ఆక్సిజన్ కొరతేంటి? ఎప్పుడు తీరుతుంది?

ఎటు చూసినా చావు కేకలు.
ఊపిరి ఆడక ఊగిసలాడుతున్న ప్రాణాలు.
కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంలో చెల్లాచెదురవుతున్న కుటుంబాలు.
ఎవ్వరూ ఊహించని విపత్తు ఇది.
ఇపుడు దానికి జతగా కొత్త సమస్య.
దాని పేరు ‘ఆక్సిజన్ కొరత’.

కోవిడ్ మొదటి వేవ్ ను మించి రెండో వేవ్ ముచ్చెటమలు పట్టిస్తోంది. రోజూ లక్షల మంది కరోనా పాజిటివ్ లుగా తేలుతున్నారు. వందల మంది ఆసుపత్రుల బయటే పడిగాపులు కాస్తున్నారు. బెడ్లు నిండిపోయి, వరండాలనే వార్డులుగా మార్చేశారు. అయినా సరిపోలేదు. మరణాలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు కరోనా కారణంగా సంభవించే మరణాలలో కొన్ని ఆక్సిజన కొరత వల్ల కలిగినవే. గతేడాది పెద్దగా ‘ఆక్సిజన్ లేక మరణించిన కేసులు బయటపడలేదు. కానీ ఈసారి మాత్రం ఆక్సిజన్ లేమి పెద్ద సమస్యగా మారింది. ఏంటీ ఆక్సిజన్ కొరత? మన చుట్టూ గాలిలో ఆక్సిజన్ ఉంది కదా? అది పనికి రాదా ఆ కరోనా రోగులకు? వైద్యం కోసం ఆక్సిజన్ ను ప్రత్యేకంగా తయారు చేస్తారా? అసలు ఈ ఆక్సిజన్ కథేంటో తెలుసుకుందాం రండి.

మనచుట్టూ ఉండే గాలిలో ఆక్సిజన్ 21 శాతం మాత్రమే ఉంటుంది. అధికంగా నైట్రోజన్ 78 శాతం ఉంటుంది. స్వల్ప స్థాయిలో ఇతర వాయువులు కూడా ఉంటాయి. అయితే ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న రోగికి మనం పీల్చే గాలిని అందించలేం. సాధారణ మనిషి గాలి పీల్చినప్పుడు ఆ గాలిని ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తులు శుధ్ది చేసి ఆక్సిజన్ ను మాత్రమే శరీరానికి అందేలా చేస్తాయి. కానీ కరోనా కారణంగా ఇన్షెక్షన్ సోకిన ఊపిరితిత్తులు గాలిని శుద్ధి చేయడానికి ఇబ్బంది పడతాయి. అందుకే వీరికి స్వచ్చమైన ఆక్సిజన్ ను అందిస్తారు వైద్యులు. దీన్ని ‘మెడికల్ ఆక్సిజన్’ అంటారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు ఎంత లేదన్నా 30 నుంచి 80 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. అదే సాధారణ రోగికి అయితే అయిదు లీటర్ల ఆక్సిజన్ సరిపోతుంది. ఈ ఆక్సిజన్ 99.5 శాతం స్వచ్ఛమైనది.

ఏంటీ కొరత?

గత వందేళ్లలో కరోనాలా ప్రపంచం మీద విరుచుకుపడిన మహమ్మారి ఏదీ లేదు. అందుకే మన దేశంలో తయారయ్యే ఆక్సిజన్ లో కేవలం ఒక శాతం మాత్రమే మెడికల్ ఆక్సిజన్. ఇప్పుడు హఠాత్తుగా కోవిడ్ అనే భూతం ప్రజలపై దాడి చేసి వారికి ఊపిరి అందకుండా అడ్డుకుంటోంది. ఆ ఒక్క శాతం ఆక్సిజన్ ఎంత మంది రోగులకు అందించగలరు? కరోనా రోగుల్లో ప్రతి 20 మందిలో లక్షణాలు తీవ్రంగా ఉన్నాయి. ఆ ఇరవై మందిలో ముగ్గురికీ ఆక్సిజన్ అవసరం పడుతుంది. దీంతో అవసరానికి తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో ‘ఆక్సిజన్ కొరత’ ఏర్పడింది. దీంతో యుద్ధప్రాతిపదికన మెడికల్ ఆక్సిజన్ తయారు చేసేందుకు ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

