మానసిక ఒత్తిడి ఎలా తగ్గించాలి?: డాక్టర్‌ శ్రీలక్ష్మి పింగళి

stress management
Photo by Pedro Figueras from Pexels

కోవిడ్‌–19 నేపథ్యంలో దాదాపు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మరి దానిని ఎలా ఎదుర్కోవాలి? దానికి ఎలాంటి పరిష్కారం ఉంది.. అన్న విషయాలపై కన్సల్టింగ్‌ సైక్రియాట్రిస్ట్‌ (రోషిణీ కౌన్సెలింగ్‌ సెంటర్‌, హైదరాబాద్) డాక్టర్‌ శ్రీలక్ష్మి పింగళి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా
ఒక వీడియో సందేశం ఇచ్చారు. ఆ సందేశం డాక్టర్‌ గారి మాటల్లో..

‘కోవిడ్‌ మహమ్మారి, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మన అందరిలో మానసిక ఒత్తిడి పెరగడం సహజం. నాకు వస్తుందేమో ఈ వ్యాధి.. నా పిల్లలకు వస్తుందేమో.. నా ఉద్యోగం పరిస్థితి ఏంటో? నా భవిష్యత్తు ఏంటో? నేను ఈఎంఐ ఎలా కట్టుకోవాలి. ఇంకా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది కదా.. ఇలాంటి ఆలోచనలు మనల్ని చుట్టుముడతాయి. మీకే కాదు.. నాకు, అందరికీ వస్తాయి. ఈ ఆలోచనలు రావడం సహజం. అయితే ఒత్తిడికి లోనైతే మరిన్ని వ్యాధులకు దారితీస్తుంది.

మరి మానసిక ఒత్తిడి కి లోనుకాకుండా ఏం చేయాలి? మీరు ఈమధ్య కాలంలో వాట్సాప్‌ ఆన్‌ చేస్తున్నా, ఫేస్‌ బుక్‌ చూస్తున్నా, ఎక్కడ ఏ సోషల్‌ మీడియా చూసినా మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలని కొన్ని సలహాలు వస్తున్నాయి. కానీ సానుకూలంగా ఆలోచించలేకపోతున్నామే.. మంచి ఆలోచనలు రావడం లేదే, నెగెటివ్‌ ఆలోచనలు వీడడం లేదే.. నిద్ర పట్టడం లేదే.. ఏం చేయాలి..

హెల్తీ మైండ్‌ ఎప్పుడు ఉంటుంది?

హెల్తీ మైండ్‌.. హెల్తీ బాడీలోనే ఉంటుంది. శారీరకంగా బాగా లేనప్పుడు మానసికంగా బాగుండడం కష్టం. అందుకే ఫిట్‌గా ఉండాలి. బయట వాకింగ్‌ చేయలేనప్పుడు ఇంట్లో చేయండి. ఇంట్లోనే ఎక్సర్‌సైజ్‌లు చేయండి. యోగా చేయండి. డాన్స్‌ చేయండి.. ఎలా చేయాలో తెలియనప్పుడు టీవీలో, యూట్యూబ్‌లో చూడండి. ఫిజికల్‌ యాక్టివిటీస్‌ ఉంటే శరీరం బాగుంటుంది. మనసు కూడా బాగుంటుంది.

పౌష్టికాహారం తీసుకోవాలి

మన ఆరోగ్యానికి పౌష్టికాహారం చాలా ముఖ్యం. బయట కొనుక్కోవడం కష్టంగా ఉండొచ్చు. ఇంట్లోనే ప్రయోగాలు చేయండి. ఆరోగ్యాన్నిచ్చే దినుసులు మన కిచెన్‌లో చాలా ఉంటాయి. వాటిని ఉపయోగించడం నేర్చుకోండి. ఇంట్లో కుటుంబ సభ్యులకు నేర్పండి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

నిద్ర తగినంత అవసరం

లాక్‌డౌన్‌ వల్ల ఆఫీస్‌ ఉన్నా లేకపోయినా రోజూ ఒకే సమయంలో లేవడం మంచిది. ప్రతి మనిషికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు అవసరం. ఉదయం ఆఫీస్‌ వెళ్లాల్సిన పనిలేదని రాత్రి ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేవడం తగదు. రాంగ్‌టైమ్‌లో పడుకుని రాంగ్‌టైమ్‌లో లేవడం వల్ల జీర్ణక్రియలో మార్పులు చోటుచేసుకుంటాయి.

ఇది అనర్థాలకు దారితీస్తుంది. నిద్రపోయే ముందు మైండ్‌ రిలాక్స్‌గా ఉండాలి. మొబైల్, టీవీలకు దూరంగా ఉండండి. టీ, కాఫీలు తీసుకోవద్దు. భోజనం ఓ గంట ముందే చేయాలి. ఒక టైమ్‌ ఫిక్స్‌చేసుకుని నిద్ర పోవాలి. నిద్ర బాగా పడితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

సానుకూల దృక్పథం అవసరం..

యాంగై్జటీ, డిప్రెషన్‌ ఉన్నవాళ్లు పాజిటివ్‌గా ఆలోచించమంటే ఒత్తడి పెరుగుతుంది. కానీ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇలాంటి వారు డాక్టర్ల సలహా మేరకు మందులు తీసుకోవాలి. ఇదివరకే మందులు తీసుకుంటే వాటిని ఆపరాదు.

ఇక మానసిక సమస్యలు లేని వారు మాత్రం తమ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించాలి. న్యూస్‌ చూడడం ద్వారా పదే పదే ఆలోచన వస్తే ఆపేయండి. రోజుకు ఒకేసారి చూడండి. భయపడకూడదు. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలు పాటిస్తే చాలు.

ధైర్యంగా ఉండండి. నాకే వస్తుందని భయపడరాదు. నాకేం కాదని నిర్లక్ష్యం వద్దు. మాస్కులు పెట్టుకోవాలి. శానిటైజర్‌ వాడాలి. ఇలాంటి ఆరోగ్య సలహాలు పాటించాలి.

హాబీలు రీస్టార్ట్‌ చేయాలి..

పుస్తకాలు చదవడం, పెయింటింగ్‌ చేయడం, పాటలు పాడడం డాన్స్‌ చేయడం, ఇలా ఏ హాబీ ఉంటే అవి మళ్లీ మొదలుపెట్టండి. మనసు బాగుండాలంటే ఇతరులకు ఇస్తే మనసు బాగుంటుంది. తోటివారికి సాయం చేయండి. దేవుడిపై నమ్మకం ఉంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నం కావొచ్చు. పిల్లలతో ఆడుకోండి. పిల్లలు వయసును బట్టి అర్థం చేసుకుంటారు. మనను బట్టి వారి రియాక్షన్‌ ఉంటుంది. మనం భయపడితే వారు భయపడతారు. మనం ధైర్యంగా ఉంటూ వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. వారిని గైడ్‌ చేయాలి. ఈ టైమ్‌ కూడా ఈజీగా పాస్‌ ఆన్‌ అయిపోతుందని గుర్తించాలి..’ 

డాక్టర్‌ శ్రీలక్ష్మి పింగళి , కన్సల్టింగ్‌ సైక్రియాట్రిస్ట్‌ (రోషిణీ కౌన్సెలింగ్‌ సెంటర్‌, బేగంపేట్, హైదరాబాద్, పూర్తి వివరాల కోసం డాక్టర్ గారి వెబ్ సైట్ ఇక్కడ క్లిక్ చేయగలరు.) 

పూర్తి వీడియో సందేశం కోసం కింద ఉన్న వీడియో చూడండి

ఇవీ చదవండి

Previous articleఈ 4 స్ట్రెస్‌ లక్షణాలు.. ఏ వ్యాధులకు దారితీస్తాయి?
Next articleసినిమా షూటింగులకు త్వరలోనే అనుమతులు