మసాబా గుప్తా పీసీఓడీపై అమ్మాయిలకు చెప్పిన సీక్రెట్‌ ఏంటి?

masaba gupta
Image: Instagram

ఒకప్పటి నటి నీనా గుప్తా కూతురు, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా తాను పీసీవోడీని ఎలా జయించారు? శరీర బరువును కోల్పోయి ఎలా ఆనందంగా ఉన్నారో తన అభిమానులతో పంచుకున్నారు.

హౌజ్‌ ఆఫ్‌ మసాబా పేరుతో తన సొంత ఫ్యాషన్‌ బ్రాండ్‌ నడుపుతున్నారు మసాబా. ఎంటీవీ సూపర్‌ మోడల్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

తన జీవిత ప్రయాణంపై మసాబా మసాబా పేరుతో నెట్‌ ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ మూవీని తీసుకొచ్చారు.

తన బరువు కోల్పోవడానికి తాను చేసిన కృషిని, అది తనకు పీసీవోడీ ని జయించడంలో ఎలా సహాయపడిందో తాజాగా ఆమె సోషల్‌ మీడియాతో పంచుకున్నారు.

వ్యాయామం యొక్క ప్రాధాన్యతపై ఇన్‌స్టాగ్రామ్‌లో వివరిస్తూ ఏ తరహా ఎక్సర్‌సైజ్‌ చేసినా సరే వ్యాయామాన్ని మాత్రం రాజీపడకుండా కొనసాగిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో వివరించారు.

ప్రతి రోజూ మీతో మీరు చెప్పుకోండి..

ఇన్‌స్టాగ్రామ్‌లో మసాబా గుప్తా ఇలా రాసుకొచ్చారు. ‘నా బిజినెస్, నా రిలేషన్‌షిప్స్‌ కోసం ఎలా అంకితభావంతో ఉన్నానో నా ఆరోగ్యం కోసం కూడా అలాగే కట్టుబడి ఉన్నాను. ఈ విషయాన్ని ప్రతిరోజూ మీతో మీరు చెప్పుకోండి.

ఫిట్‌నెస్‌ విషయంలో మీరు మీ జీవితంలో రాజీపడకూడని అంశంగా మార్చుకోండి. బేరాలు లేని విషయంగా గుర్తించండి. అసలు కథంతా ఇక్కడే మొదలవుతుంది.

ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సాగే వర్కవుట్‌ లేదా వాకింగ్‌ లేదా యోగా విషయంలో నేను రాజీపడను. బేరాలాడను. వీక్‌ డేస్‌లో బయటి ఫుడ్‌ ఎప్పుడూ ఆర్డర్‌ చేయను. ఇంటి ఫుడ్‌నే తీసుకుంటాను.

రాత్రి పడుకోవడానికి ముందు సెలబ్రేషన్‌ జోలికి వెళ్లను. ఒత్తిడి ఎంత ఉన్నా, ఏవైనా ఫోన్‌ కాల్స్‌ వచ్చినా నా మనస్సును మళ్లించలేవు. ఇలా రాజీపడకుండా సాగించిన నా జీవనశైలి క్రమంగా నా పీసీవోడీని దాదాపుగా క్యూర్‌ చేసింది.

మెడికేషన్‌ అవసరం లేకుండా చేసింది. వ్యాయామం, హెల్త్‌పై ఫోకస్‌ చేసేలా దోహదపడింది. వారాంతాల్లో నా ఫుడ్, డ్రింక్స్‌ను మరింతగా ఆస్వాదిస్తాను. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇష్టంగా గడుపుతాను.

గడిచిన పదేళ్లలో చూస్తే నేను ఇప్పుడు తేలిగ్గా ఉన్నాను. అమ్మాయిలకు హార్మోనల్‌ సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని న్యూట్రిషనల్‌ ఫుడ్‌తో, అలాగే వ్యాయామాలతో దూరం చేయాల్సిన అవసరం ఉంది.

మరి మీరు రాజీపడని, బేరసారాలు చేయని అంశాలేంటి? కామెంట్ల రూపంలో పంచుకోండి..’ అంటూ మసాబా గుప్తా రాశారు. 

 

Previous articleనిమ్మసోడా అమ్మిన ఏరియాకే.. ఎస్ఐ అయ్యింది
Next articleకోల్డ్ కేస్ మూవీ రివ్యూ