‘ది ఫైవ్ రూల్స్ ఫర్ సక్సెస్‌ఫుల్ స్టాక్ ఇన్వెస్టింగ్’ బుక్ షేర్లు కొనేవారికి, స్టాక్ మార్కెట్ పై అవగాహన అవసరం అనుకునేవారికి గైడ్ లాంటి బుక్. మార్నింగ్‌స్టార్ అనే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సంస్థ డైరెక్టర్ పాట్ డార్సీ దీనిని రాశారు. సంపద సృష్టికి, మార్కెట్లో విజయం సాధించేందుకు సహాయపడే గైడ్‌గా మార్నింగ్ స్టార్ దీనిని అభివర్ణించింది.
స్టాక్ మార్కెట్ థియరీలు ప్రాక్టికల్‌గా వర్క్ ఔట్ అవడం అరుదు. అయితే డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే అసలు ఏది కొనాలో ఏది కొనకూడదో తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. అందుకు ఎలాంటి వ్యహాలు అనుసరించాలో చెప్పేదే ఈ ‘ది ఫైవ్ రూల్స్ ఫర్ సక్సెస్‌ఫుల్ స్టాక్ ఇన్వెస్టింగ్’ బుక్.
చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో స్టాక్‌మార్కెట్ గురించి మనకు అవగాహన కల్పించే పుస్తకం ఇది. స్టాక్‌మార్కెట్లో రాణించేందుకు ఉండాల్సిన లక్షణాలు, చేయాల్సిన పనుల గురించి పూసగుచ్చినట్టు చెబుతారు పాట్ డార్సీ.
ఐదు సూత్రాలపై విఫులంగా..
పుస్తకం మొత్తం ఐదు సూత్రాలను విశదీకరిస్తుంది. 364 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో మొత్తం 26 అధ్యాయాలు ఉంటాయి. కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా, బిగినర్స్‌కు కూడా సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. స్టాక్స్ కొనేముందు హోంవర్క్ చేయడం, కొనే స్టాక్స్‌కు ఎకనామిక్ మోట్స్ ఉన్నాయా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉందా? ఎంతకాలం వేచి ఉండాలి? ఎప్పుడు అమ్మాలి? ఈ ఐదు సూత్రాల గురించి సవివరంగా రాశారు.
స్టాక్ మార్కెట్లో ఎలాంటి తప్పిదాలు చేస్తాం?
మనం స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చేసే మిస్టేక్స్ గురించి కూడా పాట్ డోర్సీ ఈ ‘ది ఫైవ్ రూల్స్ ఫర్ సక్సెస్‌ఫుల్ స్టాక్ ఇన్వెస్టింగ్’ పుస్తకంలో సవివరంగా రాశారు.
చెత్త కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయడం, ఈసారి అలా జరగదులే అని నమ్మడం, కంపెనీ కష్ట నష్టాలు తెలవకుండా కేవలం ఏదైనా ప్రొడక్ట్ నచ్చి దాని స్టాక్స్ కొనడం, ఫలానా సమయంలోనే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు గడించవచ్చని నమ్మడం, స్టాక్ విలువను సరిగ్గా అంచనావేయకపోవడం, కేవలం కంపెనీ లాభాలపై ఆధారపడి స్టాక్స్ కొనడం.. ఇలాంటి తప్పిదాల గురించి డార్సీ సవివరంగా రాశారు.
సక్సెస్‌ఫుల్ స్టాక్ ఇన్వెస్టింగ్ కోసం ఏం చేయాలి?
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఆసక్తి ఉన్నవారికి నిజంగానే ఇదొక కరదీపిక అని ఎందుకు అంటారంటే.. సాధారణంగా స్టాక్స్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు మనం చేసే తప్పిదాలు అనుభవపూర్వకంగా తెలిసేలోపు మనం నష్టపోతూ ఉంటాం. ఎలాంటి తప్పిదాలు చేయకూడదో చెప్పడమే కాకుండా.. ఏం చేయాలో చెబుతుంది ఈ గైడ్.
ఈ పుస్తకం ఆద్యంతం చదివితే మనం స్టాక్ కొనే ముందు ఆ కంపెనీ ఇంటాబయటా ఏం జరుగుతోంది? మంచి కంపెనీయేనా? దానికి పోటీ ఎవరున్నారు? ఎంతకాలం పోటీలో నిలబడుతుంది? పోటీలో ఉన్న ప్రోడక్ట్ ఎక్కువగా రాణించేందుకు వీలుందా?
మనం కొంటున్న స్టాక్ ధర.. వాస్తవ ధర కంటే తక్కువగా ఉందా? ఎక్కువగా ఉందా? భారీగా పడిపోయే ప్రమాదం ఉందా? ఒక స్టాక్ మనకు లాభాలు తెచ్చిపెట్టాలంటే మనం ఎంత కాలం వేచి ఉండాలి? అసలు స్టాక్ ఎందుకు అమ్మాలి?
అంతకంటే మంచి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడే అమ్మాలా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.
ప్రతి ఛాప్టర్ చివర ఇన్వెస్టర్స్ చెక్‌లిస్ట్ పేరుతో సారాంశం జోడించడం బాగుంది. ఉదాహరణల కోసం మధ్యమధ్య కొన్ని కంపెనీల బాలెన్స్ షీట్లు కూడా ప్రచురించారు. ఇన్‌కం స్టేట్‌మెంట్ అధ్యాయం చదివేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి.
13వ అధ్యాయంలో ఎ గైడెడ్ టూర్ ఆఫ్ ది మార్కెట్ పేరుతో స్టాక్ మార్కెట్‌లో ఏయే రంగం షేర్లలో ఎప్పుడు ఎలాంటి ధోరణులు కనబరుస్తాయో విశదీకరించడం కూడా బాగుంది. బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, హెల్త్‌కేర్, మీడియా, చమురు.. ఇలా అనేక రంగాల స్టాక్స్ గురించి విశ్లేషించారు.
పుస్తకం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తోంది.