మూవీ రివ్యూ: కోల్డ్ కేస్
భాష – మలయాళం (ఆంగ్ల సబ్ టైటిల్స్)
ఓటీటీ – అమెజాన్ ప్రైమ్
నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, అదితి బాలన్, ఆత్మీయ రాజన్, లక్ష్మీప్రియ చంద్రమౌళి
దర్శకత్వం – తను బాలక్
సినిమాటోగ్రాఫర్ – గిరీష్ గంగాధరన్, జోమన్ టిజాన్
కోల్డ్ కేస్ కథ ఇదీ:
చెరువులో చేపలు పడుతున్న ఓ వ్యక్తికి వలలో మూటకట్టిన ఓ నల్లటి సంచి దొరుకుతుంది. తెరిచి చూస్తే ఒక పుర్రె బయటపడుతుంది. పోలీసులు రంగంలోకి దిగుతారు. ఏసీపీ సత్యజిత్ (పృథ్వీరాజ్) కేసు బాధ్యతలు తీసుకుంటాడు.
మరోవైపు జర్నలిస్టు మేధా (అదితి) ఓ ఇంట్లో అద్దెకు దిగుతుంది. ఆ ఇంట్లో దిగినప్పటి నుంచి భయపెట్టే సంఘటనలు ఎదురవుతాయి. ఇంట్లో ఏదో కనిపించనిది తిరుగుతోందని అనుమానిస్తుంది. ఆ విషయం తేల్చేందుకు ఆమె కూడా స్వయంగా పరిశోధన మొదలుపెడుతుంది.
ఆ క్రమంలో మేధా, సత్యజిత్ విడివిడిగా ఒకే వ్యక్తి గురించి వెతుకులాట సాగిస్తారు. చివరికి ఆ పుర్రె ఎవరిది? దానికి మేధా ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు సంబంధం ఏంటి? ఆ కేసును ఎలా చేధించారో తెలియాలంటే ‘కోల్డ్ కేస్’ చూడాల్సిందే.
కోల్డ్ కేస్ ఎలా ఉంది?
గుండె వేగాన్ని అమాంతం పెంచేసే బ్యాక్ గ్రౌండ్ సంగీతం లేకుండా, హంగూ ఆర్భాటాలు లేకుండా చాప కింద నీరులా సాగిపోయే సినిమా కోల్డ్ కేస్. ప్రేక్షకుడిని కథలో పూర్తిగా లీనం చేస్తుంది. సినిమాలో ప్రతి సీన్లోనూ ఇన్విస్టిగేషన్ సాగుతూనే ఉంటుంది.
ఎక్కడా సీన్ స్కిప్ చేసే అవకాశాన్ని దర్శకుడ్ బాలన్ ప్రేక్షకుడికి ఇవ్వలేదు. ప్రతి సీన్లోనూ ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంటుంది. ఆ పుర్రె ఎవరిదో కనిపెట్టడానికే మొదటి ఇరవై నిమిషాలు గడుస్తాయి. ఆ తరువాత ఆమె ఎవరో తెలుసుకునేందుకు మరో అరగంట సినిమా నడుస్తుంది.
ఆమెకేమైందో తెలుసుకోవడానికి మరో అరగంట, చివరికి ఎవరు ఎందుకు చంపారో చెప్పేందుకు మరో అరగంట… ఇలా సినిమా సమయాన్ని చక్కగా విభజించాడు దర్శకుడు. మొదటి అర్థభాగం ప్రేక్షకుడు ఉత్కంఠగా చూసేలా ఉంటుంది.
రెండో అర్థభాగం అంటే.. ఎవరు, ఎందుకు చంపారో చెప్పే ఇన్వెస్టిగేషన్ మాత్రం కాస్త సాగదీతలా అనిపిస్తుంది. కానీ బోర్ మాత్రం కొట్టదు. ముఖ్యంగా సినిమా ముగియడానికి పావుగంట ముందు వరకు ప్రేక్షకుడికి విలన్ ఎవరో తెలియదు. సినిమాలో అసలు ట్విస్ట్ అదే.
