సచిన్‌ పైలట్ ‌పై వేటు.. ఇక సపరేటు రూటు..!

sachin pilot

చిన్‌ పైలట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిప్యూటీ సీఎం సహా పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆ పార్టీ తొలగించింది. రాజస్తాన్‌లో వరుసగా రెండోరోజు జరిగిన సీఎల్పీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

సచిన్‌ పైలట్‌తో పాటు మంత్రివర్గంలోని ఆయన మద్దతుదారులు విశ్వేంద్ర సింగ్, రమేష్‌మీనాను కూడా కేబినెట్‌ నుంచి తప్పించారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఈ వివరాలు ప్రకటించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ దోతాస్రా రాజస్తాన్‌ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

మరోవైపు పైలట్‌ క్యాంపులో ఉన్నవారు పైలట్‌కు మద్దతుగా నిలిచారు. పైలట్‌ను బహిరంగంగా అవమానించారని విశ్వేందర్‌ సింగ్, రమేష్‌ మీనాతో పాటు మాజీ స్పీకర్‌ దీపేందర్‌ షెకావత్‌ వ్యాఖ్యానించారు.

‘మేం అంకితభావంతో ఏళ్లుగా పార్టీ కోసం సేవలందిస్తున్నాం. మా ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకు మా వైఖరిని ప్రకటించాం. స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ మాకు నోటీసులు ఇవ్వడంతో ఈ పనిచేశాం. భారత ప్రజాస్వామ్యంలో గానీ, కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి సంఘటన గతంలో ఎన్నడూ జరగలేదు.

ఏ పార్టీ కోసమైతే రక్తం, స్వేదం చిందించామో వారే ఇలా చేశారు.. పార్టీని బలోపేతం చేసేందుకు సచిన్‌ పైలట్‌ నేతృత్వంలో కృషిచేశాం. బహిరంగంగా మా నేతను అవమానించడాన్ని మేం సహించలేం. మేం ఎలాంటి పదవుల కోసం పాకులాడలేదు. మా ఆత్మగౌరవం కోసమే ఈ పనిచేశాం..’ అని పైలట్‌ మద్దతుదారులు ప్రకటన చేశారు.

అంతకుముందు 16 మంది ఎమ్మెల్యేలతో కూడిన 10 సెకెండ్ల వీడియోను పైలట్‌ క్యాంప్‌ విడుదల చేసింది. ఒకే చోట కూర్చుని ఉన్న దృశ్యాలను విడుదల చేసింది. ఇక సీఎల్పీకి 106 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు తెలుస్తోంది.

మరోవైపు రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి బీజేపీయే కారణమని శివసేన విమర్శలు చేసింది. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని దెబ్బతీస్తోందని విమర్శించింది.

ఇక సచిన్‌ పైలట్‌ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించి బయటకు వచ్చిన నేతల్లాగ సొంత కుంపటి పెట్టుకోవడం లేదా బీజేపీలో చేరడం. సచిన్‌ పైలట్‌ రాజస్థాన్‌లో మంచి ఆకర్షణ గల నేత. వాగ్దాటి ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని అందరూ అనుకున్నారు. కానీ గెహ్లాట్‌ సీనియర్‌ అయినందున అధిష్ఠానం ఆయనవైపే మొగ్గు చూపింది.

కాంగ్రెస్‌ను ఎదిరించి బయటకు వచ్చి అనేక మంది నేతలు తమ సామర్థ్యంతో రాణించినవారున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి నేతలు కనిపిస్తారు. సచిన్‌ పైలట్‌కు మెరుగైన దారి ఇదే కనిపిస్తోంది.

ఇంతకీ సచిన్‌ పైలట్‌ ఎలా స్పందించారో తెలుసా. సత్యాన్ని ఇబ్బంది పెడతారేమో గానీ, ఓడించలేరు.. అని వ్యాఖ్యానించారు.

Previous articleబుక్ రివ్యూ : దోసిట చినుకులు బై ప్రకాష్ రాజ్
Next articleప్రశాంతంగా ఉండు సుశీ.. నిన్ను జీవితకాలం ప్రేమిస్తూనే ఉంటా