కోవిడ్ 19 మహమ్మారి కోరలు చాచిన తొలినాళ్లలో దేశంలో పెద్దగా రాజకీయాలకు తావులేకుండా పోయింది. కానీ లాక్డౌన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్న తరుణంలో నెమ్మదిగా రాజకీయాలు రాజుకుంటున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలుచేసిన రాష్ట్రాలు 50 రోజులయ్యేసరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నచ్చక విమర్శల దాడికి దిగాయి. ఇక్కడే క్రమంగా రాజకీయ విమర్శలు దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి.
అయితే ఇదే సమయంలో రాష్ట్రాలకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. వలస కార్మికుల రూపంలో రాష్ట్రాలకు ఈ సమస్య వచ్చి పడింది. లక్షలాది మంది ఇతర రాష్ట్రాల్లో బతుకుదెరువు కోసం వెళ్లిన శ్రామిక జీవులంతా కోవిడ్ 19 నేపథ్యంలో అక్కడ ఉపాధి కరువై, బతుకు బరువై సొంతూళ్లకు పయనమయ్యారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా 35 లక్షల వలస శ్రామికులు సొంతూళ్లకు వెళ్లారు. అలాగే బస్సుల ద్వారా 40 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇక కాలినడకన, సైకిళ్లపైన, మోటార్ బైకులపైన సొంతూళ్లకు వెళ్లిన వారూ లక్షలాది మంది ఉన్నారు.
దేశంలో మొత్తం 4 కోట్ల మంది ఉపాధి కోసం వలస వెళ్లారని అంచనా. అధికారికంగా వీరిలో 75 లక్షల మంది సొంతూళ్లకు చేరుకున్నారు. అనధికారికంగా కాలినడకన చేరుకున్న వారు ఎంతమంది అన్న అంశంపై సరైన అంచనాల్లేవు.
అయితే వీరంతా ప్రధానంగా దేశంలో వెనకబడిన ప్రాంతాలకు చెందిన వారే. బిహార్, యూపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.
వలస జీవుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించలేదన్న విమర్శలను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంది. ఆ తరువాత ఎట్టకేలకు వారికి శ్రామిక్ ఎక్స్ప్రెస్లు, బస్సులు ఏర్పాటు చేసి వారి మన్ననలు పొందింది.
అయితే కొన్ని రాష్ట్రాలు తమ వలస కార్మికులను రప్పించేందుకు చొరవచూపకపోగా.. రానివ్వకుండా అడ్డుపడ్డాయన్న విమర్శలు ఎదుర్కొన్నాయి. ఎట్టకేలకు అన్ని రాష్ట్రాలు తమ తమ కార్మికులకు స్వాగతం పలికినా.. ఇప్పుడు వారందరికీ ఉపాధి కల్పించే పెద్ద బాధ్యతను ఎదుర్కోవాల్సి వస్తోంది.
రాజకీయ పార్టీలకు ఆయుధం
ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న రాజకీయాలకు వలస కార్మికుల సంక్షేమం అన్న అంశం ఒక అజెండాగా దొరికింది. ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు వలస కార్మికుల అంశాన్ని ప్రస్తుత కాలంలో ప్రధాన అంశంగా తీసుకుని అధికార పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయ అంశంగా మారింది.
బిహార్ ప్రజలు ఇక ఎంతమాత్రం వలస జీవులుగా వెళ్లరని, ఇతర రాష్ట్రాల్లో అవమానాలు పడ్డది చాలని, వారికి ఇక్కడే ఉపాధి కావాలని డిమాండ్ చేస్తున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వీటికి మద్దతు పలుకుతున్నాయి.
బిహార్ మే రోజ్గార్ అంటూ ఉద్యమానికి తెరతీస్తున్నాయి. ఇది క్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల బాగోగులను, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల సంక్షేమాన్ని చూస్తున్నాయి. రాష్ట్రంలో ప్రాజెక్టులు ముందుకు సాగాలంటే వారి శ్రమ లేనిదే సాధ్యం కాదని అవి అర్థం చేసుకున్నాయి.
మరి సొంతూళ్లకు వచ్చిన శ్రామికుల భవితవ్యం ఎలా ఉండబోతోంది? వలస కార్మికులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు రాష్ట్రాలు ఎలాంటి శ్రద్ధ కనబరుస్తాయి? రానున్న కాలంలో రాజకీయ గొంతులు జత కలుస్తాయా? ఈ అంశాలన్నీ రాజకీయాల దిశ మారుస్తాయా? వేచి చూడాల్సిందే.