Squid Game review: స్క్విడ్ గేమ్ రివ్యూ : అవసరం ఆడించే ఆట

squid game

Squid Game review: స్క్విడ్ గేమ్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని వారుండరు. మోస్ట్ పాపులర్ అయిన ఈ వెబ్ సిరీస్ కొద్దికాలంలోనే మనీహెయిస్ట్‌ను దాటి టాప్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతగా పాపులర్ అయిన ఈ సిరీస్‌లో ఏముంది ? ఇందులో ఆకట్టుకున్నక‌థాంశాలేంటో ఇప్పుడు చూద్దాం. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న స్క్విడ్ గేమ్ సిరీస్‌ సౌత్ కొరియాకు చెందింది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సిరీస్ కొద్దిరోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సిరీస్‌గా నిలిచింది. త్వరలోనే ఈ సిరీస్‌ను 9 భార‌తీయ భాష‌ల్లోకి అనువదిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. సీజన్ 1 లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. చూస్తున్నంతసేపూ ప్రతీ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ‌గా సాగుతూ థ్రిల్‌కు గురిచేస్తుంది.

స్క్విడ్ గేమ్‌ Squid Game కథేంటంటే..

ఉద్యోగం కోల్పోయి.. ఎక్కడా ప‌ని దొరక్క భారీగా అప్పులు చేస్తూ,  తీవ్రమైన ఆర్థిక స‌మ‌స్యలలో హీరో కూరుకుపోయి ఉంటాడు. మరోపక్క అతని భార్య అత‌నికి విడాకులు ఇచ్చి త‌మ కూతురితో వేరేగా ఉంటుంది. ఆమె ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుని, అత‌నితో క‌లిసి అమెరికా వెళ్లే ప్లాన్ చేస్తుంటుంది. హీరో ఎలాగైనా కూతురిని దక్కించుకోవాలనుకుంటాడు. కానీ ఇప్పుడు అతనున్న పరిస్థితిలో అది కుదరని పని. పిల్లల్ని పోషించగల ఆర్ధిక స్థోమత ఉందని కోర్టు ముందు నిరూపించుకోగలిగితేనే కూతురిని అతను దక్కించుకోవచ్చు. ఇదీ హీరో పరిస్థితి. ఇదిలా ఉన్నప్పుడు హీరోకి ఒక గుర్తుతెలియని వ్యక్తి వచ్చి గేమ్స్ ఆడి, గెలిస్తే కోట్లు గెలుచుకోవచ్చని ఒక కార్డు ఇచ్చి వెళతాడు. 

స్క్విడ్ గేమ్‌ Squid Game గేమ్ స్టార్ట్

హీరోలాగే  జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పుల పాలైన 456 మందిని గేమ్స్ కోసం ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్‌ గ్రీన్‌లైట్‌, థగ్ ఆఫ్‌ వార్‌ లాంటి చిన్నపిల్లల ఆటలు ఆడిస్తారు. ఇలా మొత్తం ఆరు ఆటలు గెలిచిన వారికి 39 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఈ ఆటలన్ని చిన్నపిల్లల ఆటల్లాగానే ఉంటాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆటలో ఓడిపోయిన వారు ఎలిమినేట్‌ అవుతారు. ఎలిమినేట్ అంటే ఆటలో నుంచి కాదు. జీవితం నుంచి. అంటే ఆట ఓడిపోయిన వాళ్లనందర్నీ అక్కడికక్కడే చంపేస్తారన్న మాట. ఇలాంటి ప్రాణాంతకమైన ఆరు ఆటలను పూర్తిచేసుకొని చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేది కథలో చివరి వరకూ ఇంట్రెస్టింగ్ గా సాగే ఎలిమెంట్.

ఆద్యంతం ఆసక్తికరం

456 మంది ఆడిన గేమ్‌లో ఏం జ‌రిగుతుంది? గేమ్స్ ఎలా ఆడారు ?  ఎవరు ఎలా విజ‌యం సాధించారు ? చివ‌ర‌కు ఏమ‌వుతుంది ? ఈ గేమ్స్ ఆడిస్తున్నది ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.. ప్రతీ నిమిషం ఉత్కంఠతో సాగే ఈ సిరీస్ లో హ్యూమన్ ఎమోషన్స్ చక్కగా పండాయి. ప్రాణాలకు తెగించి ఆడే ఆటల్లో ఒకరికొకరు అండగా నిలబడడం, మోసం చేయాల్సి రావడం, స్నేహం, సహకారం, త్యాగం .. ఇలా సిరీస్‌ అంతా ఎమోషనల్ డ్రామా విత్ సస్పెన్స్ తో ఎంతగానో కట్టిపడేస్తుంది.

గేమ్స్ వెనుక కథ

గుర్రాలపై పందేలు వేసి మనుషులు ఎలా ఎంజాయ్ చేస్తారో.. అచ్చం అలాగే ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన బిలియనీర్లు ఈ స్క్విడ్ గేమ్‌ను వినోదం కోసం సృష్టించుకుంటారు. డబ్బుకోసం ప్రాణాలు తెగించి ఆడుతున్నవారిని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. జీవితంలో అన్నీ కోల్పోయి డబ్బు కోసం పరితపిస్తున్న అందరినీ ఒక ఐల్యాండ్‌లోకి తీసుకొచ్చి వారితో ప్రాణాలకు తెగించే గేమ్స్ ఆడిస్తుంటారు.

సెన్సిటివ్ టచ్

ఈ కథ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తున్నప్పటికీ ఇందులో ఎమోషనల్ టచ్ కూడా ఉంది. పారాసైట్ సినిమాలో లాగా సమాజంలోని అంతరాలను స్పష్టంగా చూపించడంలో ఈ సిరీస్ పూర్తిగా సక్సెస్ అయింది. సమాజంలో వ్యత్యాసాలు, గతిలేక క్రైమ్‌కు బానిసలవుతున్న సందర్భాలు, పోటీ ప్రపంచంలో పడి మానవత్వాన్ని మర్చిపోతున్న మనుషులు.. ఇలా ఎన్నో సెన్సిటివ్ విషయాలను కూడా ఈ సిరీస్ చాలా చక్కగా డీల్ చేసింది.

Previous articleఆరోగ్యానికి కొరియన్ ఫార్ములా ఇలా..
Next articlemoney heist: మనీ హెయిస్ట్ రివ్యూ: ప్రతీ సీన్ క్లైమాక్సే