కరోనా వైరస్‌కు విరుగుడుగా ఫాబిఫ్లూ టాబ్లెట్స్ వాడేందుకు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ (డీసీజీఐ) ఆమోదం తెలిపిందని ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ వెల్లడించింది. ఫావిపిరవిర్ అనే యాంటీ వైరల్ డ్రగ్‌ను ఓరల్ డ్రగ్‌గా కోవిడ్–19 చికిత్సకు ఔషధంగా మార్కెట్లోకి తెచ్చినట్టు వెల్లడించింది.
ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసిన గ్లెన్‌మార్క్.. ఈ డ్రగ్ మైల్డ్, మాడరేట్ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని, డయాబెటిక్, గుండెజబ్బులు వంటి కోమార్బిడిటీస్ ఉన్న వారూ ఈ ఔషధాన్ని వాడవచ్చని వెల్లడించింది.
ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఈ ఔషధం లభిస్తుంది. ఒక్క టాబ్లెట్ ధర రూ. 103గా ఉంటుందని సంస్థ తెలిపింది.
18 ఏళ్ల వయస్సు నుంచి 75 ఏళ్ల వయస్సు గల వారు మాత్రమే వాడొచ్చని చెప్పింది. వైరల్ లోడ్ ను నాలుగు రోజుల్లోనే తగ్గించి కోలుకునేలా చేస్తుందని సంస్థ తెలిపింది.
ఫావిపిరవిర్ ఔషధం ఇదివరకే జపాన్ మార్కెట్లో అవిగన్ పేరుతో 2014 నుంచి అందుబాటులో ఉంది. దీనిని టయోమా కెమికల్ కంపెనీ తయారు చేసింది. ఇన్‌ఫ్లూయెంజా వ్యాధికి చికిత్స అందించేందుకు దీనిని వినియోగించేవారు. ఇప్పుడు ఫావిపిరవిర్ ఏపీఐని గ్లెన్‌మార్క్ సొంతంగా తయారుచేసి దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతులు పొందింది.
దేశంలో కరోనా కేసులు 4 లక్షలకు చేరువయ్యాయి. జూన్ 20 ఉదయం నాటికి 3,95,048 కేసులు నమోదవగా 12,948 మంది మృతిచెందారు. 1,68,269 యాక్టీవ్ కేసులు ఉండగా 2,13,831 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 14,516 కేసులు నమోదవగా, 375 మంది మృతిచెందారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 1,24,331 కేసులు,5893 మరణాలు నమోదయ్యాయి.
ఇలాంటి పరిస్తితుల్లో మార్కెట్లోకి టాబ్లెట్ రూపంలో కోవిడ్–19కి చికిత్సగా ఫాబిఫ్లూ టాబ్లెట్ కు అనుమతి రావడం కరోనా వల్ల నెలకొన్న భయాందోళనలను గణనీయంగా తగ్గించడంతోపాటు, ఆస్పత్రులపై భారం తగ్గే అవకాశం ఉంది.