మన కష్టార్జితాన్ని అవసరాలకు ఖర్చు చేస్తూ దాదాపుగా 30 శాతం పొదుపు చేయడం ఉత్తమ లక్షణం. మరి చేసే పొదుపు తోచినరీతిలో బ్యాంకులో దాచుకుంటామా? బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటో తెలుసుకుని, అత్యుత్తమ ప్రతిఫలం ఎక్కడ వస్తుందో ఆరా తీసి మరీ మన పొదుపును పెట్టుబడిగా మారుస్తాం. మనం చేసే పొదుపు విత్తుగా నాటితే కాయలు కాస్తూ.. ఆ కాయలు విత్తనాలుగా మారి సంపద పెంచేలా ఉండాలి. కానీ మొత్తానికి మొత్తం నష్టపోయేలా ఉండరాదు. సరైన ప్రతిఫలమూ లేకుండా కేవలం మూడు శాతం వడ్డీ ఇచ్చే సేవింగ్స్ ఖాతాలోనూ అలా వదిలేయరాదు.
రిస్క్, రిటర్న్స్ ఆధారంగా ఇప్పుడు సేవింగ్స్‌ను దాచుకోవడానికి చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సరైన ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్ లేకపోవడం కాదు.. రిస్క్‌ను మేనేజ్ చేయడం అన్న సూత్రాన్ని పాటించాలి. 25 ఏళ్ల వయసులోపే ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రారంభించడం వల్ల వివిధ పద్దతుల్లో పెట్టుబడులు పెట్టడానికి తగిన సమయం వాళ్లకు దక్కుతోంది. ప్రస్తుతం మీ సేవింగ్స్‌ను దాచుకోవడానికి అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్లు ఏంటో డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.
టాప్ 9 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఏంటి?
- డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్
- మ్యూచువల్ ఫండ్స్
- ఈక్విటీ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్)
- నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
- ఫిక్స్డ్ డిపాజిట్స్
- బాండ్స్
- గోల్డ్
- రియల్ ఎస్టేట్
1. డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్
అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కానీ చాలా రిస్క్‌తో కూడుకున్నది. నష్టభయం ఉంటుంది. అందుకు తగినట్లే రిటర్న్స్ కూడా ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటే సరళంగా చెప్పాలంటే.. మీరొక కంపెనీ స్థాపించాలనుకున్నారు అని అనుకుంందాం కాసేపు. ఎందుకు కంపెనీ స్థాపించాలనుకుంటున్నారు? ఎలాంటి కంపెనీ స్థాపించాలనుకుంటున్నారు? ఏ సేవలు లేదా ఉత్పత్తులు అందించాలనుకుంటున్నారు? వాటికి మార్కెట్ లో గిరాకీ ఎలా ఉంది? ఎలా విస్తరించాలనుకుంటున్నారు? ఎంత కాలం ఆ కంపెనీ కొనసాగించాలనుకుంటున్నారు? ఇవన్నీ మీరు చాలా లోతుగా శోధించిన తరువాతే కంపెనీ స్థాపిస్తారు.
అవును కదా.. అలాగే ఇప్పటికే ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు స్టాక్ మార్కెట్ మనకు వీలు కల్పిస్తుంది. ఇందుకోసం మనకు ఒక ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ ఖాతా ఉంటే సరిపోతుంది. మీరే సొంతంగా కంపెనీ పెడితే ఎలా లోతుగా ఆలోచిస్తారో ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీల గురించి కూడా లోతుగా శోధించి వాటి భవిష్యత్తుపై ఒక అంచనాకు వచ్చి దీర్ఘకాలం మీ పెట్టుబడులను అందులో ఉంచగలిగితేనే స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ కావడం ఉత్తమం. లేదంటే మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
సరైన స్టాక్‌ను ఎంపిక చేసుకోవడంతోపాటు ఎప్పుడు కొంటున్నారు.. ఎప్పుడు అమ్ముతున్నారు అన్న అంశాలపై రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఓపిక అనేది చాలా అవసరం. దీర్ఘకాలం పాటు వేచి చూస్తే.. మంచి లాభాలు వస్తాయి. ఇందులో రిస్క్ కాస్త తగ్గించుకోవాలి అనుకుంటే.. మీ పెట్టుబడులను విభజిస్తే మంచిది. ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాల్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి. ఒక రంగం కంపెనీల్లో నష్టం వచ్చినా.. మరో రంగం ఆదుకుంటుంది. మార్కెట్లు కుప్పకూలిన సమయంలో అన్ని రంగాలూ నష్టపోయే ప్రమాదమూ ఉంటుంది. అందువల్ల డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి దిగే ముందు మార్కెట్ గురించి పూర్తిగా అధ్యయనం చేయడం అవసరం. ప్రస్తుతం ఏడాదికి సగటున 13 శాతం వరకు రిటర్న్స్ వస్తున్నాయి.
