Cryptocurrency in telugu: క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? బిట్‌ కాయిన్‌ ఎలా కొనుగోలు చేయొచ్చు?

cryptocurrency
Photo by Marta Branco from Pexels

Cryptocurrency: క్రిప్టో కరెన్సీ అంటే వర్చువల్‌ రూపంలో ఉండే డిజిటల్‌ కరెన్సీ. బిట్‌కాయిన్, ఇథీరియం, టెథర్, వంటి సుమారు 6,800లకు పైగా రకాల క్రిప్టోకరెన్సీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. వీటన్నింటిలో బిట్‌ కాయిన్‌ బాగా పాపులర్‌. వస్తువులు, సేవలు కొనుగోలు చేయడంలో డబుల్‌ స్పెండింగ్‌ లేకుండా చూసేందుకు తొలుత రూపకల్పన చేసిన వర్చువల్‌ కరెన్సీ ఈ బిట్‌కాయిన్‌.

డబుల్‌ స్పెండింగ్‌ అంటే.. లావాదేవీలకు రుసుము చెల్లించడం. మనం ఒక ట్రాన్సాక్షన్‌ చేసినప్పుడు మధ్యవర్తిగా ఉండే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు ట్రాన్సాక్షన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు దీనిని సృష్టించారు. వీటిని ఎలాంటి సెంట్రల్‌ బ్యాంకు గానీ, ప్రభుత్వాలు గానీ నిర్వహించవు. అందువల్ల లావాదేవీ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వినియోగించి క్రిప్టోకరెన్సీని నిర్వహిస్తారు. వికేంద్రీకృతమైన సాంకేతికతతో అనేక కంప్యూటర్లకు విస్తరించే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సాయంతో ట్రాన్సాక్షన్లను రికార్డు చేస్తూ, నిర్వహిస్తారు.

How to purchase Cryptocurrency: క్రిప్టో కరెన్సీ ఎలా కొనుగోలు చేయాలి?

క్రిప్టో కరెన్సీనే టోకెన్స్‌గా సంబోధిస్తారు. వీటిని కొనుగోలు చేయాలంటే నిజమైన కరెన్సీని డాలర్ల రూపంలో వెచ్చించాల్సి ఉంటుంది. బాగా ప్రాచుర్యం పొందిన బిట్‌ కాయిన్‌ తరహాలోనే సుమారు 6,800 రకాల క్రిప్టోకరెన్సీ ప్రస్తుతం చలామణిలో ఉంది. ఆయా క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసేందుకు అనేక ఎక్స్ఛేంజీలు అందుబాటులో ఉన్నాయి.

కాయిన్‌స్విచ్‌ కుబేర్, క్రిప్టో తదితర ఎక్స్ఛేంజ్‌లలో రిజిస్ట్రేషన్‌ చేసుకుని కేవైసీ డాక్యుమెంట్స్‌ సమర్పించడం ద్వారా క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఇండియాకు చెందిన కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ వంటి స్టార్టప్‌ సంస్థలు భారత కరెన్సీ ద్వారా క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేయవచ్చు.

బిట్‌ కాయిన్‌ (బీటీసీ), ఇథీరియమ్‌ (ఈటీహెచ్‌), రిపుల్‌ (ఎక్స్‌ఆర్‌పీ), బినాన్స్‌కాయిన్‌ (బీఎన్‌బీ), లైట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలు ఇండియాలో పాపులర్‌ అయ్యాయి. దాదాపు 75 లక్షల మంది ఇన్వెస్టర్లు భారత్‌ నుంచి ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టినట్టు అంచనా. ఆయా కరెన్సీల విలువలో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉంటున్న కారణంగా తగిన అధ్యయనం చేసిన తరువాతే వీటి కొనుగోళ్ల జోలికి వెళితే మంచిది.

ఒక బిట్‌కాయిన్‌ విలువ ఇప్పుడు(ఈ ఆర్టికల్‌ రాసే సమయానికి) భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 45,16,458 గా ఉంది. అయితే క్రిప్టో కరెన్సీ యాప్‌లు కొద్ది మొత్తంలో పెట్టుబడులను కూడా అనుమతిస్తాయి.

Cryptocurrency legality:క్రిప్టోకరెన్సీ భారత్‌లో చట్టబద్దమా?

2018లో ఆర్‌బీఐ ఒక ఉత్తర్వు జారీచేసింది. బ్యాంకింగ్‌ కార్యకలాపాలు జరిపే సంస్థలేవీ క్రిప్టోకరెన్సీ లావాదేవీలు జరపకుండా ఈ ఉత్తర్వు ద్వారా నిషేధించింది. అయితే 2020 మార్చి నెలలో సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వును కొట్టివేసింది. ఈనేపథ్యంలో ఆర్థిక స్థిరత్వంపై ఆందోళన వ్యక్తంచేసిన ఆర్‌బీఐ, భారత్‌లో కూడా ప్రత్యేకంగా, సొంతంగా ఒక క్రిప్టోకరెన్సీ రూపకల్పన చేయాలని యోచించినట్టు అనేక వార్తాసంస్థలు వెల్లడించాయి.

కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ దేశంలో మెజారిటీ ఇన్వెస్టర్లు క్రిప్టోకరెన్సీపై సానుకూల ధోరణితో ఉన్నారు. అయితే ఈ అంశంపై అత్యున్నతస్థాయి ఇంటర్‌ మినిస్టీరియల్‌ కమిటీ చేసే సిఫారసులను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రకటించారు. తగిన చట్టాన్ని రూపొందించాలని సిఫారసు చేస్తే ఆ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.

క్రిప్టోకరెన్సీని నిషేధిస్తుందా? లేక సొంతంగా రూపొందిస్తుందా? వంటి అంశాలను ఇప్పుడే అంచనావేయలేం. క్రిప్టోకరెన్సీని కొన్ని దేశాలు అనుమతించగా, మరికొన్ని దేశాలు నిషేధించాయి.

How safe is Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి హాకర్లు, దొంగల బెడద

క్రిప్టో కరెన్సీ వ్యవస్థలో కూడా హాకర్లు, దొంగల బెడదతో చాలా మంది నష్టపోయారు. 2014లోనే బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌ సంస్థల్లో అతి పెద్దదైన ఎంటీ గాక్స్‌ దివాలా ప్రకటించింది. 7,50,000 బిట్‌కాయిన్లు దొంగతనానికి గురయ్యాయని ప్రకటించింది. ఈ దెబ్బతో అంతకుముందు 2013 డిసెంబరులో బిట్‌కాయిన్‌ విలువ 1160 డాలర్ల నుంచి 2014 ఫిబ్రవరిలో 400 డాలర్లకు పడిపోయింది.

2017 నవంబర్‌లో టెథర్‌ క్రిప్టోకరెన్సీ కూడా తమ క్రిప్టో వ్యవస్థ హ్యాకింగ్‌ బారిన పడిందని ప్రకటించింది. 31 మిలియన్‌ డాలర్ల విలువైన యూఎస్‌డీటీ(బిట్‌కాయిన్‌ తరహాలో మరో క్రిప్టోకరెన్సీ) హాకింగ్‌కు గురైందని వెల్లడించింది. ఇలాగే 2018లో బిట్‌కాయిన్‌ గోల్డ్‌ అనే క్రిప్టోకరెన్సీ వ్యవస్థ హాక్‌కు గురైంది.

ఈ మొత్తం వ్యవస్థలో అనేక లోపాలు, లొసుగులు ఉన్నందున ఈ క్రిప్టోకరెన్సీ జోలికి వెళ్లొద్దని అనేకమంది నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. లోపాలు బయటపడిన ప్రతిసారి బిట్‌కాయిన్‌ సహా వేలాదిగా ఉన్న అనేక క్రిప్టోకరెన్సీల విలువ హెచ్చుతగ్గులకు లోనైంది. ఈ వ్యవస్థను సానుకూల దృక్పథంతో చూసేవారు మాత్రం పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు.

Is Cryptocurrency a solution?: క్రిప్టో కరెన్సీ దేనికి పరిష్కారం?

ఏ అనే వ్యక్తి నుంచి బీ అనే వ్యక్తి నుంచి ఏదైనా సరుకు కొనుగోలు చేయాలనుకుంటే సాధారణంగా ఏదైనా ఒక కార్డు ద్వారా లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వాలెట్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఆ కార్డు గానీ, నెట్‌ బ్యాంకింగ్‌ గానీ, వాలెట్‌ గానీ నిర్వహించే ఆర్థిక సంస్థ లేదా బ్యాంకుకు ఏ అనే వ్యక్తి అది అందించిన సేవలకు గాను కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అంటే ఉదాహరణకు వంద రూపాయల వస్తువు కొనుగోలు చేస్తే ఆర్థిక సంస్థకు చెల్లించాల్సిన రుసుము సహా రూ. 103 అయ్యిందనుకుందాం. అంటే ఇక్కడ మనం వస్తువుకు, అలాగే బ్యాంకు సేవలకు వెచ్చిస్తున్నాం. మనం రూ. 103 చెల్లిస్తే రూ. 100ల విలువ గల వస్తువే వచ్చింది.

