బరువు తగ్గడానికి చిట్కాలు ఇవిగో

weight loss
Photo by Natasha Spencer from Pexels

బరువు తగ్గడానికి చిట్కాలు తెలుసుకునే ముందు సహజంగా బరువు తగ్గడంపై దృష్టి పెడితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తిరిగి త్వరగా పెరిగే ఆస్కారం కూడా తక్కువే. శాశ్వతంగా బరువు తగ్గాలంటే అది స్లో గానే జరగాలి. దీనికి డైట్ కూడా అవసరం లేదు. మీ లైఫ్ స్టయిల్ కొద్దిగా మారిస్తే చాలు. సహజంగానే బరువు తగ్గొచ్చు. అదెలాగో చూద్దాం.

ఇరవై రోజుల్లో కిలోబరువు తగ్గొచ్చు..

సహజంగా బరువు తగ్గాలంటే నెమ్మదిగానే తగ్గాలి. 20 రోజులకు కిలో మాత్రమేనా? అని నిట్టూర్చకండి. మంచి పనులు ఎప్పుడూ ఆలస్యంగానే జరుగుతాయి. పది రోజుల్లో అర కిలో తగ్గడం లక్ష్యంగా మీరు పనిచేయాలి.

అంటే రోజూ దాదాపుగా తేలికపాటి వ్యాయామం, నడకతో పాటు ఆహారంలో స్వల్పంగా కోత పెట్టడం వల్ల ఇది సాధ్యమే. కోత పెట్టడం అంటే ఏమీ తినకుండా ఉండడం ఎంతమాత్రం కాదు.

చిన్నప్పుడు బడిలో చేసిన వార్మప్ ఎక్సర్సైజులు చాలు. పెద్దగా వర్కవుట్లు అవసరం లేదు. అలాగే 30 నిమిషాలు నడక. ఇంట్లో, ఇంటి ముందు నడిచినా చాలు. అలాగే వ్యాయామం కూడా ఇంట్లో చేస్తే చాలు. స్టార్టింగ్ లో ఎలాంటి వ్యాయామాలు చేయాలో చెప్పేందుకు అనేక యూట్యూబ్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అవి చూసి ప్రారంభించొచ్చు.

తిండిలో కోత పెట్టడం అంటే తిండి మానేయడం ఎంత మాత్రం కాదు. మీరు మామూలుగానే తినండి. కానీ కడుపు ఇంకొక 20 శాతం మాత్రమే ఖాళీగా ఉందని మీకు అర్థమైనప్పుడు తినడం ఆపేయండి. ఈ చిన్న త్యాగం చేయండి చాలు.

తేలికపాటి వ్యాయామాలు, నడక, ఈ 20 శాతం ఆహారం త్యాగం చేయడం వల్ల రోజుకు 400 నుంచి 500 కేలరీలు మీ శరీరం నుంచి దూరం పెట్టిన వారవుతారు. ఇలా పది రోజులు చేస్తే మీరు సుమారు 5 వేల కాలరీలు దూరం పెట్టినట్టే. అంటే సుమారుగా అరకిలో బరువు తగ్గడం సహజంగానే జరిగిపోతుంది.

కార్బొహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఒక వ్యసనం లాంటివి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిస్తుంది. ఇవి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గిస్తే క్రమంగా శరీరం వీటిని కోరుకోవడం తగ్గుతుంది. వరి అన్నానికి బదులుగా అప్పుడప్పుడు సామలు, కొర్రలు, అండు కొర్రలు, అరకలు వంటి మిల్లెట్స్ తినండి. ఇవి సేమ్ అన్నంలాగే వండుకోవచ్చు. వీటి వల్ల నిదానంగా జీర్ణమై త్వరగా ఆకలి వేయదు.

బరువు తగ్గడానికి ఏం చేయాలి ?

1.బ్రేక్ ఫాస్ట్ మానేయకండి..

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు తగ్గుతామనుకుంటారు. రెండు పూటలే భోజనం చేస్తారు. కానీ బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ప్రయోజనం లేకపోగా నష్టాలే ఎక్కువ. బ్రేక్ ఫాస్ట్ సమయానికే మీరు 12 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉంటారు.

ఈ సమయంలో షుగర్ లెవల్స్ డౌన్ అయి ఉంటాయి. కడుపు ఇంకా ఖాళీగా ఉంచడం వల్ల గ్యాస్టిక్, అల్సర్ సమస్యలు వచ్చే సమస్య ఉంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారు మిగిలిన రోజంతా ఆహారం ఎక్కువ తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అలాగే బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న వారి దిన చర్య చాలా ప్రొడక్టివ్ గా ఉంటుందని, బీఎంఐ కూడా తక్కువగా ఉంటుందని, ఆరోగ్యం కూడా మెరుగవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

2. ఆలస్యంగా తినడం ఆపేయండి

రాత్రి పూట ఒక నిర్ధిష్ట సమయం పెట్టుకుని అప్పుడే తినండి. తిన్న తరువాత కాసేపటికి మళ్లీ తియ్యగా ఏదైనా తినాలనిపిస్తే వాటికి దూరంగా ఉండండి. వీలైనంత వరకు పడుకునే సమయం కంటే రెండు గంటల ముందే తినేయండి.

3. రాత్రిపూట మెనూ మార్చేయండి

రాత్రి పూట భోజనంలో కూడా అన్నమే తినకుండా.. కీరా సలాడ్, కారెట్ సలాడ్, బ్రకొలి, క్యాప్సికం, ఉడికించిన కూరగాయలు.. లేదా ఇవన్నీ సాధ్యం కానప్పుడు రెండు రొట్టెలు, ఏదైనా శాఖాహారం తీసుకోండి. అన్నమే తినాల్సి వస్తే కేవలం ఒక కప్పు రైస్ తో సరిపెట్టండి. ఫ్రూట్ సలాడ్ తీసుకోండి.

4. బాలెన్స్ పాటించండి

ఆహారంలో కోత విధిస్తున్నంత మాత్రానా శరీరానికి కావాల్సిన పోషకాల్లో కూడా కోత వేయాలని కాదు. అవి చాలా మస్ట్. శరీరానికి విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఫైటో న్యూట్రియంట్స్ చాలా అవసరం. అందువల్ల మన ఆహారం బాలెన్స్ ఉండేలా చూడాలి.

ఖరీదైనవో, లేక పిచ్చిపిచ్చిగా అనిపించే రెసిపీస్ జోలికి వెళ్లకుండా అందుబాటులో ఉండే సీజనల్ వెజిటెబుల్స్, ఫ్రూట్స్ మాత్రం ఇంట్లో స్టాక్ ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, డ్రైఫ్రూట్స్ మన దినసరి ఆహారంలో ఉంటే పోషకాహారం తింటున్నట్టే.

5.శరీరంలో కదలిక పెంచండి

మీ పని స్వభావం వల్ల లేక ఇతరత్రా కారణాల వల్ల మీరు ఎప్పుడూ కూర్చొని ఉండేవారైతే ప్రతి అరగంటలో 3 నిమిషాలు అలా నాలుగు అడుగులు వేయండి చాలు. అంటే గంటకు ఆరు నిమిషాలు. పది గంటల్లో 60 నిమిషాలు మీ శరీరాన్ని కాస్త కదిలించడం వల్ల కాస్త యాక్టివ్ అవుతారు. బరువు పెరగకుండా ఉండేందుకు వీలవుతుంది.

6.శత్రువా? మిత్రుడా?

మీరు తినే ప్రతి ఆహారాన్ని ఇది మనకు హాని కలిగిస్తుందా? లేక ప్రయోజనకరమా? అంటూ ప్రశ్నించుకోండి. ఇది అలవాటు చేసుకుంటే మీరు ఎక్కువ కాలరీల ఆహారం తీసుకోకుండా ఉంటారు. శత్రువేదో, మిత్రుడేదో తెలుసుకోగలుగుతారు.

7. ఒత్తిడి తగ్గించుకోండి

ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహారం ఎక్కువగా తీసుకుంటాం. దీని వల్ల బరువు పెరగడం సహజమే. అందువల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలు వెతకండి.

8. మద్యపానం, దూమపానం త్యజించండి

బరువు సహజంగా తగ్గాలంటే మద్యపానం, స్మోకింగ్ మానేయండి. ఇవి ఉంటే ఆకలి ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మద్యం వల్ల శరీరంలో కేలరీలు అదనంగా వచ్చి చేరుతాయి.

Previous articleమన సొంత సమస్యల మాటేంటి..!
Next articleచోక్డ్‌ మూవీ రివ్యూ : నోట్ల రద్దు తెచ్చిన తంటా