నిజానికి ఆక్సిజన్ కేవలం మనం గాలి పీల్చుకునేందుకు మాత్రమే కాదు, ఇనుము, కార్లు తయారీ ప్లాంట్లలో కూడా అవసరం. ఆ ప్లాంట్లలో ఆక్సిజన్ తయారీ నిత్యం జరుగుతూనే ఉంటుంది. అంతెందుకు విశాఖలోని స్టీల్ ప్లాంట్లో ఏడాదికి లక్ష టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఇనుము తయారీలో ఉపయోగిస్తారు. ప్రతి కార్ల తయారీ పరిశ్రమలోనూ కచ్చితంగా ఆక్సిజన్ తయారీ ప్లాంటు ఉంటుంది. ఇప్పటికే మారుతి సంస్థ కు చెందిన కొన్ని ప్లాంట్లు తమ కార్ల ఉత్పత్తికి బ్రేక్ ఇచ్చి, మెడికల్ ఆక్సిజన్ తయారు చేసి అందించనున్నట్టు ప్రకటించాయి. ఇది మెచ్చుకోవల్సిన నిర్ణయమే… ఓ పక్క ఆక్సిజన్ లేక ప్రాణాలు పోతుంటే, కార్లు తయారు చేసి ఏం చేసుకుంటారు?

ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు చాలా సంస్థలు ఇప్పటికే ఆక్సిజన్ తయారీకి సిద్ధమవుతున్నాయి. సింగరేణి సంస్థ  ప్రాణవాయువు తయారీని మొదలుపెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని తట్టుకునేందుకు డీఆర్డీవోను రంగంలోకి దింపింది. అక్కడిక్కకే ఆక్సిజన్ ను తయారుచేసే టెక్నాలజీతో దేశవ్యాప్తంగా 500 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. నిమిషానికి ఎంత లేదన్నా వేయి లీటర్ల ఆక్సిజన్ ఇక్కడ తయారుచేయగలదు. ఇలా చేస్తే చాలా మంది ప్రాణాలు నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఇంకా చాలా సంస్థలు ఆక్సిజన్ తయారీపైనే దృష్టి పెట్టాయి. త్వరలోనే ఈ సమస్య తీరి ప్రజల ప్రాణాలు నిలుస్తాయని ఆశిద్దాం.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ గురించి తెలుసా?

ఇది గాలి నుంచి ఆక్సిజన్ ను తయారు చేసి ఇచ్చే ఒక యంత్రం. ప్రధాని మోడీ లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొంటున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వీటి వల్ల 95 శాతం దాకా స్వచ్ఛమైన ఆక్సిజన్ తయారవుతుంది. అయితే ఇది  తీవ్రంగా జబ్బుపడిన రోగుల కోసం మాత్రం కాదు, వారికి అధిక స్థాయిలో ఆక్సిజన్ అవసరం అవుతుంది. కానీ ఇది ఆ స్థాయిలో ఉత్పత్తి చేయలేదు. విద్యుత్ తో నడిచే ఈ యంత్రాల ఖరీదు మాత్రం ఎక్కువ. సామర్థ్యాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడా దొరకడం లేదు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా కూడా వెంటనే వచ్చే పరిస్థితి లేదు.

ఏదేమైనా మే రెండో వారం నాటికి దేశవ్యాప్తంగా ఉన్న కరోనా రోగులకు కావాల్సినంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది, సమస్య తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ అందక మరే ప్రాణమూ పోకుండా ఉండాలని కోరుకుందాం. 

Previous articleకోవిడ్‌ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌‌లో 10 ముఖ్యమైన పాయింట్లు
Next articleమూడు ఆవులు… మూడు గొర్రెలు.. ఒక ఎమ్మెల్యే