వర్షాకాలం వైరల్ ఇన్ఫెక్షన్స్ కాలం. వాతావరణ మార్పుల వల్ల శరీర ఇమ్యూనిటీ బలహీనపడి జ్వరం, జలుబు, దగ్గుతో పాటు స్వైన్ ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడాల్సి వస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలతో వీటికి చెక్ పెట్టొచ్చు. ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జ్వరం దగ్గు జలుబు వస్తే కరోనా అని భయపడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మరింత జాగ్రత్త అవసరం.
ఎండాకాలం దాటుతూ తొలకరి రాగానే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ ఈ వాతావరణమే అనేక వైరల్ ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతుంది. ఇందులో ప్రధానమైనది జ్వరం. జ్వరం అంటే మన శరీర ఉష్ణోగ్రత పెరగడం. దీనికి కారణం మన శరీరం ఏదో ఒక సమస్యతో పోరాడుతుందన్నమాట. సో మనం ఈ వర్షాకాలం వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయాలంటే ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.
1. పరిశుభ్రత పాటించండి
కరోనా దెబ్బకు ఇప్పటికే మనకు పరిశుభ్రతపై పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం. ముఖ్యంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అరచేతులు అడ్డుపెట్టుకోరాదు. పెట్టుకున్నా వాటిని కడుక్కోవాలి. అలాగే భోజనానికి ముందు గానీ, వాష్‌రూమ్ వాడిన తరువాత కానీ, బయటినుంచి వచ్చిన తరువాత గానీ, ఇలా ప్రతి సందర్భంలో సబ్బు లేదా హాండ్ వాష్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మరీ ముఖ్యంగా వర్షంలో తడవకుండా జాగ్రత్తపడండి.
2. సురక్షిత మంచినీరు మాత్రమే తాగండి
చాలా వరకు వర్షాకాలంలో తాగునీరు కలుషితమైపోతుంది. అందువల్ల మనం సురక్షిత మంచినీరునే తాగేలా చూసుకోవాలి. క్యాన్ వాటర్‌పై ఆధారపడడం కంటే ప్యూరిఫైడ్ వాటర్ అందించే ఆర్వో మిషన్ ఇంట్లో పెట్టించుకోవడం నూటికి నూరు శాతం మేలు చేస్తుంది. పది వేల రూపాయల్లో ఇప్పుడు అనేక ఆర్వో ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యపరీక్షలు, మందులపై పెట్టడం కంటే నిరభ్యంతరంగా ఈ ఆర్వో యంత్రం కొనుక్కోవచ్చు.
3. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ క్లెన్సర్
అంటురోగాలు ప్రబలే ఈ కాలంలో వైరస్లు మన ఇంట్లోకి చొరబడకుండా ఉండాలంటే కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇంతకుముందులా కాకుండా.. ఇప్పుడు కరోనా దెబ్బతో కూరగాయలను కడుక్కునేందుకు కూడా ప్రత్యేక ద్రావణాలు వచ్చాయి. మారికో(పారాష్యూట్ కొబ్బరినూనె తయారీ సంస్థ) వంటి కంపెనీలు వెజ్జీ క్లీన్ పేరుతో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ క్లెన్సర్ తీసుకొచ్చింది. ఇదొక్కటే కాదు.. అనేక కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చాయి. జెర్మ్స్, బాక్టీరియా, కెమికల్స్, వాక్స్ వంటివాటిని ఈ ద్రావణం నిర్మూలిస్తుంది.
4. షేరింగ్ విత్ కేరింగ్
మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇతరులకు ఆహారం పంచే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం సగం తిని ఇతరులకు ఇవ్వొద్దు. మన తాగిన గ్లాసును ఇతరులతో షేర్ చేయొద్దు. వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. మనం వాడే ప్లేట్లు, గ్లాసులు విడిగా ఉంచాలి.
5. డీహైడ్రేట్ కానివ్వొద్దు
వర్షాకాలం చల్లదనం ఉండడంతో నీళ్లు తాగడం మరిచిపోతుంటాం. అలా చేయొద్దు. తరచూ నీళ్లు తాగాల్సిందే. శరీరం డీహైడ్రేట్ కానివ్వొద్దు. మన శరీరంలో మలినాలు బయటకు పోవాలన్నా, శరీరం అనారోగ్యాలతో పోరాడాలన్నా నీళ్లు అవసరం.
6. ఆ మార్కెట్లకు దూరంగా ఉండండి
రద్దీగా ఉండే మార్కెట్లు ముఖ్యంగా చేపల మార్కెట్, మాంసం మార్కెట్లకు దూరంగా ఉండండి. విడి విడిగా ఉండే షాపులు కాస్త దూరమైనా వెళ్లి కొనుక్కోండి. వీలుకానిపక్షంలో మెగా సూపర్ మార్కెట్లలోకి వెళ్లి తెచ్చుకోండి. మార్కెట్లలో పరిశుభ్రత లేకపోతే మాంసాహారం కలుషితమై వర్షాకాలం వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకి మన ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయి.
7. నో పార్శిల్ ప్లీజ్..!
వర్షాకాలంలో కాస్త ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మన శరీరం వ్యాధులతో పోరాడాలి. అందువల్ల స్పైసీ పార్శిల్ ఫుడ్‌కు స్వస్తి పలకండి. ఇంట్లోనే ఫుడ్ చార్ట్ ప్రిపేర్ చేసుకుని బలవర్థకమైన ఆహారం తీసుకోండి. కేవలం కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్ మాత్రమే కాకుండా ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు ఉండేలా జాగ్రత్తపడండి. నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తినండి.
8. నిద్ర చాలా ముఖ్యం..
వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులతో పోరాడాలంటే మనిషికి కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. అందువల్ల నిద్ర విషయంలో రాజీపడొద్దు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ప్రైమ్ వంటి ఓటీటీలను బెడ్రూమ్లోకి తేవొద్దు. లివింగ్ రూమ్‌లోనే వదిలేయండి.