2. మ్యూచువల్ ఫండ్లు
మార్కెట్ మీద మనకు అవగాహన లేనప్పుడు నిపుణులైన వారు మీకు బదులుగా పెట్టుబడులను పెడతారు. అంటే దీనికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ మేనేజర్ తన రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా కొన్ని స్టాక్స్ ఎంచుకుంటారు. మీరు ఆ ఫండ్ ఎంచుకుంటే ఏకమొత్తంలోగానీ, నెలనెలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పద్ధతిలో గానీ మీరు యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. నిపుణులైన మేనేజర్లు ఉంటారు కాబట్టి నష్టభయం తక్కువ. ఇవి కూడా మార్కెట్లు కుప్పకూలినప్పుడు మనకు ప్రతిఫలాన్ని తక్కువగా ఇస్తాయి. లేదా నష్టాన్ని ఇస్తాయి. కానీ సాధారణంగా ఏటా 12 నుంచి 15 శాతం వరకు సగటు ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి.
ఈ మ్యూచువల్ ఫండ్లలో కూడా నష్టభయం తక్కువగా ఉండేవి, ప్రతిఫలం వచ్చే విధంగా ఉండేవి (డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్) , పన్ను మినహాయింపు(ఈఎల్ఎస్ఎస్) ఇచ్చేవి.. ఇలా అనేక రకాలుగా ఉంటాయి. మన రిస్క్ సామర్థ్యం బట్టి మనం ఎంచుకోవచ్చు. రిస్క్ తక్కువగా ఉంటే ప్రతిఫలం కూడా తక్కువగా ఉంటుంది.
3. ఈఎల్ఎస్ఎస్
ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇది కూడా మ్యూచువల్ ఫండే. కానీ దీనికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈ స్కీమ్ లో మీరు పెట్టే ప్రతి పైసాను మూడేళ్ల అనంతరమే తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు సిప్ విధానంలో ఈ నవంబరులో రూ. 3 వేలు.. ఇలా నెలనెలా రూ. 3 వేలు పెట్టారనుకుందాం.. నవంబరులో పెట్టిన రూ. 3 వేలు, దానిపై వచ్చే ప్రతిఫలాన్ని స్వీకరించడానికి మూడేళ్ల పాటు ఆగాల్సిందే. అలాగే తదుపరి నెలలో పెట్టే రూ. 3 వేలు, ప్రతిఫలం స్వీకరించేందుకు కూడా మూడేళ్లు ఆగాల్సిందే. ఇది చాలా పాపులర్ స్కీమ్. ఇదొక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా చెప్పాలి.
ఆదాయ పన్ను వర్తించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఫండ్ ఇది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు గరిష్ఠంగా లక్షన్నర వరకు పన్ను మినహాయింపు ఉండటం విశేషం. ప్రస్తుతం లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్స్‌పై పది శాతం పన్ను విధిస్తున్నా.. మిగతా పన్ను మినహాయింపు స్కీమ్‌లతో పోలిస్తే ఇప్పటికీ ఇదే లాభదాయకంగా ఉంది. సగటున 18 శాతం మేర రిటర్న్స్ వస్తుండటం విశేషం. మార్కెట్‌పై అవగాహన ఉంటే ఉత్తమమైన స్టాక్స్ ఉన్న ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఎంచుకోవచ్చు.
4. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)
ఇది దీర్ఘకాలిక, పదవీ విరమణ ఆధారిత స్కీమ్. 1999లో ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రారంభించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద అందరికీ రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది కదా.. ఇది పోనూ 80 సీసీడీ (1బీ) కింద మరో రూ. 50 వేల వరకూ ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. దీంతో ఈ స్కీమ్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది.
టైర్ 1 స్కీమ్ లో ఏడాదికి కనీసం వెయ్యి రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇది ఆరు వేలుగా ఉండేది. రిస్క్ సామర్థ్యం అనుసరించి ఈక్విటీ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అంటే ఎంత శాతం ఈక్విటీల్లో పెట్టాలో మీరే నిర్ణయించవచ్చు. లేదా మీ వయసుకు అనుగుణంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ కేటాయిస్తుంది. ఐదేళ్ల సగటు ప్రతిఫలం ప్రస్తుతం 11 శాతంగా ఉంది.
5. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ ఉత్తమమైనది. ఏడాదికి గరిష్ఠంగా లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుత త్రైమాసికం అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలానికి దీనిపై 7.9 శాతం వడ్డీ వస్తోంది. పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్చుతుంటుంది. పూర్తి పన్ను రహిత వడ్డీని ఈ పీపీఎఫ్ ద్వారా ఆర్జించే వీలుంటుంది. ప్రతి ఏటా మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి వడ్డీని కలుపుతుంటారు. అయితే అప్పటికప్పుడు రిటర్న్స్ ఇందులో సాధ్యం కాదు. దీర్ఘకాలంలో మంచి లాభాలు ఉంటాయి.
