Sapota Health benefits: వేసవిలో సపోటా పండ్లతో అద్భుతమైన ప్రయోజనాలు.. తప్పక తినాల్సిందే

round brown fruit
సపోటా ఆరోగ్య ప్రయోజనాలు ఇవే Photo by Utsman Media on Unsplash

Sapota Health benefits: వేసవిలో తినాల్సిన పండ్లలో సపోటా ఒకటి. ఈ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వేసవి సీజన్ మొదలవగానే మామిడి, తాటి ముంజలు ప్రత్యక్షమవడంతో పాటు సపోటా కూడా దర్శనమిస్తుంది. సపోటా తియ్యదనంతో పాటు ఎన్నో పోషకాలను అందిస్తుంది. సపోటా చెట్టుకు లేటెక్స్ జిగురు పరిమాణం అధికంగా ఉంటుంది. ఈ  కాయలు చెట్టు నుంచి కోసిన తర్వాతే పండుతాయి. 

సపోటా ప్రయోజనాలు

  1. సపోటాలో అధిక కేలరీలు ఉంటాయి. దీనిని మిల్క్ షేక్స్ తయారీలో వాడతారు. అలాగే సపోటాను జ్యూస్, సలాడ్స్‌లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ ఎ, బి, సి, బి6 పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తి తగినంతగా ఉండేలా చూస్తుంది.
  1. సపోటాలో కాపర్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, నియాసిన్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో అనేక రోగాల బారిన పడకుండా కాపాడతాయి. సపోటాను వేసవిలో తినడం వలన  వాతావరణం నుంచి వచ్చే అధిక వేడికి ఉపశమనాన్ని పొందవచ్చు.
  1. సపోటాలో ఫోలేట్, ఫైబర్, పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజ లవణాలు సంపూర్ణ ఆరోగ్యానికి రక్షణ ఇస్తాయి. దీనిలో ఉండే క్యాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది.
  1. జుట్టుకు కూడా సపోటా మంచి పోషణను, నిగారింపును అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సపోటా శరీరంలో ఉన్న హార్మోన్లను  సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. 
  1. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌పై పోరాడుతాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలు కూడా వీటిలో ఎక్కువగానే ఉంటాయి. విటమిన్-ఏ, విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  1. సపోటాతో రక్తం వృద్ది చెందడంతో పాటు దాతుపుష్ఠిని కలిగించే మరెన్నో ఔషధ గుణాలు  ఉన్నాయి. అంతేకాదు ఇది మలబద్దక సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ పండులో కొన్ని రసాయనాలు పేగు చివర ఉండే పలుచని శ్లేష్మపొరను దెబ్బతినకుండా  కాపాడతాయి.
  1. రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్దులు కూడా తరచూ సపోటా పండ్లను తినడం చాలా మంచిది.  దీనివల్ల  శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుంచి బయటపడతారు. ఇందులో ఉండే పోషకాలు గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.
  1. సపోటాలోని పోషకాలు శరీరంలోని మలినాలను తొలగించేందుకు దోహడపడుతాయి. కొల్లాజెన్‌ ఉత్పత్తికి, చర్మంపై ఏర్పడే ముడతలను నివారిస్తాయి. 
  1. సపోటాలో ఖనిజలవణాలు విరివిగా ఉండడంతో అది రక్తపోటును తగ్గించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. సపోటాలోని మెగ్నిషియం రక్తనాళాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది. పొటాషియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  1. సపోటాలో ఉండే ప్రక్టోజ్ శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా వీటిలో తేనేను వేసుకుని ఉదయం పూట తినడం వల్ల పురుషులలో టెస్టోస్టిరాన్ హర్మోన్ పెరుగుతుంది. సపోట బెరడు ఉడకబెట్టి కషాయం చేసి తాగితే జ్వరం తగ్గుతుంది. అధిక క్యాలరీలు ఉన్న పండ్లలో సపోటా బెస్ట్. సపోటాలో బలహీనతను దూరం చేసే అనేక పోషకాలు నిండి ఉన్నాయి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleBreakfast Food: ఉదయం అల్పాహారంలో వీటిని చేర్చితే ఎంతో ఉత్సాహంగా ఉంటారు
Next articleక్యారెట్ పెస‌ర‌ పప్పు ఫ్రై రెసిపీ ఇలా చేయండి.. పిల్ల‌లు ఇష్టంగా తినేస్తారు