ఈ అదనపు వ్యయాన్ని నివారించేందుకు గల పరిష్కారం కోసం వెతికితే వచ్చిన ఆలోచనే క్రిప్టో కరెన్సీ. మనం నోట్ల రూపంలో చెల్లించినప్పుడు మధ్యవర్తుల అవసరం ఉండదు. కానీ ఈకామర్స్‌ జమానాలో నోట్ల ద్వారా చెల్లింపు సాధ్యం కాదు. అందుకే బ్యాంకులు, ఆర్థిక సంస్థల వంటి మధ్యవర్తుల బెడద లేకుండా నేరుగా ఏ నుంచి బీకి నగదు బదిలీ చేయడమే క్రిప్టోకరెన్సీ ఉద్దేశం.

ఇప్పటికే అనేక వాణిజ్య సంస్థలు, విదేశీ క్రెడిట్ కార్డు సంస్థలు వాణిజ్య లావాదేవీలకు క్రిప్టో కరెన్సీని అనుమతిస్తున్నాయి.

how cryptocurrency works: క్రిప్టోకరెన్సీ ఎలా పనిచేస్తుంది?

క్రిప్టో కరెన్సీని సంతకాల గొలుసుతో కూడిన ఒక ఎలక్ట్రానిక్‌ కాయిన్‌గా భావించాలి. ప్రతి యజమాని తదుపరి యజమానికి క్రిప్టోకరెన్సీని బదిలీ చేసేందుకు అంతకుముందు తనకు ఎలా వచ్చిందో తెలియజేసే వివరాలతో డిజిటల్‌ సంతకం చేసిన హాష్‌ను, అలాగే కొనుగోలు చేయబోయే తదుపరి యజమానికి సంబంధించిన పబ్లిక్‌ కీ వివరాలను ఆ ఎలక్ట్రానిక్‌ కాయిన్‌పై పొందుపరచాల్సి ఉంటుంది.

అయితే కొనుగోలు చేసే యజమానికి అమ్మిన యజమాని ఇదివరకే దానిని ఎవరికైనా అమ్మారో లేదో, వినియోగించారో లేదో ఎలా తెలుస్తుంది? దీనికి సాధారణ పరిష్కారం ఒక బ్యాంక్‌ లాంటి కేంద్రీకృత వ్యవస్థ ఉండడం. కానీ ఇలా అయితే క్రిప్టో కరెన్సీ ఉద్దేశం నెరవేరదు. ఈ కేంద్రీకృత వ్యవస్థలో క్రిప్టోకరెన్సీ నిర్వహించే సంస్థ ఒక సెంట్రల్‌ అథారిటీని నిర్వహించాల్సి వస్తుంది. అంటే ఇదొక నాణే లు ముద్రించే సంస్థలాగా వ్యవహరించాల్సి వస్తుంది. ఈ మింట్‌ ప్రతి ట్రాన్సాక్షన్‌ను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

అంటే ట్రాన్సాక్షన్‌ పూర్తయిన వెంటనే కాయిన్‌ తప్పనిసరిగా మింట్‌కు రావాల్సిందే. అలా వచ్చాక మరొక కొత్త కాయిన్‌ను ఈ మింట్‌ జారీచేయాల్సి వస్తుంది. ఇలా మింట్‌ నుంచి జారీ అయిన కాయిన్‌ మాత్రమే ఒరిజినల్‌గా భావించాల్సి వస్తుంది. కానీ ఈ విధానంలో ఒక సమస్య ఉంది. ఈ మొత్తం మనీ వ్యవస్థ భవిష్యత్తు.. ఈ మింట్‌ను నిర్వహించే సంస్థపై ఆధారపడి ఉంటుంది.

అంటే దీనిని కూడా ఒక బ్యాంక్‌లాగా నమ్మాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్, నమ్మకం వంటి విధానాలు కాకుండా, ట్రాన్సాక్షన్లన్నీ ఎన్‌క్రిప్టెడ్‌ రూపంలో ఉంటే.. ఈ కాయిన్‌ ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయినప్పుడు అంతకుముందు జరిగిన ట్రాన్సాక్షన్లన్నీ తెలియపరిచేలా ఒక హాష్‌ (కొన్ని అక్షరాలు, అంకెల సమూహాన్ని స్వీకరించి ఒక ఎన్‌క్రిప్టెడ్‌ అవుట్‌పుట్‌ను ఇచ్చే కంప్యూటర్‌ ఫంక్షన్‌) ను పొందుపరుస్తారు.

అంటే కొనుగోలు చేసే వ్యక్తికి సదరు కాయిన్‌ ద్వారా అది ఫస్ట్‌ ట్రాన్సాక్షన్‌ అని రుజువు కావాలంటే, ఈ క్రిప్టోకరెన్సీ నిక్షిప్తమయ్యే మెజారిటీ నోడ్స్‌ అన్నీ అది ఫస్ట్‌ ట్రాన్సక్షనే అని అంగీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసమే బిట్‌ కాయిన్‌ క్రిప్టోకరెన్సీ టైమ్‌స్టాంప్‌ సర్వర్‌ విధానాన్ని పాటిస్తుంది.

peer to peer networking: పీర్‌ టూ పీర్‌ నెట్‌వర్కింగ్‌ విధానంలో..

