మూవీ రివ్యూ : దిల్‌ బేచారా : సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ తో భావోద్వేగ ప్రయాణం

dil bechara review
image source: Instagram

దిల్‌ బేచారాలో మరికొద్ది రోజుల్లో మరణించబోయే మానీ పాత్రను పోషించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించడం, మానీ పాత్రను చూస్తున్నంతసేపు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నిజ జీవితంలోని ఆఖరి ఘట్టాన్ని చూస్తున్నట్టుగా అనిపించడం… నిజంగా చిత్రమైన అనుభూతిని దిల్‌బేచారా మిగులుస్తుంది.

తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన ఈ చివరి సినిమా హాట్‌ స్టార్‌ డిస్నీ ఓటీటీలో జూలై 24న రిలీజైంది. జాన్‌గ్రీన్స్‌ రాసిన ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. విడుదలైన కొద్దిసేపటికే ఐఎండీబీ టాప్ రేటెడ్ ఇండియన్ మూవీగా రికార్డు సాధించింది.

మూవీ రివ్యూ : దిల్‌ బేచారా (నిస్సహాయ హృదయం)
రేటింగ్‌ : 4/5
స్టారింగ్‌ : సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, సంజనా సంఘి, శాశ్వత ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ, సైఫ్‌ అలీఖాన్‌
మ్యూజిక్‌ : ఏఆర్‌ రహమాన్‌
ప్రొడక్షన్‌ : ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌
దర్శకత్వం : ముకేష్‌ చాబ్రా

కథ :

కిజీ బసు (సంజనా సంఘి) థైరాయిడ్‌ కాన్సర్‌తో పోరాడే ఓ బెంగాలీ యువతి. ఆక్సిజన్‌ సిలిండర్‌ వెంట లేకపోతే బతకలేని పరిస్థితి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఎలాంటి ఉత్సాహం లేని జీవితాన్ని గడుపుతుంటుంది. చనిపోయిన తరువాత ఆత్మీయులు ఎలా బాధపడుతారో స్మశానానికి వెళ్లి పరిశీలిస్తుంది.

ఓరోజు ఇమాన్యుయల్‌ రాజ్‌కుమార్‌ జూనియర్‌ అలియాస్‌ మానీ (సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌) తారసపడతాడు. ఆస్టియోసర్కొమా (బోన్‌ కాన్సర్‌) తో సతమతమవుతున్న మానీతో పరిచయం కిజీ బసు జీవితంలో ఉత్సహాన్ని తెస్తుంది.

మానీకి రజినీకాంత్‌ సినిమాలంటే ఇష్టం. కిజీకి అభిమాన్యు వీర్‌ మ్యూజిక్‌ అంటే ప్రాణం. మానీ స్నేహితుడు జేపీ తీసే సినిమాలో కిజీని హీరోయిన్‌గా చేయమని మానీ అడుగుతాడు. మానీ హీరోగా, కిజీ హీరోయిన్‌గా జేపీ సినిమా తీస్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు గానీ ఆ రెండింటి మధ్య ఉండే జీవితాన్ని ఎలా గడపాలో మన చేతుల్లోనే ఉందన్న దృక్పథాన్ని మానీ కిజీకి అలవాటు చేస్తాడు. కిజీ జీవితంలో మానీ ఎలాంటి సంతోషం తెస్తాడు? వారిద్దరూ కాన్సర్‌తో ఎలా పోరాడారు? చనిపోయే ముందు మనుషుల భావోద్వేగాలు ఎలా ఉంటాయి? వంటి అంశాలతో కథ సాగుతుంది.

కన్నీరు పెట్టించే దిల్‌ బేచారా

అనేకస్లారు విడుదల వాయిదా పడుతూ వచ్చిన దిల్‌ బేచారా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయిన తరువాత విడుదల కావడం బాధాకరం. డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో దీనిని విడుదల చేస్తున్నట్టు ప్రొడక్షన్‌ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ ప్రకటించింది. డిస్నీ హాట్‌స్టార్‌లో అందరూ ఉచితంగా ఈ సినిమా చూసేందుకు అవకాశం కల్పించింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కోసం ఈ సినిమాను అందరూ చూస్తారు. సుశాంత్‌ వ్యక్తిత్వాన్ని ఆయన పోషించిన పాత్రలో ఊహించుకుంటారేమో అనిపిస్తుంది.

ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్‌లో వచ్చే ‘చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు గానీ ఆ రెండింటి మధ్య ఉండే జీవితాన్ని ఎలా గడపాలో మన చేతుల్లోనే ఉంది’ అన్న డైలాగ్‌ అశేష అభిమానులను కన్నీరు పెట్టించింది. దానికి కొనసాగింపుగా ఈ సినిమా చూస్తున్నప్పుడు తప్పనిసరిగా సుశాంత్‌ నిజ జీవితంలో కూడా ఇలాగే ఉండేవాడేమో అన్న భావన కలుగుతుంది. మరణించే ముందు మనుషుల భావోద్వేగాలే ఈ సినిమా కథ. అందువల్ల సినిమాలో అనేక సన్నివేశాలు మనల్ని ఏడిపిస్తాయి.

మాన్‌ పాత్రలో సుశాంత్‌ సింగ్, కిజీ బసు పాత్రలో సంజనా సంఘి జీవించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బతికి ఉంటే షారుక్‌ఖాన్‌ అంతటి స్టార్‌ అయ్యేవాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎ.ఆర్‌.రహమాన్ బ్యాక్‌గ్రౌడ్‌ స్కోర్‌ సింప్లీ సూపర్బ్..

‘నిద్రలాగే ప్రేమ కూడా నెమ్మది నెమ్మదిగా వస్తుంది. అకస్మాత్తుగా గాఢంగా మారుతుంది..నాతో కూడా ఇలాగే జరిగింది..’ అని కిజీ బసు స్వగతంగా చెప్పుకోవడం, ‘నవ్వడం నేర్పాడు.. తానే జీవితమయ్యాడు. నన్ను ఒంటరి చేసి వెళ్లిపోయాడు..’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. ‘మ్యానీ ముఖాన్ని, చిరునవ్వును చూడని ఈ కళ్లు లేకపోవడమే మంచిది..’ వంటి భావోద్వేగ పూరితమైన డైలాగులు పలుమార్లు మనల్ని కంటతడిపెట్టిస్తాయి.

మన జీవితంలో ఎన్ని గాయాలు ఉన్నా.. ఇంకొకరికి గాయాల నుంచి సాంత్వన కల్పించడమే అసలైన జీవితం. మన పేరు తలుచుకోగానే చిరునవ్వు చిందే ముఖం ఒక్కటైనా లేనప్పుడు నిజంగా మన జీవితానికి అర్థమే ఉండదేమోనన్న సందేశాన్ని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మనల్ని వీడిపోతూ ఇచ్చాడేమో అనిపిస్తుంది.

[yasr_overall_rating null size=”small”]
Previous articleకరోనా కవచం.. స్టీల్‌బర్డ్‌ నుంచి హెల్మెట్ ఫేస్ షీల్డ్
Next articleమూవీ రివ్యూ : 36 వయసులో ..