కాకపోతే ముగింపు చాలా త్వరగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇక హారర్ జోనర్ ఉన్నప్పటికీ అంత భయపెట్టే సీన్లు ఏమీ లేవు. కనుక దీన్ని క్రైమ్ థ్రిల్లర్ గానే చెప్పుకోవాలి. ఫైట్లు, రొమాన్స్, హీరోయిన్ వంటి అంశాలేవీ ఇందులో లేవు. గ్లామరస్ పాత్రలేవీ కనిపించవు.
నటన, సాంకేతికత..
కథకు తగ్గట్టు అందరూ సున్నితమైన హావభావాలతో నటించారు. హీరో పోలీస్ అనగానే ఎంట్రీ సీన్ భారీగా ఫైట్లతో, బిల్డప్ తో తెరకెక్కిస్తారు. కానీ ఆ సినిమాలో అలాంటిదేమీ లేకుండా సహజంగా చూపించారు. కేసు శోధనలోనే అతను ఎంత తెలివైన వాడో చూపించే ప్రయత్నం చేశారు. పృథ్వీరాజ్ కూడా ఆ పాత్రకు తగ్గట్టు చక్కగా నటించాడు.
ఇక జర్నలిస్టుగా చేసిన అదితి కూడా తన పాత్రకు ఎంత కావాలో ఆ పరిధి మేరకు హావభావాలతో ఆకట్టుకుంది. ఆత్మీయ రాజన్ పాత్ర చిన్నదే, ఉన్నంత సేపు చక్కగా నటించింది. ఈ సినిమాలో కనిపించే పాత్రలు తక్కువే అయినా అన్నీ అవసరం మేరకు సినిమాను థ్రిల్లింగ్ గా ముందుకు నడిపించాయి.
సాంకేతికంగానూ సినిమా ఫర్వాలేదు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ బాగుంది. పచ్చని కేరళను చక్కగా చూపించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు కేరళలో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. ఏ పాత్రకు అవసరానికి మించి మేకప్ లేదు.
కోల్డ్ కేస్ ప్లస్ పాయింట్లు..
1. హీరో పృథ్వీరాజ్‌నే సినిమాకు మొదటి ప్లస్ పాయింట్. ఎక్కడా అతి చేయకుండా సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా నటించాడు.
2. కేవలం హీరో పాత్రే కాదు మిగతా వాళ్లు కూడా తమ పరిధి మేరకు నటించి కనుమరుగైపోతాయి.
3. ఈ సినిమాకి కథే ప్రాణం. కేవలం ఒక పుర్రె ఆధారంగా హత్యకేసును చేధించే క్రమం ఆసక్తిగా ఉంటుంది.
మైనస్ పాయింట్లు ఇవే..
1. పుర్రె దొరికిన తరువాత ఎవరూ కంప్లయింట్ ఇవ్వకపోయినా ఏకంగా ఐపీఎస్ స్థాయి అధికారి రంగంలోకి దిగి, ఆ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటారు. కానీ నిజజీవితంలో ఇది జరగడం కాస్త కష్టమే.
2. విలన్ పాత్రను అంత బలంగా చూపించలేదు. అంతేకాదు హత్య వెనుక మోటివ్ కూడా డబ్బే కావడం రొటీన్ గా అనిపిస్తుంది.
3. హర్రర్ ఎలిమెంట్ మిళితం చేయాలని చూశాడు దర్శకుడు. కానీ కుదరలేదో ఏమో, కేవలం చిన్న సీన్లకే హర్రర్‌ను పరిమితం చేశాడు. హర్రర్ ఎలిమెంట్ శాతం పెరిగిఉంటే సినిమా మరింత మందికి నచ్చే అవకాశం ఉండేది.
రేటింగ్: 3/5
రివ్యూ: మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్