Ooty places to visit: సమ్మర్ టూర్ ట్రిప్స్‌లో ఊటీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్‌గా పిలుస్తారు. ఒకవేళ మీరూ ఈ సమ్మర్‌కి ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ ప్రదేశాలను అస్పలు మిస్ కావద్దు. తమిళనాడులోని ఊటీ (ఉదగమండలం) నీలగిరి కొండలలో ఒక సుందరమైన హిల్ స్టేషన్‌గా పేరుగాంచింది. ఇక్కడ ఆందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చిక బయళ్లు, తేయాకు తోటలు, దట్టమైన ఆకుపచ్చని లోయలు, సుందరమైన ప్రకృతి రమణీయత పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. ఊటీలో పర్యాటకులకు బోటింగ్ మరియు ట్రెక్కింగ్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఊటీలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలలో ప్రధానమైనవి ఇక్కడ చూడొచ్చు.
1. ఊటీ సరస్సు:
ఊటీ సరస్సు నీలగిరి జిల్లాలో తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం. 1824లో జాన్ సుల్లివన్ నిర్మించిన ఈ మానవ నిర్మిత సరస్సు 65 ఎకరాల్లో విస్తరించి ఉంది. బోట్ హౌస్ ప్రసిద్ధి చెందింది. దాని చుట్టూ యూకలిప్టస్ చెట్లు, నీలగిరి శ్రేణులు, నిర్మలమైన ప్రశాంతమైన సరస్సులో బోటింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. పర్యాటకులు తెడ్డు పడవలు, మోటర్ బోట్లు లేదా రోయింగ్ బోట్‌లను అద్దెకు తీసుకోవచ్చు. పిల్లలు మినీ రైలులో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. పార్కుల్లో ఆటలాడొచ్చు. ఇందులో హాంటెడ్ హౌస్, అద్దాల ఇల్లు కూడా చూడొచ్చు. ఈ సరస్సులో పెద్దలు పిల్లలు ఆనంద సమయాలను గడపవచ్చు.
2. బొటానికల్ గార్డెన్స్:
ఊటీలో చూడవలసిన ప్రదేశాలలో మిస్ చేయకూడనిది ప్రభుత్వ బొటానికల్ గార్డెన్స్. దీని విస్తీర్ణం 22 హెక్టార్లు. ఇక్కడ వివిధ రకాల దేశవిదేశీ రకాలకు చెందిన మొక్కలు, వాటి పువ్వులకు నిలయం. ఇవి పర్యాటకులను మంత్రమగ్దులను చేస్తాయి. ఈ గార్డెన్లో 127 రకాల ఫెర్న్‌లు ఉంటాయి. ఇక్కడి పచ్చిక బయళ్ళు, కాగితపు బెరడు చెట్టు, కార్క్ ట్రీ, మంకీ పజిల్ ట్రీ పురాతన శిలాజ చెట్టు ఈ గార్డెన్‌లో చూడదగినవి. అలాగే పురాతన కాలం నాటి ఫాసిల్ ట్రీ ట్రంక్‌ను ఖచ్చితంగా చూడాలి.
3. దొడ్డబెట్ట శిఖరం:
ఊటీలో చూడదగిన మరొక పర్యాటక ప్రదేశం దొడ్డబెట్ట. ఇది నీలగిరి జిల్లాలోని ఊటీ-కోటగిరి రహదారిలో ఉన్న ఒక పర్వత శిఖరం. పెద్ద పర్వతం’ అని దీని అర్ధం. దొడ్డబెట్ట అనేది నీలగిరి శ్రేణిలో ఎత్తైన ప్రదేశం. ఊటీలో చూడదగిన ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. దీని ఎత్తు 2,623 మీటర్లు. దొడ్డబెట్ట దక్షిణ భారతదేశంలోని ఎత్తైన శిఖరాలలో ఒకటి. దాని చుట్టూ ఎక్కువగా అడవులు ఉంటాయి. అంతేకాదు ఈ ప్రదేశం ట్రెక్కింగ్‌కు అద్భుతంగా ఉంటుంది. ఎత్తైన రోడోడెండ్రాన్ చెట్లు, పుష్పించే సబ్-ఆల్పైన్ పొదలు, మూలికలు ఈ శిఖరం దగ్గర కనిపిస్తాయి. ఈ లోయ ఎత్తు నుంచి చూస్తే పర్వత శ్రేణలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. దొడ్డబెట్ట లోయ, కోయంబత్తూర్ మైదానాలు, మైసూర్ ఎత్తైన ప్రాంతాలను ఇక్కడి నుంచి చూడొచ్చు. చుట్టూ ఆకట్టుకునే లోయను చూసేందుకు రెండు టెలిస్కోప్‌లతో శిఖరం పైభాగంలో టెలిస్కోప్ హౌస్ ఉంది.
