క్యారెట్ కూర అంటే చాలామంది ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు క్యారెట్ కూర అంటే ఆమడ దూరంలో ఉంటారు. క్యారెట్ మంచి పోషకాహారం. పిల్లలకు క్రమం తప్పకుండా ఏదో ఒక రూపంలో క్యారెట్ తినిపించడం మంచిది. ముఖ్యంగా దీనిలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపుకు మేలు చేస్తుంది. అయితే క్యారెట్‌ను మామూలుగా వండితే తినాలనే ఆసక్తి ఉండదు. కనుక క్యారెట్లో పెసరపప్పు, కొబ్బరి జోడించి వండితే ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు లంచ్ బాక్స్‌లో పెడితే ఇష్టంగా తినేస్తారు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
క్యారెట్ పెసర పప్పు ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు
- క్యారెట్ – అర కిలో
2. కొబ్బరికాయ – కాయలో సగం
3. పెసర పప్పు – ఒక కప్పు
4. పచ్చిమిర్చి – నాలుగు
5. నూనె – రెండు టేబుల్ స్పూన్లు
6. ఆవాలు – ఒక టీ స్పూన్
7. జీలకర్ర – ఒక టీ స్పూన్
8. కరివేపాకు – కొద్దిగా
9. అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్సూన్
10. పసుసు – చిటికెడు
11. ఉప్పు – తగినంత
12. కొత్తిమీర – కొద్దిగా
క్యారెట్ పెసర పప్పు ఫ్రై రెసిపీ తయారీ విధానం
స్టెప్ 1: ముందుగా క్యారెట్‌పై ఉన్న తొక్కను తొలగించి వాటిని శుభ్రంగా కడిగాలి.
స్టెప్ 2: తర్వాత వాటిని వీలైనంత చిన్న ముక్కలుగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెసర పప్పును ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే కొబ్బరి కాయను తురిమి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి అవి కొంచెం మరిగాక క్యారెట్ ముక్కలు, పెసర పప్పు వేసుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి.
స్టెప్ 4: ఇప్పుడు మరలా ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకుని కొంచెం వెడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా కలుపుకోవాలి.
స్టెప్ 5: తర్వాత పచ్చిమిర్చిని కొద్దిగా పేస్ట్ చేసుకుని అందులో వేసుకోవాలి.
స్టెప్ 6: అది కొంచెం వేగాక ముందుగా ఉడకబెట్టిన క్యారెట్ పెసర పప్పును వేసుకోవాలి.
స్టెప్ 7: ఆపై కొబ్బరి తురుమును కూడా వేసి వేయించుకోవాలి. అందులో సరిపడా ఉప్పును కూడా వేసి కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మీడియం మంటపై మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీరను వేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
అంతే క్యారెట్ రెసిసీ రెడీ. దీనిని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తినేయచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్