నాసాలో మన స్వాతి మోహన్

swatimohan

అంగారక గ్రహంపై పెర్స్ వీరన్స్ రోవర్ ను దించి, ఓ అద్భుతానికి నాంది పలికింది నాసా. ఆ అద్భుతంలో ఓ భారతీయ వనిత కీలక పాత్ర పోషిస్తోంది. నుదుటిన బొట్టుతో నాసాలో భారతావనికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆమె పేరు స్వాతి మోహన్.

‘మనం సాధించాం. రోవర్ అంగారకగ్రహంపై విజయవంతంగా ల్యాండ్ అయింది’… అంటూ స్వాతి గొంతు నాసా ప్రయోగ కేంద్రంలో ప్రతిధ్వనించింది. అది వినగానే శాస్త్రావేత్తలు, ఇంజినీర్లు నిల్చుని ఆనందంతో చప్పట్లు కొట్టారు. మిషన్ విజయవంతమైందని ప్రకటించే అవకాశం ఎక్కడో భారత్ లో పుట్టి, అమెరికా వలస వెళ్లిన స్వాతికి ఎలా దక్కింది?

ఎందుకంటే ఆమె అక్కడ సాధారణ శాస్త్రవేత్త కాదు,  ‘మార్స్ 2020 గైడెన్స్ , నేవిగేషన్ అండ్ కంట్రోల్స్ ’ విభాగానికి  నాయకురాలు. ఈ రోవర్ విజయవంతగా మార్స్ పై దించేందుకు ఆమెతో పాటు చాలా మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు నిద్రహారాలను పట్టించుకోకుండా ఎన్నో రోజులు నిర్విరామంగా పనిచేశారు. అది సక్సెస్ అయ్యేసరికి స్వాతి మోహన్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ‘ఇండియన్ బింది ఇన్ అమెరికా నాసా’ ట్యాగ్ తో స్వాతిమోహన్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది కూడా.

ఆమెను చూస్తేనే ఇండియన్ అని ఇట్టే చెప్పేయచ్చు. ఆ ముఖాకృతి, నుదుటిన చిన్న బొట్టును చూస్తే దక్షిణాది మహిళ అని కనిపెట్టేయచ్చు. స్వాతిది బెంగళూరు. 1981లో జన్మించింది. తండ్రి శ్రీనివాస్ మోహన్, తల్లి జ్యోతి. తండ్రి ప్రైవేటు కంపెనీలో ఇంజినీర్ గా పనిచేసేవాడు.

స్వాతి పుట్టిన ఏడాదికి అతనికి అమెరికాకు వెళ్లే అవకాశం వచ్చింది. కుటుంబంతో సహా మకాం యూఎస్‌కు మారింది. వారికి స్వాతి ఒక్కతే కూతురు కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. చిన్నప్పటి నుంచి  ఆమెకు చిన్నపిల్లల డాక్టరు కావాలని ఉండేది. తనను తల్లి పీడియాట్రిషన్ దగ్గరికి తీసుకెళ్లడం, వ్యాక్సిన్లు వేయించడం, మందులు ఇవ్వడం అన్నీ ఆమెకు బాగా నచ్చాయి.

స్టార్ ట్రెక్ చూసి అంతరిక్షం వైపు..

కానీ తొమ్మిదేళ్ల వయసులో ఆమె ఆలోచన మారింది. టీవీలో స్టార్ ట్రెక్ అనే టీవీ సిరీస్ చూసింది. అందులో అంతరిక్షంలో ప్రయోగాలు చేయడం ఆమెను బాగా ఆకట్టుకుంది. తాను అలానే అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తను అవ్వాలని గట్టిగా అనుకుంది.

చిన్నపిల్లల నిర్ణయాలు నిజానికి అంత స్థిమితంగా ఉండవు, కానీ స్వాతి  మాత్రం అందుకు విభిన్నం. తొమ్మిదేళ్ల వయసులో కన్న కలను నిజం చేసుకుంది. అందుకు ఆమె తల్లిదండ్రులు ఎంతో సహకారాన్ని అందించారు. పదహారేళ్ల వయసు నుంచి పూర్తిగా అంతరిక్ష పరిశోధనకు కావాల్సిన చదువుపైనే దృష్టి కేంద్రీకరించింది.

