేతల అసమర్థతపై ఆమె చేస్తున్న పదునైన విమర్శలు చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఆ చారిత్రక ప్రసంగం వెనుక..

ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో గ్రెటా థన్‌బర్గ్‌ చేసిన భావోద్వేగ ప్రసంగం ప్రపంచ నేతలను మరింత ఇరకాటంలోకి నెట్టేసింది. మా భవిష్యత్తును నాశనం చేయడానికి మీకెంత ధైర్యం అంటూ ఆమె చేసిన విమర్శలు విపరీతంగా వైరల్‌ అయ్యాయి.

greta thunberg
Source: https://www.facebook.com/gretathunbergsweden/

ఈ సమావేశం కోసం ఆగస్ట్‌ 28న గ్రెటా.. స్వీడన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లింది. అది కూడా కర్బన ఉద్గారాలను వెలువరించని ఓ రేస్‌ బోట్‌లో రెండు వారాలు ప్రయాణించి ఆమె అక్కడికి చేరుకోవడం విశేషం. సదస్సులో మాట్లాడటంతోపాటు అంతకుముందు సెప్టెంబర్‌ 20న మన్‌హటన్‌లో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న సమావేశంలోనూ గ్రెటా మాట్లాడింది.

గ్రెటా థన్‌బర్గ్‌ మాటల తూటాలు

ఇప్పటి వరకు గ్రెటా కొన్ని ప్రపంచ వేదికలపై తన గళం వినిపించింది. ప్రపంచాన్ని ఓ కొత్త మార్గంలో నడిపించే ఆలోచనలకు వేదికైన టెడ్‌ టాక్‌ షో నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ వరకు గ్రెటా చేసిన కొన్ని ప్రసంగాలు కోట్ల మందిని ఆలోచింపజేశాయి.

పర్యావరణ మార్పులను నిర్లక్ష్యం చేస్తున్న నేతలను ఉద్దేశించి సూటిగా ఆమె చేసిన కామెంట్స్‌.. సంచలనం కలిగించాయి. టెడ్‌ టాక్‌లో తొలిసారి మాట్లాడిన గ్రెటా ఆ తర్వాత వాతావరణ మార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ నిర్వహించిన సమావేశంలో, యురోపియన్‌ యూనియన్‌ వేదికపై, యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో, రెండున్నర లక్షల మంది పాల్గొన్న న్యూయార్క్‌ మీట్‌లో ప్రసంగించింది.

ముఖ్యంగా తొలిసారి టెడ్‌ టాక్‌ షోలో గ్రెటా మాట్లాడిన తర్వాత ఆమెకు స్టాండింగ్‌ ఒవేషన్‌ లభించిన తీరు అద్భుతం. గ్రెటా మాట్లాడుతున్నంతసేపూ నిశ్శబ్దంగా ఉన్న ఆడిటోరియం.. ఆ తర్వాత ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆయా సమావేశాల్లో గ్రెటా ప్రసంగాల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం.

టెడ్‌ టాక్‌ (నవంబర్‌, 2018)

– మీ పిల్లలంటే మీకు చాలా ఇష్టమని చెబుతున్నారు. కానీ వాళ్ల కళ్ల ముందే మీరు వాళ్ల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.
– మనం మారాలి. స్వీడన్‌లాంటి సంపన్న దేశాలు వెలువరుస్తున్న కర్బన ఉద్గారాలు ప్రతి ఏటా కనీసం 15 శాతం మేర తగ్గాలి.
– పర్యావరణ సంక్షోభాన్ని ఎవరూ గుర్తించడం లేదు. దానిపై ఎమర్జెన్సీ మీటింగ్‌లు లేవు. మీడియా ఎప్పుడూ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు.
– 30 ఏళ్లుగా దీనిపై చర్చలు జరుగుతున్నా మనం సాధించింది ఏమీ లేదు.
– వాతావరణ మార్పు వల్ల ప్రతి రోజూ 200 జాతులు నశిస్తున్నాయి. ప్రపంచం వినాశనానికి చేరువవుతోంది. పదివేల రెట్లు వేగంగా ఈ వినాశనం వైపు మనం అడుగులు వేస్తున్నాం.
– కొత్తగా చేయాల్సిందేమీ లేదు. వాతావరణ సంక్షోభానికి పరిష్కారం ఎప్పుడో దొరికింది. మనం కాస్త మేలుకొని, మారితే చాలు.

