పవర్ స్టార్ ట్రైలర్ చూసేందుకు కూడా డబ్బులు చెల్లించాలంటున్నాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. సినీరంగంలో ఇది ఒక సరికొత్త పోకడ. ఏటీటీ ద్వారా సినిమాలు విడుదల చేసి ఎవరూ చేయని సాహసం ఆర్జీవీ చేశాడు. ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేశాడు. మరో రెండు సినిమాలు విడుదలకు కూడా సిద్ధం చేశాడు. పవర్ స్టార్ పేరుతో వస్తున్న మరో వివాదాస్పద సినిమా జూలై 25న విడుదలవుతోందంటున్నాడు.
ఇందుకు సంబంధించి జూలై 22న ఉదయం 11 గంటలకు విడుదలయ్యే సినిమా ట్రైలర్ చూడాలంటే రూ. 25 చెల్లించాల్సిందేనని చెబుతున్నాడు. వివాదాస్పద కథాంశాలతో సినిమాలు తెచ్చే ఆర్జీవీ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. 25న విడుదలయ్యే సినిమా చూడాలంటే ముందుగా బుక్ చేసుకుంటే రూ. 100 తగ్గుతుందని, ఒకరోజు ఆలస్యం చేస్తే రూ 250 చెల్లించాలని హెచ్చరిస్తున్నాడు.
ఇది మనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ కథ అని, ఎవరినీ ఉద్దేశించీ ఈ సినిమా తీయడం లేదంటున్నాడు. రష్యన్ అమ్మాయిని వివాహామాడిన ఓ సినిమా హీరో రాజకీయంగా ఎలా విఫలమయ్యాడు.. 2019 ఎన్నికల అనంతరం ఎలాంటి పరిణామాలు సంభవించాయి.. అన్న కోణంలో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.
టెక్నికల్‌గా తన సత్తా చూపుతూ ఈ కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో కొత్త సినిమాలతో పరుగుపెడుతున్న రాంగోపాల్ వర్మకు ఈ పవర్ స్టార్ మూవీ ఎలాంటి ఫలితం ఇవ్వనుందో వేచి చూడాలి.