Hair fall remedies for summer: వేసవిలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు రాలే సమస్యను చాలావరకూ అధిగమించవచ్చు. అయితే చాలామంది ఈ సమస్యను తగ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే ఇతరత్రా రసాయనాలపై ఆధారపడుతుంటారు. కానీ అవేమీ జుట్టు రాలే సమస్యను ఆపలేవు. కనుక సహజంగా తయారు చేసుకునే చిట్కాలతోనే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
జుట్టు రాలే సమస్యకు కారణాలు
- కాలుష్యం
- జన్యుపరమైన కారణం
- ఒత్తిడి
- పోషకాహార లోపం
- హార్మోన్ల మార్పులు
- థైరాయిడ్ సమస్య
- క్యాన్సర్, ఆర్థరైటిస్, గుండె సమస్యలు వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు
జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు ఇంటి చిట్కాలు
- ఎగ్ హెయిర్ మాస్క్ః ఒక టీస్పూన్ తేనే, ఆలివ్ నూనెతో ఒక గుడ్డును కలపి పేస్ట్‌గా తయారు చేయాలి. ఆ పేస్ట్‌ను బ్రష్‌తో తల మొత్తానికి అప్లై చేయాలి. 25 నిమిషాల తరువాత తేలికపాటి షాంపూతో చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు.
- కొబ్బరి నూనెః 2-3 టీ స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసి తలకు పట్టించాలి. మాడును సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ పగటి పూట కొబ్బరి నూనె తలకు పట్టిస్తే, 30 నిమిషాలు ఉంచాలి. తరువాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
- ఉసిరి, నిమ్మరసంః ఒక టీస్పూన్ ఉసిరి పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దానిని తలకు పట్టించాలి. 40 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.
- మెంతులుః రెండు టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని గ్రైండ్ చేసుకొని, ఆ పేస్ట్‌ను తలకు పట్టించాలి. గంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి.
- గ్రీన్ టీః ఒక కప్పు వేడి నీటిలో 1-2 గ్రీన్ టీ బ్యాగ్‌లను నానబెట్టాలి. ఐదు నిమిషాలు ఆ మిశ్రమం చల్లారిన తరువాత జుట్టు మొత్తానికి అప్లై చేయండి. శిరోజాల మూలాలను సున్నితంగా మసాజ్ చేయండి. గంట తరువాత నీటితో శుభ్రం చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
- కలబందః కొద్దిపాటి కలబందను తీసుకొని, అందులోని జెల్ వేరు చేయండి. నేరుగా తలపై మసాజ్ చేయండి. గంట తరవాత తలను కడిగేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయాలి.
- ఉల్లిపాయః కొన్ని ఉల్లిపాయలను తీసుకొని వాటిని మిక్సీ చేయాలి. దాన్ని రసాన్ని వేరు చేయాలి. ఆ రసాన్ని చేతి వేళ్లతో గాని, కాటన్ బాల్‌తో గానీ తలకు అప్లై చేయాలి. అరగంట తరువాత తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి.
- పోషకాహారంః ప్రతి రోజు ఆకుపచ్చ కూరలు, క్యారెట్లు, గుడ్లు, చికెన్, డ్రైఫ్రూట్స్, పప్పు, పెరుగు, తృణధాన్యాలు, సి విటమిన్, ఇ విటమిన్ అధికంగా ఉండే పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకులకు పోషణ లభిస్తుంది. తద్వారా జుట్టు రాలే సమస్యను నియంత్రించవచ్చు.
- యోగ సాధనః యోగా సాధన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానం, యోగా ఉపయోగపడుతుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్