వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారులకు నిధుల విడుదల

ys jagan
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘దాదాపు 12,132 జంటలను ఏకం చేస్తూ వారికి తోడుగా ఉండేందుకు రూ. 87.32 కోట్ల డబ్బును పెళ్లి కుమార్తెల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఈ మంచి కార్యక్రమం కేవలం ఆర్ధికంగా ఆదుకోవడమే ఒక్కటే కాకుండా, 10వ తరగతి పిల్లలు కచ్చితంగా చదివి ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. అప్పుడే షాదీతోఫా, కళ్యాణమస్తులు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పాం. ఇది ఎప్పుడైతే ఎఫెక్టివ్‌గా మైండ్‌లో రిజిస్టర్‌ అవుతుందో అప్పుడు కచ్చితంగా పదోతరగతి వరకు చదివించాలన్న తపన ప్రతి ఒక్క పేదకుటుంబంలో మొదలవుతుంది..’ అని వివరించారు.

జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే

  1. కచ్చితంగా 18 సంవత్సరాలు వయస్సు అమ్మాయికి, 21 సంవత్సరాలు వయస్సు అబ్బాయికి ఉండాలన్న నిబంధన కూడా ఉంది. ఏ కుటుంబం అయినా పదోతరగతి వరకు తమ పిల్లలను చదివించేసరికి 15 ఏళ్లు వయస్సు వస్తుంది. పదోతరగతి 15 ఏళ్లకు అయిపోయిన తర్వాత పెళ్లి కోసం 18 సంవత్సరాల వరకు ఆగాలి. ఎలాగూ మనం ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ మీడియట్‌ వరకూ అమ్మఒడి పథకం ఇస్తున్నాం. దీంతో పిల్లలను పదోతరగతి తర్వాత ఇంటర్‌మీడియట్‌ వరకూ చదివిస్తారు. దీనికి అమ్మఒడి పథకం ప్రోత్సాహకంగా నిలుస్తుంది.
  2. ఇంటర్‌ తర్వాత జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుబాటులోకి వస్తుంది కాబట్టి.. పిల్లల తల్లిదండ్రులకు భారం ఉండదు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాకుండా జగనన్న వసతి దీవెన కింద డిగ్రీ చదువుతున్న ప్రతి బాబుకు, పాపకు రూ.20వేల వరకు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. కాబట్టి డిగ్రీ కూడా పూర్తి చేస్తారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదివే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతాయి. దానికి ప్రోత్సాహకంగా నిలబడేందుకు జగనన్న అమ్మఒడి ఒక బెంచ్‌ మార్కు కాగా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన రెండో బెంచ్‌ మార్కు అవుతుంది. వైఎస్సార్‌ షాదీతోఫా, కళ్యాణమస్తు మూడో బెంచ్‌ మార్క్‌ అవుతుంది. 
  3. షాదీతోఫా కళ్యాణమస్తు పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న 12,132 మంది జంటల్లో 5,929 జంటలు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన తీసుకుంటున్నాయి. అంటే దాదాపు ఆరువేల జంటలు డిగ్రీ పూర్తి చేయడమో, డిగ్రీ చదవుతుండటమో జరుగుతుంది. వీటన్నింటి వల్ల ప్రతి పేద కుటుంబం నుంచి చదువుల విప్లవం రావాలని, పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను.
  4. గత ప్రభుత్వం 17,709 మంది జంటలకు డబ్బులు ఎగరగొట్టిన పరిస్థితులు చూశాం. దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టింది. ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టారు.
  5. మన ప్రభుత్వం మాత్రం మనసుపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు మంచి జరగాలని మనసా, వాచా, కర్మణా అడుగులు వేశాం. గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40వేలు ఇస్తే… దాన్ని రూ. 1లక్ష చేశాం. ఎస్టీలకు రూ.50 గతంలో ఇస్తే… దాన్ని కూడా రూ.1లక్ష చేశాం. బీసీలకు రూ.35వేలు గతంలో ఇస్తే.. ఇప్పుడు రూ.50వేలు చేశాం. మైనార్టీలకు రూ.50వేలు గతంలో ఇస్తే ఇప్పుడు రూ.1లక్ష చేశాం. విభిన్న ప్రతిభావంతులకు గతంలో రూ.1 లక్ష ఇస్తే.. వారికి కూడా మంచి జరగాలని దానిని రూ.1.50 లక్షలు చేశాం.
  6. వీటన్నింటిని చేస్తూ ఎందుకు చదవులుకు ముడిపెడుతున్నామంటే.. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అనే దివ్యాస్త్రం మీ అందరికీ రావాలన్న తపన తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. వీటి ద్వారా మీ కుటుంబాలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ప్రోత్సహకాన్ని అందుకుంటున్న ప్రతి జంటకు హేపీ మేరీడ్‌ లైఫ్‌. వారి తల్లిదండ్రులకు బెస్ట్‌ విషెస్‌.
Previous articleDiet for High Blood pressure: హైబీపీ తగ్గాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవే
Next articleకస్టడీ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకున్న నాగచైతన్య