వెబ్‌ సిరీస్ః ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ సీజన్‌ 2 రివ్యూ

four more shots please new season
[yasr_overall_rating null size=”medium”]

ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ లో ఏప్రిల్‌ 17న విడుదలైంది. సీజన్ 1 చూసిన వాళ్లకు ఇప్పటికే దీనిపై అవగాహన ఉంటుంది. తమ అభిప్రాయాలను గౌరవించగలిగే సమాజాన్ని కోరుకునే స్వేచ్ఛాపిపాసులు, అసమానతను ఎత్తిచూపుతూ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించే నలుగురు యువతుల చుట్టూ అల్లుకున్న కథ ఇది.

వీరిలో చాందసత్వం, చాదస్తం అసలే ఉండదు. నిజానికి వీరి జీవితంలోని ప్రతి అడుగు వాటిపై పోరాటేమే. ఆధునిక యువతులుగా తమ జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటూ, రిలేషన్‌షిప్స్‌లో ఎదురయ్యే భావోద్వేగాలతో సంఘర్షణ పడుతుంటారు. తిరుగుబాటు ధోరణితో కనిపిస్తారు.. సీజన్‌ 1లో ఏం జరిగిందన్న అంశాలపై బోనస్‌గా రీకాల్‌ స్టోరీ ఇచ్చారు. ట్రక్‌ బార్‌లో కలిసిన నలుగురమ్మాయిలు వారి జీవన సంఘర్షణలో పరిష్కారాలు వెతుక్కుంటూ ఉండగా.. చివరకు ఓ సందర్భంలో వాగ్వాదం పెరిగి విడిపోతారు.

సీజన్‌ 2లో తిరిగి స్నేహితురాళ్లు ఎలా కలిశారు.. వారి ప్రేమలు, రిలేషన్‌షిప్స్‌తో ఎలా సతమతమయ్యారు.. చివరకు వారంతా ఆ ప్రేమను దక్కించుకున్నారా? కాదనుకున్నారా? ఎందుకు కాదనుకున్నారు? వంటి అంశాల చుట్టూ ఈ సీజన్ 2 నడుస్తుంది.

ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ వెబ్‌ సిరీస్‌ 18 ఏళ్ల పైబడి వయస్సున్న వారు మాత్రమే చూడాల్సిన వెబ్‌సిరీస్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ నిర్దేశించింది. ఈ సిరీస్‌లో రొమాన్స్, సెక్స్, ఆల్కహాల్‌ వంటి అంశాల చుట్టూ తిరుగుతూ ఉండడంతో బీ గ్రేడ్‌ సిరీస్‌లా విమర్శలు వచ్చినప్పటికీ.. సిరీస్‌లో ఉన్న అంతర్లీనమైన సందేశాన్ని పట్టుకుంటే సిరీస్‌తో పాటు మనం పయనించొచ్చు. నలుగురు అమ్మాయిల జీవిత సంఘర్షణ ఏంటి? వారు నమ్మిన ఆశయాలపై నిలబడగలిగారా? వారు ఎలాంటి పొరపాట్లు చేశారు? వంటి అంశాలు ఆలోచింపజేస్తాయి.

ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ సీజన్ 2 కథ

న్యాయవాది అంజనా మీనన్, ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ దామిని, జిమ్‌ ట్రైనర్‌ ఉమంగ్, ధనిక కుటుంబంలో పెరిగిన సిద్ధి పటేల్‌.. వీరంతా ట్రక్‌ బార్‌లో కలిసిన స్నేహితులు. వారి వారి జీవితాల్లో కష్టాలను, సుఖాలను పంచుకుంటూ ఇక్కడ నాలుగు షాట్స్‌ మద్యం తీసుకోవడం, భావోద్వేగాలు, సంఘర్షణ, విడిపోవడం ఇదంతా ఫోర్‌మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌– సీజన్‌ 1లో జరిగింది. ఇక సీజన్‌ –2 ప్రారంభంలో సిద్దీ పటేల్‌ ఇస్తాంబుల్‌ నుంచి బాగా తాగేసి ఉమంగ్‌కు ఫోన్‌ చేస్తుంది. డిప్రెషన్‌లో ఉండి వంతెనపై నుంచి దూకుతోందేమోనని భావించిన ఉమంగ్‌ మిగిలిన ఇద్దరు స్నేహితురాళ్లను తీసుకుని ఇస్తాంబుల్‌ వెళుతుంది. నాలుగు నెలలుగా మాట్లాడుకోని స్నేహితురాళ్లు ఈ సంఘటనతో మళ్లీ క్లోజ్‌ అవుతారు.

లవ్లీ గర్ల్ ఉమంగ్

ఉమంగ్‌ బైసెక్సువల్‌. బాలీవుడ్‌ తార సమారా కపూర్‌కు వ్యక్తిగత శిక్షణ ఇస్తూ ఆమెకు దగ్గరవుతుంది. అయితే సమారా కపూర్‌ లెస్బియన్‌ అని, ఉమంగ్‌ ఆమె పార్టనర్‌ అని బాహ్యప్రపంచానికి పొక్కడంతో సమారా కపూర్‌ డిప్రెషన్‌లోకి వెళుతుంది. ఇస్తాంబుల్‌ నుంచి తిరిగి వచ్చిన ఉమంగ్‌ సమారా కపూర్‌ ఇంటికి వెళ్లి తాను ప్రేమిస్తున్నానని, తనతో స్నేహాన్ని కొనసాగించాలని ప్రాధేయపడుతుంది. సమారా కపూర్‌ డిప్రెషన్‌లో ఉందని తెలుసుకున్న ఉమంగ్‌ ఆమెను తిరిగి మామూలు మనిషిని చేస్తుంది. వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందా? వారి బంధంలో ఎదురైన సమస్యలు ఏంటి?

