Mutual funds investment: మ్యూచువల్ ఫండ్స్ లాభదాయకమైన పెట్టుబడి సాధనాలు. నేరుగా మనం పెట్టుబడి పెట్టలేనప్పుడు నిపుణులు నిర్వహించే ఈ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే నిశ్చింతగా ఉండడమే కాకుండా.. దీర్ఘకాలిక పెట్టుబడులపై గణనీయమైన లాభాలు గడించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రాథమిక విషయాలను డియర్ అర్బన్ డాట్ కామ్ 10 పాయింట్లలో సరళంగా మీ కోసం అందిస్తోంది.
1. Mutual fund meaning in telugu: మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి?
మ్యూచువల్ ఫండ్ అంటే అనేక మంది పెట్టుబడి పెట్టే ఒక నిధి. దీనిని నిర్వహించేందుకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. పెట్టుబడుల మొత్తాన్ని ఈ మేనేజర్ ఈక్విటీలు (స్టాక్‌మార్కెట్), బాండ్లు, మనీ మార్కెట్, సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడతారు. ఈ ఫండ్ ఆదాయ వ్యయాలు పోను మిగిలే మొత్తం విలువను నెట్ అసెట్ వ్యాల్యూ(ఎన్ఏవీ)గా లెక్కించి పంపిణీ చేస్తారు. ఈ ఎన్ఏవీ ఆధారంగానే ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.
2. Why we need to invest in mutual funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఎందుకు?
మనకు ఒక పనిలో నైపుణ్యం ఉంటే మనమే చేస్తాం. కానీ నైపుణ్యం లేనప్పుడు సదరు వృత్తిలో నిపుణుడితో చేయించుకుంటాం. అలాగే మనకు పెట్టుబడి ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు మనం సంబంధిత వృత్తి నిపుణుడిని ఎంచుకుంటాం. మ్యూచువల్ ఫండ్స్‌ను నిర్వహించేవారి సహాయం తీసుకుంటాం. మీరే నేరుగా పెట్టుబడి అవకాశం ఉన్నా, నిర్వహించుకునే నైపుణ్యం ఉన్నా.. ఒక్కోసారి మీకు సమయం దొరకకపోవచ్చు.
ఎప్పుడు ఏ పెట్టుబడి సాధనంలో మన పెట్టుబడులు ఉండాలి? ఎప్పుడు ఉపసంహరించుకోవాలన్న అంశాన్ని ఫండ్స్ మేనేజర్ చూస్తారు. ఎలాంటి పెట్టుబడి సాధనంలో పెట్టాలనుకుంటే అలాంటి పెట్టుబడితో కూడిన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకునే వీలుంది.
3. How to invest in Mutual fund: మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలంటే?
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో నేరుగా ఆన్లైన్లో గానీ, వారు అధీకృతం చేసిన డిస్ట్రిబ్యూటర్, బ్యాంకర్, ఏజెంట్ల ద్వారా గానీ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. దాదాపుగా ఇప్పుడు అన్ని సంస్థలు ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నాయి.
ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, టాటా మ్యూచువల్ ఫండ్ కంపెనీ, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ..ఇలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని బ్యాంకులు నెట్‌బ్యాంకింగ్ ద్వారా కూడా నేరుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
నో యువర్ కస్టమర్ (కేవైసీ) పత్రాన్ని, స్కీమ్ అప్లికేషన్ పత్రాన్ని నింపాలి. ఈ పత్రాల్లో మన చిరునామా, పాన్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలన్నీ నింపాల్సి ఉంటుంది. ఎన్ఏవీ ఆధారంగా మనకు యూనిట్లు కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక ఫండ్ ఎన్ఏవీ విలువ రూ. 10 ఉందనుకుంటే మీరు రూ. 1000 పెట్టుబడి పెడితే వంద యూనిట్లు వస్తాయి. ఇక ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నవారు కూడా నేరుగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టొచ్చు.