పీర్‌ టూ పీర్‌ నెట్‌ వర్క్‌ విధానం (పీటూపీ)లో కొన్ని కంప్యూటర్ల సమూహం ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది. డేటా ప్రాసెస్‌ చేసేందుకు అన్నింటికీ సమానమైన అనుమతులు, బాధ్యతలు ఉంటాయి. క్లెయింట్‌ సర్వర్‌ విధానంలో అయితే ఒకే డివైజ్‌కు డేటా సర్వ్‌ చేసేందుకు గానీ, రిసీవ్‌ చేసేందుకు గానీ అవకాశం ఉంటుంది.

కానీ పీటూపీ విధానంలో అన్నింటికీ సమాన బాధ్యతలు ఉంటాయి. క్రిప్టోకరెన్సీ కూడా పీటూపీ విధానంలో పనిచేస్తుంది. కొత్త ట్రాన్సాక్షన్లన్నీ అన్ని నోడ్స్‌కు బ్రాడ్‌కాస్ట్‌ అవుతాయి. ప్రతి నోడ్‌ కొత్త ట్రాన్సాక్షన్‌ను ఒక బ్లాక్‌లోకి కలెక్ట్‌ చేస్తుంది. ప్రతి నోడ్‌ తన బ్లాక్‌కు ఒక సంక్లిష్టమైన ప్రూఫ్‌ ఆఫ్‌ వర్క్‌ను రూపొందిస్తుంది.

ఒక నోడ్‌ ప్రూప్‌ ఆఫ్‌ వర్క్‌ను కనుగొన్నాక అది ఇతర నోడ్స్‌కు బ్రాడ్‌కాస్ట్‌ చేస్తుంది. బ్లాక్‌లోని అన్ని ట్రాన్సాక్షన్లు సరైనవే అయినప్పుడు, ఇంతకుముందు ఖర్చు కాలేదని నిర్ధారణ అయినప్పుడు మాత్రమే నోడ్స్‌ ఆ బ్లాక్‌ను యాక్సెప్ట్‌ చేస్తాయి. ఇలా సమ్మతించిన బ్లాక్‌లోని హాష్‌ను వినియోగించి గొలుసులో తదుపరి బ్లాక్‌ను నోడ్స్‌ క్రియేట్‌ చేస్తాయి. ఇలా గొలుసు విస్తరిస్తుంటుంది.

ఈ మొత్తం ప్రక్రియలో కాయిన్‌ ఓనర్‌షిప్‌ బదిలీని వెరిఫై చేయడమే కాకుండా, అదనపు కాయిన్స్‌ సృష్టించడంలో నియంత్రణ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియలో టైమ్‌స్టాంప్‌ ట్రాన్సాక్షన్లను వాలిడేట్‌ చేస్తూ, వీటిని లెడ్జర్‌లో పొందుపరిచేందుకు కంప్యూటర్లను వినియోగించే ఒక సమన్వయ సమూహాన్ని మైనర్స్‌ (miners) అంటారు.

వాలిడిటీ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఈ మైనర్స్‌కు ఇన్సెంటివ్స్‌ లేదా రివార్డ్స్‌ అందుతాయి. వీటి ద్వారా క్రిప్టోకరెన్సీ సప్లై పెరుగుతుంది. అయితే ఒక నిర్ధిష్ట మొత్తాన్ని చేరుకునేవరకే ఈ క్రిప్టోకరెన్సీ ఉత్పత్తి డిజైన్‌ ఉంటుంది. నిర్ధిష్ట మొత్తాన్ని చేరుకున్న తరువాత ఈ ఇన్సెంటివ్స్‌ కాస్త ట్రాన్సాక్షన్‌ ఫీ రూపంలోకి మారుతుంది.

ఈ మైనర్స్‌కు ఇన్సెంటివ్స్‌ ఎందుకివ్వాల్సి వస్తుందంటే, ట్రాన్సాక్షన్‌ వాలిడిటీ చేయడంలో అనేక వ్యయ ప్రయాసలు ఉంటాయి. కంప్యూటర్లకు ప్రాసెసింగ్‌ పవర్‌ అధికంగా ఉండాలి. అత్యాధునిక ఎక్విప్‌మెంట్‌ అవసరం అవుతుంది. అందుకే ఇన్సెంటివ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి: ఎలన్ మస్క్ …  ఓటమే అతడి మొదటి మెట్టు

స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?


Previous articleమార్వా ఎల్సెలెదార్ .. ఈజిప్ట్ తొలి మహిళా కెప్టెన్ ఎందుకు టార్గెట్ అయ్యారు?
Next articleOCD symptoms: అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) లక్షణాలు గుర్తించడం ఎలా?