కన్య్ఫూజన్ లో అంజనా

న్యాయవాదిగా రాణిస్తున్న అంజనా మీనన్‌ భర్త వరుణ్‌ బాధ్యతారాహిత్యంతో ఉంటాడని విడాకులు ఇస్తుంది. ఆయన కావ్యను పెళ్లి చేసుకుంటాడు. వారికి ఒక కూతురు ఆర్య. తాను ఎంతకష్టపడినా తనను ఎదగనివ్వడం లేదని లా ఫర్మ్‌ యాజమాన్యంతో విభేదాలు వచ్చి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభిస్తుంది. తన జూనియర్‌ అర్జున్‌ ఆమెతో ప్రేమలో పడతాడు. అతడితో శారీరక సంబంధానికి దారి తీస్తుంది. అయితే అర్జున్‌ భవిష్యత్తుకు ఇబ్బందని ఆ బంధాన్ని తెంచుకుంటుంది. మరో లా ఫర్మ్‌ యజమాని బోస్‌కు దగ్గరవుతుంది. ఈ బంధం వద్దని స్నేహితురాళ్లు చెప్పినా పెడచెవిన పెడుతుంది. చివరకు ఈ బంధం ఎటు వైపు దారితీసింది?

డేరింగ్ గర్ల్ దామినీ

దామినీ రిజ్వీరాయ్‌ తన జర్నలిస్ట్‌ జీవితానికి ముగింపు పలికి జడ్జి దామోదరం హత్య కేసుపై పుస్తకం రాస్తుంది. తొలిసిరీస్‌లో దూరమైన ప్రేమికుడు జై కి మళ్లీ దగ్గరవుతుంది. అయితే జైకి దగ్గరవడానికి ముందు డాక్టర్‌ అమీర్‌ వార్సీతో శృంగార సంబంధం వల్ల గర్భం దాలుస్తుంది. గర్భస్రావం చేయించుకోలేక, జైకి చెప్పలేక సతమతమవుతుంది.. తాను రాసిన పుస్తకం ప్రచురితమైందా? అమీర్‌తో కలిసి ఉందా? జైతో బంధం ఏమైంది?

సాధకురాలు సిద్ధీ

సిద్దీ పటేల్‌ హాఫ్‌ న్యూడ్‌ వీడియోల్లో నటించిందన్న నిజాల వల్ల ఆమె పెళ్లి పెటాకులై ఆమె ఇస్తాంబుల్‌కు వెళ్లిపోయింది. సీజన్‌ 2లో ఆమె తిరిగి వస్తుంది. బొద్దుగా ఉండే తన అవతారాన్ని ఎప్పుడూ ఏవగించుకుంటుంది. అయితే తనలో స్టాండప్‌ కమెడియన్‌ను గుర్తించిన స్నేహితుడు చివరకు తనను గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండమంటే తిరస్కరిస్తుంది. తన చిన్ననాటి స్నేహితుడు మిహిర్‌ మళ్లీ ఎలా దగ్గరయ్యాడు.. అతడి ప్రపోజల్‌ను అంగీకరించిందా?

ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే వేదికపై సమాధానం దొరుకుతుంది.. నలుగురు స్నేహితురాళ్లుగా సయానీ గుప్తా (దామినీ), కీర్తి కుల్హారి(అంజనీ మీనన్‌), సిద్ది (మాన్వి గాగ్రూ), బని జె వారి పాత్రల్లో జీవించారు. వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక దర్శకురాలు సీజన్‌ 2ను ఎక్కడా బోర్‌ కొట్టించకుండా కథనాన్ని ముందుకు తీసుకెళ్లిపోయారు.

ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ సీజన్‌ 2 ఇన్ బ్రీఫ్

డియర్‌ అర్బన్‌ రేటింగ్ః 3/5
జనర్స్ః కామెడీ, డ్రామా
డైరెక్టర్ః నుపుర్‌ అస్తానా
స్టారింగ్ః సయానీ గుప్తా, కీర్తి కుల్హారి, మాన్వి గాగ్రూ, బని జె, ప్రతీక్‌ బబ్బర్, నీల్‌ భూపాలం, లీసా రే, మిలింద్‌ సోమన్, సమీర్‌ కొచ్చర్, ప్రబల్‌ పంజాబీ, శివానీ దండేకర్‌

ఇవి కూడా చదవండి

ఇన్ సైడ్ ఎడ్జ్: వెబ్ సిరీస్ రివ్యూ

తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్ ఏంటి?

Previous articleMutual funds investment: మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి 10 పాయింట్లలో సరళంగా..
Next articleకరోనా మరణాలు లక్షన్నర.. రోజూ 80 వేలకు పైగా కొత్త కేసులు