Mamidikaya Pulihora: మామిడి కాయ పులిహోర ఎలా చేయాలి? ఇక్కడ తెలుసుకోండి

Pulihora on White Ceramic Bowl
మామిడి కాయ పులిహోర ఎలా తయారో చేయాలో ఇక్కడ తెలుసుకోండి Photo by Shiva Kumar on Pexels

Mamidikaya Pulihora: మామిడి కాయ‌తో పులిహోర చేశారా? వేసవిలో లభించే మామిడి కాయ తురుముతో చేసుకునే పులిహోర చాలా రుచిగా ఉంటుంది. ఈ పులిహోర తయారీ విధానం కూడా సులభం. పుల్ల పుల్ల‌గా ఎంతో రుచిగా తినేయ‌చ్చు. పిల్ల‌లు కూడా ఇష్టంగా తింటారు. ప‌చ్చి మామిడికాయ‌లు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ వేసవిలో ఎదుర‌య్యే డీహైడ్రేష‌న్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. అంతేకాదు ఇందులో ఉండే విట‌మిన్స్ హార్మోన్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి.

సాధార‌ణంగా అంద‌రూ మామిడికాయ పప్పు, మామిడికాయ ప‌చ్చడి ఇలా చేసుకుంటారే కానీ మామిడికాయ పులిహోర చేయ‌డం చాలా త‌క్కువ‌. ఇలా వేసవి సీజ‌న్‌లో దొరికినప్పుడైనా మామిడికాయతో పులిహోర‌ను చేసుకుంటే అటు ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఇటు రుచిని ఆస్వాదించొచ్చు. మరి ఇంకెందుకు ఆల‌స్యం ఈ మామిడి పులిహోరను మీరూ ట్రై చేసేయండి. మీ కుటుంబ సభ్యులకు ఈ పులిహోర తప్పక నచ్చుతుంది. ఎలా త‌యారు చేయాలో ఇక్క‌డ చూద్దాం.

మామిడి కాయ పులిహోర‌కు కావలసిన పదార్థాలు:

  1. ప‌చ్చి మామిడికాయ‌లు – రెండు (మీడియం సైజు)
  2. వండిన అన్నం – రెండు క‌ప్పులు
  3. క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు
  4. నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
  5. ఇంగువ – చిటికెడు
  6. ఉప్పు – రుచికి స‌రిప‌డ
  7. ప‌చ్చిమిర్చి – ఏడు లేదా ఎనిమిది
  8. ప‌సుపు – ఒక టేబుల్ స్సూన్
  9. ప‌ల్లీలు – రెండు టేబుల్ స్సూన్లు
  10. ఆవాలు – ఒక టీ స్సూన్
  11. ప‌చ్చి శ‌న‌గ‌పప్పు – ఒక టేబుల్ స్సూన్
  12. మిన‌ప‌ పప్పు – ఒక టేబుల్ స్సూన్
  13. కొత్తిమీర – కొద్దిగా
  14. జీడిప‌ప్పు – ఒక స్పూన్

మామిడికాయ పులిహోర త‌యారీ విధానం:

స్టెప్ 1: ముందుగా మామిడి కాయల‌ను శుభ్రంగా క‌డిగి పైన తొక్క తీసి తురుముగా చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.

స్టెప్ 2: ఇప్పుడు స్టవ్ మీద క‌డాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడెక్కాక అందులో ప‌ల్లీల‌ను, జీడిప‌ప్పును వేసి వేయించాలి.

స్టెప్ 3: ఈ రెండు వేగాక ఒక ప్లేట్‌లో తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి.

స్టెప్ 4: ఇప్పుడు ఆదే క‌డాయిలో ఆవాలు, ప‌చ్చి శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి.

స్టెప్ 5: ఇప్పుడు ఆ పోపులో ముందుగా చేసి ప‌క్క‌న పెట్టుకున్న మామిడి కాయ తురుమును వేసి క‌లుపుకోవాలి.

స్టెప్ 6: త‌ర్వాత ఇందులో ప‌సుపు, రుచికి స‌రిపడా ఉప్పును వేసి బాగా క‌లుపుకోవాలి.

స్టెప్ 7: ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని మామిడి కాయ తురుము కొద్దిగా ప‌చ్చివాస‌న పోయేంత‌వ‌ర‌కూ  ఉడికించుకోవాలి.

స్టెప్ 8: ఒక రెండు నిమిషాలు ఉడికిన త‌ర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఈ మిశ్రమాన్ని వేయాలి.

స్టెప్ 9: అన్నం, మామిడికాయ తురుము బాగా క‌లిసిన త‌ర్వాత ఇందులో వేయించిన ప‌ల్లీల‌ను, జీడిప‌ప్పును వేసుకుని  మ‌ర‌లా క‌లుపుకోవాలి. చివ‌రగా కొద్దిగా కొత్తిమీర‌ను వేసుకుని ప్లేట్‌లో స‌ర్వ్ చేసుకోవాలి.

అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్య‌మైన మామిడికాయ పులిహోర రెడీ.. ఈ పులిహోర రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. శ‌రీరానికి ఎన్నో పోష‌కాల‌ను ఇస్తుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleHomemade Face serums: ముఖాన్ని మెరిపించే హోం మేడ్ సీర‌మ్‌లు ఇవే..
Next articleOoty places to visit: స‌మ్మర్‌లో ఊటీ టూర్ ప్లాన్ చేస్తున్నారా! అయితే కచ్చితంగా చూడాల్సిన ప్ర‌దేశాలు ఇవే..