కాప్‌24 (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ద పార్టీస్‌ 24వ సమావేశం)

– స్వీడన్‌ ఓ చిన్న దేశం. మీరు చేసేది ఎవరు పట్టించుకుంటారు అన్నారు. కానీ ఓ  మార్పు తీసుకురావడానికి మీరెప్పుడూ చిన్నవాళ్లు కాదని నేను అనుకుంటాను.
– ప్రపంచ నేతలను అడుక్కోవడానికి ఇక్కడికి రాలేదు.. మీరు మమ్మల్ని గతంలో పట్టించుకోలేదు.. భవిష్యత్తులోనూ పట్టించుకోరు.. ఇక మీరు చెప్పిన సాకులు చాలు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఓ మార్పు వస్తోంది.

ఈయూ నేతలకు వార్నింగ్‌

– భయం వల్ల మనకు ఏ మంచీ జరగదని చాలా మంది నేతలు నాతో అన్నారు. నిజమే.. కానీ మీ ఇల్లు తగలబడుతుంటే.. ఇలాగే భయపడకుండా ఉంటారా? ఆ బూడిదను చూస్తే ఎంతోకొంత భయం వేస్తుంది.
– మన ఇల్లు తగులబడుతుంటే.. నేతలు ఏమీ చేయడం లేదు. ఇక్కడ మన ఇల్లు తగులబడుతుంటే.. మీరు మూడు బ్రెగ్జిట్‌ సమావేశాలు నిర్వహిస్తారా.. ఒక్క సమావేశం కూడా వాతావరణ సంక్షోభంపై ఎందుకు నిర్వహించడం లేదు?
– వాతావరణ సంక్షోభంపై మీ కళ్లు తెరిపించడానికే కోట్ల మంది చిన్నారులు స్కూళ్లు మానేసి రోడ్లెక్కుతున్నారు.
– కొన్ని పార్టీలు నేనీ రోజు ఇక్కడ మాట్లాడవద్దని కోరుకున్నాయి. ఎందుకంటే ఆ పార్టీలు వాతావరణ సంక్షోభంపై నేను మాట్లాడకూడదని అనుకుంటున్నాయి.
– ఓ 16 ఏళ్ల ఈ స్కూల్‌ అమ్మాయి చెప్పే మాటలను మీరు పట్టించుకోకపోవచ్చు. కానీ సైంటిస్టులు చెప్పేది వినండి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులు తమ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటాన్ని గుర్తించండి.

యూఎన్‌ జనరల్ అసెంబ్లీ

– మీరు చాలా తప్పు చేస్తున్నారు. అసలు నేను ఈరోజు ఇక్కడ ఉండాల్సింది కాదు. నేను స్కూల్లో ఉండాలి. కానీ మీ చేతగాని మాటలతో మీరు నా కలలను, నా బాల్యాన్ని దోచుకున్నారు. మీకెంత ధైర్యం?

– పర్యావరణం మొత్తం నాశనం అవుతోంది. కోట్ల మంది చనిపోతున్నారు. అయినా మీకు మాత్రం డబ్బు, ఆర్థికవృద్ధి తప్ప మిగతావేవీ పట్టవు. మీకెంత ధైర్యం?

– మా బాధ మీకు అర్థమైందని అంటున్నారు. కానీ 30 ఏళ్లుగా సైంటిస్టులు ఈ సంక్షోభాన్ని నివారించడానికి చెబుతున్న పరిష్కారాలను ఎందుకు పాటించడం లేదు.

– మీరు చేసిన తప్పిదాల వల్ల మా తరం వాళ్లు ప్రతి నిమిషం కొన్ని కోట్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది.

– రోజు రోజుకూ ఈ సమస్య మరింత తీవ్రమవుతున్నా.. ఎప్పటిలాగే చేతులు ముడుచుకొని కూర్చుంటూ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడానికి మీకు ఎంత ధైర్యం?