4. How much money we need to invest in Mutual funds: మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత అవసరం?
మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే నెల నెలా రూ. 500 చొప్పున కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా నెలనెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే విధానాన్ని క్రమానుగత పెట్టుబడి పథకం లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అంటారు. నెలానెలా కాకుండా ఒకేసారి కూడా పెట్టుబడి పెట్టొచ్చు.
5. How to withdraw money from mutual fund: మ్యూచువల్ ఫండ్ నుంచి ఎలా నగదు వెనక్కి తీసుకోవచ్చు?
మ్యూచువల్ ఫండ్ నుంచి నగదు వెనక్కి తీసుకోవాలంటే మనకు కేటాయించిన యూనిట్లను రిడెంప్షన్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు రూ. 10ల ఎన్ఏవీ ఉన్నప్పుడు కొన్న 100 యూనిట్లను ఎన్ఏవీ విలువ రూ. 15లకు పెరిగినప్పుడు అమ్మితే వంద యూనిట్లకు గాను రూ. 500 లాభం వస్తుందన్నమాట. రిడెంప్షన్ చేసిన తరువాత 3 రోజుల్లోపు నిధులు మన బ్యాంకు ఖాతాలో చేరుతాయి. అయితే ఇందులో కొన్ని స్వల్ప రుసుములు ఉంటాయి. కొన్ని ఫండ్స్‌లలో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అంటే నిర్ధేశిత కాలం దాటకుండా రిడెంప్షన్ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ రుసుము ఉంటుంది. అంటే ఉదాహరణకు నిర్ధేశిత కాలం ఏడాది అనుకుంటే.. ఈ ఏడాది కాలంలో మీరు వెనక్కి తీసుకున్నప్పుడు 0.5 శాతం లేదా నిర్ధిష్ట మొత్తాన్ని ఎగ్జిట్ లోడ్‌గా చెల్లించాల్సి ఉంటుంది.
6. Types of Mutual funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఏయే రకాలు ఉంటాయి?
మ్యూచువల్ ఫండ్స్‌లో మన అవసరాలను బట్టి, మన రిస్క్ సామర్థ్యాన్ని బట్టి విభిన్న పథకాలను ఎంచుకోవచ్చు. వీటిలో ఉంటే విభిన్న పథకాలు ఇవీ
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
హైబ్రీడ్ ఫండ్స్
ఇన్‌కం ఫండ్స్ లేదా బాండ్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్
7. What are Equity funds: ఈక్విటీ ఫండ్స్ అంటే…
ఈక్విటీ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయడం. అంటే లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం. లిస్టెడ్ కంపెనీలంటే ఉదాహరణకు కోల్గెట్, హిందుస్తాన్ యూనిలివర్, నెస్లే, విప్రో, టీసీఎస్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, అజంతా ఫార్మా, ఇలా రకరకాల ఉత్పత్తులు చేసే, సేవలు అందించే సంస్థలు. అవి స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్నప్పుడు వాటిలో వాటాలు కొనుగోలు చేయాలంటే ఈక్విటీ ఫండ్స్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.
విడివిడిగా ఆయా కంపెనీల్లో నేరుగా మనం స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు. కానీ స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకుంటే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలం వేచి ఉంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయా కంపెనీల పనితీరు ఆధారంగా మన ఫండ్ విలువలో మార్పు ఉంటుంది. అంటే కంపెనీ మంచి పనితీరు కనబరిస్తే మన ఫండ్ విలువ పెరుగుతుంది. మనకు లాభం వస్తుంది. లేదంటే ఫండ్ విలువ తగ్గి నష్టం వస్తుంది. ఈక్విటీ ఫండ్స్‌లో లాభనష్టాలకు ఆస్కారం ఉంటుంది. అంటే రిస్క్‌కు తగ్గట్టుగా లాభనష్టాలు ఉంటాయి.
8. Types of equity mutual funds: ఈక్విటీ ఫండ్స్‌లో విభిన్న రకాలు
ఈక్విటీ ఫండ్స్‌లో మళ్లీ అనేక రకాలు ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో మాత్రమే షేర్లు కొనుగోలు చేసి ఫండ్ నిర్వహిస్తే దానిని లార్జ్ క్యాప్ ఫండ్ అంటారు. మీడియం సైజు కంపెనీల్లో కొనుగోలు చేసి ఫండ్ నిర్వహిస్తే దానిని మిడ్ క్యాప్ ఫండ్ అంటారు.
