తాండవ్ వెబ్ సిరీస్ రివ్యూ : అధికార దాహం చేసే వికృత నాట్యం

tandav
[yasr_overall_rating size=”medium” postid=”2454″]

తాండవ్ .. అమెజాన్ ప్రైమ్‌లో చాలా రోజుల తర్వాత విడుదలైన మరో భారీ వెబ్ సిరీస్ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కులం, డబ్బు, అవినీతి, అధికార దాహాలే రాజకీయాలను నిర్దేశిస్తాయనడంలో సందేహం లేదు. రోజూ పత్రికల్లో, డిజిటల్ మీడియాలో కనిపించేది రాజకీయాల్లోని అంతిమ ఫలితాలే. కానీ వాటి వెనుక జరిగిన పరిణామాలు సామాన్యులకు ఎక్కువగా తెలియవు. అటువంటి తెరవెనక సంఘటనలను కథ రూపంలో చెప్తే అది తాండవ్ వెబ్ సిరీస్ లాగే ఉంటుంది. 

అధికారం కోసం ఎంతకైనా తెగించే, అథపాతాళానికైనా దిగజారిపోయే కొంతమంది నేతలకు పాత్రల రూపం ఇస్తే అది తాండవ్‌లోని కారెక్టర్స్ లాగే ఉంటుందేమో. 

ఇక కథ విషయానికొస్తే దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రధాని అవ్వాలని ఉవ్విళ్లూరుతున్న జన్‌లోక్ దళ్ పార్టీకి చెందిన దేవికీనందన్ (థిగ్మంషూ ధూలియా) ఆయన సన్నిహితుడు, పార్టీ అధ్యక్షుడైన గోపాల్ దాస్ మున్షి (కుముద్ మిశ్రా)తో తన కొడుకు సమర్ ప్రతాప్ సింగ్ (సైఫ్ అలీ ఖాన్) తనకంటే క్రూరుడని, ఓ నియంత అని చెప్తాడు. ఎన్నికల ఫలితాలొస్తాయి. జన్‌లోక్ దళ్ పార్టీ విజయం సాధిస్తుంది. 

రాత్రి తండ్రీ కొడుకులు ఆనందంతో పార్టీ చేసుకుంటారు. దేవకీనందన్ అకస్మాత్తుగా కుర్చీలో రక్తం కక్కుతూ పడిపోతాడు. ప్రాణాలు పోతాయి. తండ్రి ఉండగా తాను ప్రధాని అవ్వలేనని భావించిన సమర్ ప్రతాపే కన్నతండ్రికి విషమిచ్చి చంపుతాడు. భార్య అయేషా (సారా జేన్ డయాస్) కూడా సహకరిస్తుంది. 

తాండవ్ మొదలైంది.. 

ఇక అత్యంక్రియల తర్వాత ప్రధాని సీటులో కూర్చోవడమే తురవాయి అని సమర్ అనుకునే సమయంలో తండ్రి అంత్యక్రియల్లో దేవికీ నందన్ సన్నిహితురాలు, పార్టీ సీనియర్ మెంబర్ అనురాధా కిషోర్ (డింపుల్ కపాడియా) సమర్ తండ్రిని చంపిన విషయం తనకు తెలుసని చెప్తుంది. మర్యాదగా ప్రధానిగా తన పేరు ప్రస్తావించమని చెప్తుంది. గత్యంతరం లేక సమర్ ఆమెను ప్రధానిగా అంగీకరించాల్సి వస్తుంది.

మరోవైపు దిల్లీలో వీఎన్‌యూ యూనివర్సిటీ రాజకీయాల్లో విద్యార్థులు ఆజాదీ కావాలంటూ నినాదాలు చేస్తుంటారు. పదవికోసం ఎంతకైనా తెగించే సమర్ ప్రతాప్ తన అనుచరుడు గురుపాల్ ‌(సునీల్ గ్రోవర్) తో కలిసి యూనివర్సిటీ విద్యార్థులను వాడుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలో ఇద్దరు విద్యార్థులను హత్య చేయిస్తాడు సమర్.

మరోవైపు సమర్‌ ఎప్పటికైనా ప్రమాదకారి అని భావించే అనురాధ కిషోర్ అతన్ని పూర్తిగా అడ్డు తొలగించునేందుకు ప్లాన్స్ వేస్తుంది. ప్రధానమంత్రి పదవి కోసం అనురాధా కిషోర్, సమర్ ప్రతాప్‌ల మధ్య జరిగే రాజకీయ చదరంగంలో విద్యార్థులనే పావులు బలవుతూనే ఉంటారు.

ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ శబ్దం రాని విధ్వంసకర హింసను రాజేస్తారు. అందులో మీడియా, కులం, ప్రాంతం, డబ్బును యథేచ్చగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా అమాయకులు, సిద్దాంతాల ప్రవాహంలో కొట్టుకుపోయే కొంతమంది విద్యార్థులను బలి చేస్తారు.

పదవి కోసం కన్న తండ్రినే చంపిన సమర్.. అనురాధను పదవి నుంచి దింపుతాడా లేక గత్యంతరం లేక పార్టీ అధ్యక్షుడు గోపాల్‌దాస్‌ను ప్రధానిగా చేస్తాడా లేక అనురాధానే వీరిద్దర్నీ అడ్డు తొలగించుకుందా అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. 

మొత్తం 9 ఎపిసోడ్లతో ఉన్న తాండవ్‌లో మొదటి సన్నివేశంలోనే సమర్ ప్రతాప్ క్యారెక్టర్ గురించి తండ్రి మాటల్లో చెప్పిస్తాడు డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్. 

ప్రపంచంలో అన్నింటికంటే పదవినే ఎక్కువగా ప్రేమించే తండ్రి.. తండ్రి కూర్చున్న ప్రధాని పీఠంపై ఎప్పుడెప్పుడు కూర్చోవాలా అని తహతహలాడే కొడుకు.. అవకాశం కోసం గోతికాడ నక్కలా ఎదురుచూసే ఓ స్నేహితుడు… నిలువెల్లా విషం ఉన్నా తేనెపలుకులు పలికే స్నేహితురాలు… రాజకీయనేతల్లో అంతరాళాల్లో ఉండే వికృత ఆలోచనలు.. వీటి ఆధారంగా సన్నివేశాలను అల్లుకున్నాడు దర్శకుడు.

అంతకుముందు సల్మాన్ ఖాన్ తో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, భారత్ వంటి భారీ చిత్రాలు తీసిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన మొదటి వెబ్ సిరీస్ తాండవ్. 

ఆకట్టుకునేలా సాగే తాండవ్ 

భారత్ లో వెబ్ సిరీస్‌లో పెద్ద పెద్ద నటులు రాకముందే నెట్‌ఫిక్స్ లో సేక్రెడ్ గేమ్స్ తో అందులోకి ప్రవేశించి గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మరోసారి తను కేవలం ప్లేబాయ్ రోల్స్ మాత్రమే కాదు ఇంటన్స్ పెర్ఫామెన్స్ పాత్రలు కూడా చేయగలలని నిరూపించుకున్నాడు.

సైఫ్ మొదటిసారి నెగిటివ్ రోల్ చేసింది ఏక్ హసీనా థీ చిత్రం .. కానీ నెగిటివ్ రోల్‌లో బాగా పేరుతెచ్చుకుంది మాత్రం ఓంకార చిత్రంలో. ఆ తర్వాత సైఫ్ తన స్టన్నింగ్ పెర్ఫామెన్స్ తాండవ్ అని చెప్పొచ్చు.

ఒకప్పటి అందాల నటి డింపుల్ కపాడియా సైఫ్ అలీ ఖాన్‌కు పోటీ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక సమర్ అనుచరుడిగా చేసిన సునీల్ గ్రోవర్ కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలుసు. కానీ తనలో మంచి నటుడు ఉన్నాడని అప్పుడప్పు ఇలాంటి పాత్రలతో చెప్తుంటాడు. విద్యార్థి నాయకుడిగా జీషాన్అహ్మద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి తాండవ్ కచ్చితంగా నచ్చుతుంది. గ్రిప్పింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే చివరివరకు ఉత్కంఠ రేపుతుంది. ఫిబ్రవరి 12 నుంచి తాండవ్ వెబ్ సిరీస్ ను తెలుగులో కూడా చూడొచ్చని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది.


వెబ్ సిరీస్ రివ్యూ : తాండవ్ 

రేటింగ్ : 4/5

ఓటీటీ ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్

దర్శకత్వం:   అలీ అబ్బాస్ జాఫర్

నటీనటులు:

సమర్ ప్రతాప్ సింగ్        –        సైఫ్ అలీ ఖాన్

అనురాధా కిషోర్           –        డింపుల్ కపాడియా

గోపాల్ దాస్                –        కుముద్ మిశ్రా

దేవకీ నందన్               –        థిగ్మంషూ ధూలియా

శివ శేఖర్                   –        జీషాన్ అహ్మద్

గురుపాల్                  –        సునీల్ గ్రోవర్

అయేషా ప్రతాప్ సింగ్      –        సారా జేన్ డయాస్

రివ్యూ – కే

Previous articleఎ కాల్ టు స్పై : గత కాలపు ‘కొత్త హీరో’ల సాహస గాథ
Next articleసర్ .. ప్రేమ ఉంటే చాలా?