– వాతావరణ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నా.. సమస్యను ఉన్నదున్నట్లుగా చెప్పకుండా నటిస్తున్నారు.

– మీ నమ్మక ద్రోహాన్ని భవిష్యత్‌ తరాలు అర్థం చేసుకుంటున్నాయి. మీరిలాగే మాటలతో కాలం వెల్లదీస్తే.. మేమెప్పటికీ మిమ్మల్ని క్షమించం.

– ఇక దీనిని ఎంతమాత్రం భరించేది లేదు..

న్యూయార్క్‌ మీటింగ్‌

– వాళ్లు మన మాట వింటారని అనుకుంటున్నారా? వాళ్లు వినేలా చేద్దాం.
– మన నేతలను మేలుకొలిపేందుకే ఈ నిరసనలు. ఇప్పటికైనా ప్రపంచ వినాశనానికి దారి తీస్తున్న వాతావరణ సంక్షోభంపై వాళ్లు సరైన చర్యలు తీసుకోవాలన్నదే మన లక్ష్యం. మెరుగైన భవిష్యత్తు మన హక్కు.
– మనమందరం ఐకమత్యంగా ఉందాం.. మనల్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
– ఈ సంక్షోభానికి కారణమవుతున్న వాళ్లను బాధ్యులను చేద్దాం. ప్రపంచ నేతల మెడల వంచుదాం. ఇది ఆరంభం మాత్రమే. మీకు నచ్చినా నచ్చకపోయినా ఓ మార్పు వస్తోంది.

గ్రెటా థన్‌బర్గ్‌‌ పై విమర్శలు

ఓ 16 ఏళ్ల అమ్మాయి తమను ప్రశ్నిస్తుంటే సహజంగానే ప్రపంచ స్థాయి నేతలు తట్టుకోలేకపోతున్నారు. అందులోనూ విమర్శను అసలు తట్టుకోలేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమెపై సెటైర్లు కూడా వేశారు. పర్యావరణంపై ఆమె కాస్త ఎక్కువగానే ఆందోళన చెందుతోందంటూ ట్రంప్‌ విమర్శించారు. ఆమెను చూస్తే తన ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలాగా కనిపిస్తోంది అంటూ ట్రంప్‌ ఓ సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు.

దీనికి గ్రెటా థన్‌బర్గ్‌ కూడా ఘాటుగానే స్పందించింది. ఆ ట్వీట్‌నే తన ట్విటర్‌ బయో పేజ్‌గా పెట్టుకొని నిరసన తెలిపింది. పర్యావరణ మార్పులపై జరిగిన సదస్సులో ట్రంప్‌ అటు వైపుగా వెళ్తుండగా.. గ్రెటా థన్‌బర్గ్‌‌ ఆయనను కోపంగా చూస్తున్న ఫొటో కూడా బాగా వైరల్‌ అయింది.

ఇక ఆమె చేసే ప్రసంగాలు కూడా ఆమె సొంతంగా రాసుకోదని మరికొందరు విమర్శిస్తుంటారు. ఈ విమర్శలను కూడా గ్రెటా థన్‌బర్గ్‌‌ దీటుగానే తిప్పికొట్టింది. నా వెనుక ఎవరూ లేరు. నా ప్రసంగాలను నేనే రాసుకుంటాను. తరచూ సైంటిస్టులను కలిసి మాట్లాడుతుంటాను. నేను చెప్పే మాటల్లో ఏమాత్రం తప్పు లేకుండా చూసుకుంటాను అని గ్రెటా వివరణ ఇచ్చింది. 

ఇవి కూడా చదవండి

♦ ఆర్థిక మాంధ్యంపై మన్మోహన్ సింగ్ ఏమన్నారు?

♦ ముగ్గురు ప్రధానులు ఔట్.. అసలు ఏంటీ బ్రెగ్జిట్

Previous articleస్మోకింగ్ ఎలా మానేయాలి? మానేస్తే ప్రయోజనాలు ఏంటి?
Next articleFreelance jobs: ఫ్రీలాన్స్‌ జాబ్.. రిమోట్ జాబ్.. వర్క్ ఫ్రమ్ హోం జాబ్ కావాలా