అమెరికాలో పడిపోతున్న రియల్‌ ఎస్టేట్ ధరలు

real estate
Photo by David McBee from Pexels

సిలికాన్‌ వ్యాలీ సహా అమెరికాలోని పలు ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు గణనీయంగా పడిపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ ధరలు పడిపోతున్నాయి. మంచి డిమాండ్‌ ఉండే కాలిఫోర్నియా బే ఏరియాలో 10 శాతం వరకు పడిపోగా.. కొన్ని రాష్ట్రాల్లో 20 శాతం వరకు పడిపోయాయి.

2019 ఏప్రిల్‌తో పోల్చితే 2020 ఏప్రిల్‌ మాసంలో 17.2 శాతం అమ్మకాలు తగ్గాయి. 2010 జూన్‌ నుంచి ఇప్పటివరకు అత్యంత తగ్గుదల ఇదే కావడం గమనార్హం. సప్లై తగ్గిన కారణంగా రేట్లు ఈమాత్రమైనా నిలబడ్డాయి. ప్రాజెక్టులు పెరిగితే రేట్లు మరింత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ భద్రతపై నెలకొన్న అనిశ్చితి పరిస్థితులే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

అనేక కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు ఇల్లు ఏ ప్రాంతంలో ఉన్నా ఒకటేనని ఐటీ రంగ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సిలికాన్‌ వ్యాలీకి సమీపంలోనే కొనాల్సిన అవసరం లేదని, ధరలు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వార్తాకథనాలు వెలువడుతున్నాయి.

ఐటీ కంపెనీలన్నీ భవిష్యత్తులో కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోం కాన్సెప్ట్‌ను కొనసాగించడానికి సిద్ధపడ్డాయి. ప్రస్తుతం అమెరికాలో కార్యాలయాలో సిబ్బంది పనిచేయాలంటే సవాలక్ష రూల్స్‌ ఉన్నాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా కార్యాలయాల్లో సీటింగ్, ఇతరత్రా సౌకర్యాలను మార్చాలంటే ప్రస్తుత ఆర్థిక మందగమనంలో వాటికి మరింత వ్యయం తప్పదు.

దీనికంటే వర్క్‌ ఫ్రమ్‌ హోం వల్ల కంపెనీలకు వ్యయం తగ్గడం, ఉద్యోగులకు అభద్రత తగ్గడం కలిసొచ్చే పరిణామం. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ప్రోత్సహిస్తుండడంతో పాటు వచ్చే రెండు మూడేళ్లలో సిబ్బందిలో 50 నుంచి 100 శాతం వరకు ఇదే విధానాన్ని అనుసరించాలని కంపెనీలు భావిస్తున్నాయి.

సో.. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానంపై పూర్తిగా అవగాహన వస్తే ఐటీ రంగ ఉద్యోగులు తాము ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలన్న నిర్ణయానికి వస్తారు. అయితే ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ఎవరి ఉద్యోగం ఎప్పటివరకు ఉంటుందో తెలియని అనిశ్చితి నెలకొంది.

ఎందుకంటే ఒక రంగంపై ఇంకో రంగం ఆధారపడి ఉంది. ఇప్పటికే రీటైల్‌ రంగంపై తీవ్ర ప్రభావం ఉంది. అనేక చిన్నచిన్న కంపెనీలు మూతపడుతున్నాయి. ఈపరిస్థితి ఇలాగే కొనసాగి ఆర్థిక మాంద్యం ఎదురైతే వేలాది మంది ఉద్యోగాలు కోల్పేయో పరిస్థితి ఎదురవ్వొచ్చు.

ఈ ఏడాది చివరలో ఎన్నికలు వస్తున్న కారణంగా కంపెనీలు ఉద్యోగాలు తీసేయకుండా ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత తిరిగి ఇళ్ల అమ్మకాలు సాధారణ స్థితికి చేరే అవకాశం ఉంటుంది.

అమెరికాలో రియల్‌ ఎస్టేట్ ధరలు పడిపోతే అక్కడ పనిచేస్తున్న భారతీయులు సొంతిల్లు కొనేందుకు మొగ్గు చూపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితులు వస్తే ఇక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ప్రభావం ఉంటుంది.

ఇక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అత్యధిక ధరలకు అమ్ముడయ్యే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేది అమెరికా వంటి దేశాల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణులే కాబట్టి ఈ పరిస్తితి ఉత్పన్నం కాకతప్పదు.

Previous articleరాష్ట్రాలకు కొత్త కష్టాలు.. మారనున్న రాజకీయాలు
Next articleమూవీ రివ్యూ: ఆర్టికల్ 15 : ముగ్గురమ్మాయిలపై గ్యాంగ్ రేప్, హత్య