6. ఫిక్స్డ్ డిపాజిట్స్
మీ విలువైన డబ్బును చాలా భద్రంగా దాచుకునేందుకు సరైన మార్గం ఈ ఫిక్స్డ్ డిపాజిట్. మీరు కొంత మొత్తాన్ని, కొంత కాలానికి, ఓ నిర్ణీత వడ్డీ రేటుకు ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ వడ్డీ కావాలని అనుకున్నా.. ఆ ఆప్షన్లు కూడా ఇందులో ఉంటాయి. ఇక వడ్డీని కూడా నెలవారీ లేదా మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అర్జెంట్‌గా మీకు డబ్బు అవసరమైతే.. డిపాజిట్‌ను ముందుగానే తీసుకోవచ్చు. లేదంటే ఈ డిపాజిట్‌పై లోన్ కూడా ఇస్తారు. ఎప్పటికప్పుడు వడ్డీ వద్దని మీరు అనుకుంటే.. నెలవారీగా వస్తున్న వడ్డీని అలాగే రీ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే సరి. ఫిక్స్డ్ డిపాజిట్ కాల పరిమితి ముగిసిన తర్వాత ఒకేసారి భారీ మొత్తం మీ చేతికి అందుతుంది. వడ్డీని మీ ఆదాయంలో చూపించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని పన్ను మినహాయింపు వర్తించే ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉంటాయి. కానీ వాటికి ఐదేళ్లపాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది.
7. బాండ్స్‌లో మంచి ప్రతిఫలమే
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు కొన్ని రకాల బాండ్లు ఇస్తుంటాయి. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చాలా భద్రంగా ఉంటుంది. కొంత సమయానికి ముందుగానే చెప్పిన వడ్డీ రేటుకు మీరు ఇచ్చిన రుణం మొత్తాన్ని తీర్చేస్తామన్నట్లుగా బాండ్లు జారీ చేస్తారు. గడువు ముగిసిన తర్వాత బాండ్ జారీ చేసిన వాళ్లు మీ అసలును వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. వీటిలో కూడా మంచి ప్రతిఫలం పొందవచ్చు.
8. గోల్డ్, గోల్డ్ డిపాజిట్స్
బంగారానికి, భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. ప్రతి ఏటా టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం మనది. అయితే చాలా వరకు బంగారం కొని, వాటిని నగలుగా చేసుకొని మురిసిపోతుంటారు. ఇవి ఏడాదిలో ఎక్కువ భాగం ఇంట్లోని లాకర్లలోనూ మూలుగుతుంటాయి. ఇది సరైన విధానం కాదని నిపుణులు చెబుతున్నా.. ఇటీవల 10 గ్రాముల బంగారం రూ. 40 వేలను తాకడంతో.. నగలు చేయించుకున్నా నష్టం లేదని, అవసరాల రీత్యా కొద్దికొద్దిగా కొన్న నగల విలువ క్రమంగా పెరిగిందని మహిళలు అంటున్నారు.
అయితే నిపుణులు చెప్పేదేంటంటే పేపర్ గోల్డ్ చాలా బెటర్. పేపర్ గోల్డ్ అంటే.. బంగారంపై పెట్టుబడి. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ)లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేసుకునే వీలుంది. బంగారం ధరలపై ఆధారపడి స్టాక్ మార్కెట్లో ఈ గోల్డ్ ఈటీఎఫ్ అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. మూడు, నాలుగేళ్ల కిందటి నుంచి భారత ప్రభుత్వం మరో పేపర్ గోల్డ్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సావరిన్ గోల్డ్ బాండ్స్.
రెండు, మూడు నెలలకోసారి ప్రభుత్వం ఈ బంగారం బాండ్లను అప్పటి రేటు ఆధారంగా కొనుగోలు కోసం విడుదల చేస్తుంది. ఆసక్తి ఉంటే ఈ బాండ్లను కొనుక్కోవచ్చు. ఎనిమిదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసే వీలుంటుంది. అయితే ఐదేళ్ల తర్వాత ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఏడాదికి 2.7 శాతం వడ్డీ వస్తుంది. మీరు విత్ డ్రా చేసుకునే సమయానికి బంగారం ధర ఎంత ఉందో అంత మొత్తంతోపాటు ఈ వడ్డీ చెల్లిస్తారు. మీకు ఏ తొందర లేదు అనుకుంటే.. పూర్తి 8 కాలానికి గోల్డ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభం ఉంటుంది.
9. రియల్ ఎస్టేట్
రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడితే ఎలాంటి రిటర్న్స్ ఉంటాయో మీరు వినే ఉంటారు. అయితే భూములు, ఫ్లాట్లు, ఇళ్ల కొనుగోలుకు చాలా డబ్బులు అవసరం. ఒకేసారి అంత మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయలేం. విల్లా, ఇండిపెండెంట్ హౌజ్, అపార్ట్ మెంట్ కొనుగోలుకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అందుబాటు ధరల్లో ఉన్నప్పుడు లోన్ తీసుకుని కొనేసుకోవడం మంచిది. లేదా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ మెంట్ చేయగలమనుకుంటే నగర శివార్లలో ఎంత దూరమైనా సరే స్థలాలు కొనుగోలు చేయడం మేలు చేస్తుంది. రియల్ ఎస్టేట్ కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా చెప్పాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి