ఈ 4 స్ట్రెస్‌ లక్షణాలు.. ఏ వ్యాధులకు దారితీస్తాయి?

stress signs
Photo by Andrea Piacquadio from Pexels

ఒత్తిడి లేదా స్ట్రెస్‌ ను పలు లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. స్ట్రెస్ తో బాధపడుతున్నట్టు చాలా మంది అంగీకరించరు. కానీ వారి వ్యవహార శైలి ఆధారంగా ఇతరులు సులువుగా గుర్తిస్తారు. పిల్లలను క్రమశిక్షణలో ఉంచాల్సి వచ్చినప్పుడు, ఆఫీస్‌లో బిజీగా ఉండే సమయంలో, ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే సమయంలో, ఏదైనా రిలేషన్‌షిప్‌ బీటలు వారే సమయంలో మీలో ఒత్తిడి లక్షణాలు బయటకు కనిపిస్తాయి. కానీ దీనిని మీరు గుర్తించకపోవచ్చు. అంగీకరించకపోవచ్చు.

కొద్దిగా స్ట్రెస్‌ ఉండడం వల్ల పనులు ఒక పద్ధతి ప్రకారం చక్కబెట్టుకోవచ్చు. కానీ తీవ్ర ఒత్తిడి ఎదురైతే అది తక్షణ, దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. శారీరకంగా, మానసికంగా కృంగదీస్తుంది. మరి స్ట్రెస్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచాలంటే ముందుగా ‘ఒత్తిడి’ లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. కాస్త దృష్టి పెడితే గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ముందు జాగ్రత్తగా గ్రహించకపోతే మాత్రం మనం దీని వల్ల దెబ్బతినక తప్పని స్థితి ఎదురవుతుంది.

స్ట్రెస్‌ అంటే ఏంటి?

స్ట్రెస్‌ అంటే మన శరీరం ఏదైనా ప్రమాదం ఎదురవుతున్నప్పుడు కొన్ని రసాయనాలు విడుదల చేస్తుంది. అది ప్రమాదం జరగబోతున్నా, ప్రమాదం జరుగుతుందని ఊహించినా, ఆందోళన చెందుతున్నా శరీరంలో రసాయనాలు విడుదలవుతాయి. ఈ సందర్భంలో మనిషి పోరాడడమా? పారిపోవడమా? అన్న సంఘర్షణకు లోనవుతాడు. అకస్మాత్తుగా గుండె వేగం పెరుగుతుంది. కండరాలు బిగపట్టినట్టు అవుతుంది. శ్వాస వేగంగా పీల్చాల్సి వస్తుంది. రక్తపోటు పెరుగుతుంది. వాస్తవానికి ఇది మనల్ని మనం కాపాడుకోవడానికి శరీరం స్పందించే తీరు.

అయితే ఇది అందరిలో ఒకేలా ఉండదు. వారి ఆలోచన తీరునుబట్టి ఉంటుంది. వారు స్పందించే తీరును బట్టి ఉంటుంది. ఒక విషయాన్ని కొందరు చాలా ఈజీగా తీసుకుంటారు. మరికొందరు మనసులోకి తీసుకుంటారు. అయ్యో.. ఎలా అధిగమించాలన్న ఆలోచనలో పడిపోతారు. కొందరు స్ట్రెస్‌ను సులువగా మేనేజ్‌ చేస్తారు. కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. ముఖ్యంగా సున్నిత మన స్కులకు ఇది సాధ్యం కాదు.

స్ట్రెస్‌ లక్షణాలు ఏంటి?

స్ట్రెస్‌ లక్షణాలు మన జీవితంలోని అన్ని అంశాలపై ప్రభావం చూపుతుంది. అంటే భావోద్వేగాలు కావొచ్చు, వ్యవహార శైలి కావొచ్చు, ఆలోచనా తీరుపై కావొచ్చు. శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా ఒత్తిడి మన పై ప్రభావం చూపుతుంది. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరించం వల్ల ఆయా వ్యక్తులపై ఒత్తిడి ప్రభావం విభిన్నరీతుల్లో ఉంటుంది.

స్ట్రెస్ : భావోద్వేగపరమైన లక్షణాలు

– ఏదైనా వినగానే మీరు నియంత్రణ కోల్పోతున్నట్టుగా నిరాశకు లోనవడం
– త్వరగా ఆందోళనకు గురవడం, విసుగుకు లోనవడం, చిరాకుపడడం, మూడీగా ఉండడం
– మీ ఆలోచనలను నిలువరించలేకపోవడం, మైండ్‌కు విశ్రాంతి లేకపోవడం
– ఆత్మన్యూనత(మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయడం)కు లోనవడం
– ఒంటరితనం ఫీలవడం, డిప్రెషన్‌కు లోనవడం
– ఇతరులను దూరం చేయడం, ఇతరులను భరించలేకపోవడం, చీదరించుకోవడం

స్ట్రెస్ : శారీరక లక్షణాలు

– ఒంట్లో శక్తి లేకపోవడం
– తలనొప్పితో బాధపడుతుండడం
– డయేరియా, మలబద్ధకం, కడుపు అప్‌సెట్‌ కావడం, వికారానికి లోనవడం
– ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం
– నిద్ర పట్టకపోవడం
– చేతులు, కాళ్లు చల్లబడడం, చెమటలు పడుతుండడం
– నోరు ఎండిపోవడం
– ఆహారం మింగడంలో ఇబ్బంది పడడం
– దవడ బిగుసుకుపోవడం
– చాతీలో నొప్పి, గుండె వేగం పెరగడం
– తరచుగా జలుబు చేయడం, ఇన్ఫెక్షన్లకు గురవడం
– లైంగిక కోరికలు తగ్గిపోవడం, లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం
– చెవిలో పోటెత్తినట్టుగా ఉండడం, నెర్వస్‌నెస్‌ ఫీలవడం, చేతులు వణకడం

స్ట్రెస్ : మెదడు సంబంధిత లక్షణాలు

– ఆలోచనలను, పనులను క్రమపద్ధతిలో చేయలేకపోవడం
– ఆలోచనలు పరుగెడుతుండడం
– ఏకాగ్రత లోపించడం
– మంచి చెడులు గుర్తించి నిర్ణయానికి రాలేకపోవడం
– నిరాశలో కూరుకుపోవడం
– అదేపనిగా ఆందోళన చెందడం
– కేవలం వ్యతిరేక దిశలోనే ఆలోచించడం, సానుకూల ఆలోచన లేకపోవడం

స్ట్రెస్ : ప్రవర్తన సంబంధిత లక్షణాలు

– అతిగా కాళ్లు ఊపుతూ ఉండడం, గోళ్లు కొరుకుతూ ఉండడం
– వాయిదాలు వేయడం, బాధ్యతలు తీసుకోకపోవడం
– మద్యం, సిగరెట్లు, డ్రగ్స్‌ వంటి అలవాట్లు ఉంటే వాటిని అతిగా తీసుకోవడం
– ఆకలి మందగించడం లేదా అతిగా తినడం
– పలు విషయాలు మరిచిపోతుండడం

స్ట్రెస్‌ తో దీర్ఘకాలం బాధపడితే ఏ వ్యాధులకు దారితీస్తుంది?