న్యూయార్క్ లోని కార్నెల్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తరువాత ‘మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)’లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ ను పొందింది. మిట్లో చాలా పరిశోధనలు చేసి గుర్తింపు పొందింది. ఆమె సేవలను గుర్తించిన నాసా 2010లో తమతో పనిచేసే అవకాశం ఇచ్చింది.

శనిగ్రహానికి సంబంధించిన ‘కాసినీ మిషన్’పై  పనిచేసింది. ఆమె పనితీరు నచ్చడంతో మార్స్ 2020 మిషన్ లో కీలకబాధ్యతను అప్పజెప్పింది నాసా. అప్పట్నించి పెర్స్ వీరన్స్ రోవర్ ను మోసుకెళ్లే స్పేస్ క్రాఫ్ పనితీరును, ప్రయాణాన్ని నిర్ణయించే విభాగంలో విధులు నిర్వర్తించడం మొదలుపెట్టింది. అప్పట్నించి ఆమె చేసిన కృషి నేడు మార్స్ పై మట్టిని తీసుకొచ్చే పెర్స్ వీరన్స్ రోవర్కు ప్రయాణాన్ని సులభతరం చేసింది.  

అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు

చిన్నప్పుడు అంతరిక్ష శాస్త్రవేత్తకు ముందు పీడియాట్రిషన్ అవ్వాలని కలలు కనేది. అదేం విచిత్రమో స్వాతి భర్త సంతోష్ నడిపురం ప్రముఖ పీడియాట్రిషన్. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్నపిల్లలను భర్తకు అప్పగించి మార్స్ మిషన్ కోసం ఎన్నో రోజులు ఇంటికి వెళ్లకుండా నాసా ప్రయోగకేంద్రంలో గడిపింది స్వాతి. ఆ కష్టానికి, తత్యాగానికి ఫలితం వచ్చింది. రోవర్ అంగారక గ్రహంపై ల్యాండ్ అయ్యాక. అమెరికా కొత్త అధ్యక్షుడు స్వాతిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

మిషన్ విజయవంత అయ్యిందని తెలియగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాసా శాస్త్రవేత్తలతో వర్చువల్ గా మాట్లాడారు. అందుకు స్వాతి ‘మీరు మాతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు సమయం కేటాయించారు. అందుకు మా ధన్యవాదాలు’ అని చెప్పింది.

అందుకు బైడెన్ ‘మీరు నాతో జోక్ చేస్తున్నారా? ఇది సాధారణ గౌరవం కాదు, చాలా గొప్పదైనది. భారతీయులైన మీరు, మా ఉపాధ్యక్షురాలు కమలా హారిన్, నా స్పీచ్ రైటర్ వినయ్ రెడ్డి… మీరంతా అమెరికాను పటిష్ఠం చేసేందుకు సహకరిస్తున్నారు. మీరు (భారతీయులు) నిజంగా చాలా అద్భుతమైన వారు.’ అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు జో.

మార్స్ పై రోవర్ పనేంటి?

అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లు ఉన్నయన్నది చాలా మంది శాస్త్రవేత్తల నమ్మకం. కోట్ల ఏళ్ల క్రితం ఆ గ్రహంపై సరస్సు ఉండేదని, నీరు ఉంది కాబట్టి కచ్చితంగా జీవం కూడా ఉండే ఉంటుందని వారి అనుమానం. అందుకే ఆ గ్రహం మీద జీవం ఉందా లేదా అని పరిశోధించేందుకే పెర్సెవీరన్స్ రోవర్ ను నాసా పంపింది. రెండేళ్ల పాటూ ఆ రోవర్ అంగారకుడి మీదనే ఉండి మట్టిని, రాళ్లను తవ్వి పరిశోధన చేస్తుంది. 

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌ రివ్యూ : ఊహించిన మలుపులే
Next articleహైదరాబాద్ బెస్ట్ రిసార్ట్స్ .. రీఫ్రెష్ అవ్వండిలా