చిన్న సైజు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్లను స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటారు. పెద్ద, చిన్న సైజు కంపెనీల షేర్లు కలిపి ఉంటే దానిని మల్టీ క్యాప్ ఫండ్ అంటారు. అలాగే సెక్టార్ ఫండ్స్ అని మరో రకం ఫండ్స్ ఉంటాయి. అంటే ఒకే రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అన్నమాట. ఉదాహరణకు ఫార్మా కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెట్టడం లేదా టెక్నాలజీ కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెట్టడం.
ఇక థీమాటిక్ ఫండ్ అనేది మరో రకం. అంటే పెట్టుబడుల వెనక ఒక థీమ్ ఉండడం. ఉదాహరణకు అటోమొబైల్ రంగం చుట్టూ అల్లుకున్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం లేదా, నిర్మాణ రంగం చుట్టూ ఇమిడి ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టడమే థీమాటిక్ ఫండ్ ఉద్దేశం.
Equity linked saving schemes: ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్
టాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్ కూడా ఈక్విటీ ఫండ్స్ లో ఒక రకం. ఈ ఫండ్ కు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి పెట్టుబడికి కనీసం 3 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ కాలం పూర్తయ్యేవరకు మనం వెనక్కి తీసుకోలేం. మనం సిప్ లో పెట్టుబడి పెట్టినా ప్రతి నెలలో చేసే పెట్టుబడికి మూడేళ్ల కాలపరిమితి పూర్తవ్వాలి. లాకిన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి నష్టభయాలు తక్కువగా ఉంటాయి.
9. Income Funds or Bond funds: ఇన్‌కం ఫండ్స్ లేదా బాండ్ ఫండ్స్
ఈ ఫండ్స్ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవు. అంటే మార్కెట్ హెచ్చుతగ్గులతో పెద్దగా సంబంధం ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్‌కం సెక్యూరిటీలు, బాండ్లు, డిబెంచర్లు, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లు వంటి వాటిలో పెట్టుబడి పెడతారు. లిక్విడ్ ఫండ్లు, షార్ట్ టర్మ్, డైనమిక్ బాండ్, గిల్ట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, ఫ్లోటింగ్ రేట్ వంటివి ఈ కోవలోకి వచ్చే ఫండ్లు.
10. Hybrid mutual funds: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే..
ఈక్విటీ మార్కెట్లోనూ, ఫిక్స్డ్ ఇన్‌కం స్కీముల్లోనూ పెట్టుబడి పెట్టే ఫండ్స్ అన్నమాట. అంటే రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. తప్పనిసరి ఆదాయం కల్పించడం, వృద్ధికి అవకాశం ఉండడం వీటి లక్ష్యాలు. బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని, పెన్షన్ ప్లాన్ అని, చైల్డ్ ప్లాన్ అని రకరకాలుగా ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్ గురించి సమగ్రంగా తెలుసుకున్నాం కదా.. ఏయే లక్ష్యాలకు అనుగుణంగా ఎలాంటి ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాలో, ఏయే ఫండ్స్ బాగా రాణిస్తున్నాయో, దశాబ్దాలుగా ఉత్తమ ఫండ్స్ గా ఉన్నవేంటో, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ఉత్తమమైనవేంటో మరిన్ని కథనాల్లో తెలుసుకుందాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా మరిన్ని కథనాల్లో తెలుసుకుందాం. అలాగే సిప్ ద్వారా పెట్టుబడి పెడితే బాగుంటుందా? లేక ఏకమొత్తంలో పెట్టుబడి పెడితే ఫలితం ఉంటుందా కూడా తెలుసుకుందాం.
ఈ కథనం నచ్చితే షేర్ చేయాలని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు.
ఇవి కూడా చదవండి