– స్ట్రెస్‌ ఒత్తిడి చాలాకాలం పాటు కొనసాగితే అది అనేక వ్యాధులకు దారితీస్తుంది. తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుంది.
– కుంగుబాటు(డిప్రెషన్‌), యాంగై్జటీ, పర్సనాలిటీ డిజార్డర్స్‌ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి.
– గుండెపోటు సహా గుండె సంబంధిత వ్యాధులు
– రక్తపోటు(బీపీ)
– పల్స్‌ రేటులో హెచ్చుతగ్గులు, పల్స్‌ రేటు పెరగడం
– డయాబెటీస్‌
– బాగా బరువు పెరగడం
– కార్పొహైడ్రేట్‌ ఫుడ్‌ అధికంగా తీసుకోవాల్సి రావడం
– పురుషుల్లో శ్రీఘ్ర స్కలనం, ఇతర లైంగిక సమస్యలు తలెత్తడం
– పురుషులు, మహిళల్లో లైంగిక కాంక్షలు తగ్గిపోవడం
– చర్మ సంబంధిత వ్యాధులు
– వెంట్రుకలు రాలిపోవడం
– గ్యాస్ట్రయిటిస్, గ్యాస్ట్రోఎసోఫాజీల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌(జీఈఆర్డీ), అల్సర్, పెద్ద పేగులో తీవ్ర సమస్యలు, ఇన్‌ఫ్లమేటరీ బౌల్‌ డిసీజ్‌(ఐబీడీ) వంటి సమస్యలు తలెత్తుతాయి.
– మతిమరుపు రావడం

స్ట్రెస్‌కు పరిష్కారం ఏంటి?

స్ట్రెస్‌కు పరిష్కారం అంటే.. దేనివల్ల అయితే స్ట్రెస్‌కు లోనవుతున్నారో గుర్తించి దానిని తేలిగ్గా మేనేజ్‌ చేయడం నేర్చుకోవడమే పరిష్కార మార్గం. ఉదాహరణకు మీకు వృత్తిపరమైన ఒత్తిళ్లు ఉంటే.. మీరు ఎంత వరకు చేయగలుగుతారో అంతే చేయండి. మీ చేతిలో లేని వాటిని మీరు హ్యాండిల్‌ చేయగలిగితేనే ఆ జాబ్‌లో కొనసాగండి.

లేనిపక్షంలో మీరు తక్కువ ఒత్తిడి ఉన్న ఇతర ఉద్యోగాలను ఎంచుకోవడం లేదా మీరే సొంతంగా, అది చిన్న వ్యాపారమైనా సరే.. దాని కోసం మీ సమయం వెచ్చిస్తే.. మీ ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం చేయాలన్న మీ కల నెరవేరుతుంది. మీకోసం మీరు పనిచేసుకోవడంలో సంతృప్తి లభిస్తుంది. మిమ్మల్ని శాసించే బాస్‌ ఎవరూ ఉండరక్కడ. మీకు మీరే బాస్‌. మీ ఆరోగ్యమే మీకు, మీ కుటుంబానికి మహా భాగ్యం.

రిలేషన్ షిప్ బ్రేక్ అయితే ఒక్కోసారి డిప్రెషన్ కు లోనవ్వాల్సి వస్తుంది. కానీ గుర్తుంచుకోండి. మీరు ఆరోగ్యంగా మీ జీవితంలో ముందుకు సాగితేనే మీ ప్రేమనైనా, ఇంకేదైనా సాధించగలరు. 

ఇప్పటికే ఒత్తిడికి లోనై తద్వారా శారీరక, మానసిక లక్షణాలు కనిపిస్తుంటే వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం, యోగా, ధ్యానం అలవరుచుకుంటే మీకు కొత్త శక్తి వస్తుంది.

ఇవీ మీకు నచ్చుతాయి:

  1. మానసిక ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి: డాక్టర్ శ్రీలక్ష్మి
  2. ఒత్తిడి నుంచి ఉపశమనం ఇలా
  3. ఒంట్లో కొవ్వు మలినాలు ఎలా వదిలించుకోవాలి
  4. ఆరోగ్యంగా ఉండేందుకు ఆరు మార్గాలు
  5. నగరాలపై మోజు తీరిందా?

Previous articleకరోనా వైరస్ ‌పై తొలి సినిమాః లాక్‌డౌన్‌లోనే షూటింగ్‌ చేసిన వర్మ
Next articleమానసిక ఒత్తిడి ఎలా తగ్గించాలి?: డాక్టర్‌ శ్రీలక్ష్మి పింగళి