4. ఎమరాల్డ్ లేక్:
ఊటీ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలగిరి మధ్య నిశ్శబ్ద లోయలో ఉన్న ఎమరాల్డ్ లేక్ ఊటీలో సందర్శించడానికి ఒక అందమైన ప్రదేశం. చుట్టూ తేయాకు తోటలు, పచ్చిక భూములతో ఈ ప్రాంతం అతి సుందరంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో రకాల ప్రకృతి పక్షుల అందాలు కనువిందు చేస్తాయి. చుట్టూ ఉన్న అడవులు, నీలి సరస్సు మంత్రముగ్దులను చేస్తాయి. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా బాగుంటుంది.
5. రోజ్ గార్డెన్:
ఊటీలో ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో గవర్నమెంట్ రోజ్ గార్డెన్ చూడదగ్గది. ఈ ఉద్యానవనం ఐదు టెర్రస్ ప్రాంతాలుగా విభజితమై ఉంది. 10 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. 20,000 రకాల గులాబీలను కలిగి ఉంది. ఇందులో హైబ్రిడ్ గులాబీలు, రాంబ్లర్‌లు, ఆకుపచ్చ గులాబీలు, నల్ల గులాబీలు, పాపగేనో వంటి వాటిని చూడవచ్చు. మార్చి నుండి జూన్ వరకు పూలు వికసిస్తాయి. ఇక్కడ పర్యాటకులు గంటల తరబడి సమయాన్ని గడపచ్చు.
6. టీ మ్యూజియం:
ఊటీ పట్టణం చుట్టూ టీ ఎస్టేట్‌లు చూడదగినవి. అలాగే టీ మ్యూజియం, టీ ఫ్యాక్టరీ తప్పక చూడవలసిన ప్రదేశాలు. దొడ్డబెట్ట శిఖరం సమీపంలో టీ ఎస్టేట్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అక్కడి ఫ్యాక్టరీలో మొత్తం టీ ఉత్పత్తి ప్రక్రియను చూడవచ్చు. పచ్చని నీలగిరి ఒడిలో ఒక ఎకరం విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ టీ మ్యూజియం తప్పక చూడాలి. టీ ఆకులను ఎండబెట్టడం నుండి ప్యాకేజింగ్ వరకు ఇక్కడ చూపిస్తారు.
7. పైకారా జలపాతాలు:
ఊటీలోని సందర్శనీయ స్థలాలలో పైకారా జలపాతాలు తప్పకుండా చూడాల్సిందే. ప్రకృతి ప్రేమికులకు, సాహస ప్రియులకు ఇవి సరైన ప్రదేశాలు. ఊటీలోని సుందరమైన జలపాతాలు, ట్రెక్కింగ్ కుటుంబాలకు ఎంతో వినోదాన్ని కలిగించేవిగా ఆహ్లాదాన్ని అందించేవిగా ఉంటాయి. కేథరీన్ జలపాతం దాని మనోహరమైన అందానికి ప్రసిద్ధి చెందింది. 250 మీటర్ల ఎత్తు నుండి క్రిందికి దిగే అద్భుతమైన క్యాస్కేడింగ్ నీరు చుట్టూ పచ్చని, దట్టమైన అడవి పర్యాటకుల మనసును ఆకట్టుకుంటాయి. ఊటీ ప్రధాన పట్టణం నుండి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్హట్టి జలపాతం బెల్లికలో ఉంది. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ జలపాతాన్ని పక్షి అని పిలుస్తారు. 61 మీటర్ల ఎత్తు నుండి ప్రవహించే ఈ జలపాతం రెండు వేర్వేరు విభాగాలలో ఉద్భవించి, రాళ్లపై ప్రవహించే ముందు బేస్ వద్ద కలిసిపోతుంది.
8. మరియమ్మన్ ఆలయం:
ఊటీలోని మరియమ్మన్ ఆలయం ఒక అద్భుతమైన దేవాలయం. ఆలయంలోని అందమైన, ఐదు అంచెల గోపురం ఆకర్షణయంగా నిలుస్తుంది. కాళీ దేవి రూపంగా పరిగణించబడే మారియమ్మన్ దేవిని మహామాయి లేదా శీతల గౌరీ అని కూడా పిలుస్తారు. వర్షపు దేవతగా పరిగణిస్తారు. ఈ ఆలయంలో మరియమ్మన్ సోదరి కాళియమ్మన్‌ను కూడా పూజిస్తారు. ఈ దేవతలు రోగాలను నయం చేస్తారని అక్కడి ప్రజలు నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో, ఆలయంలో దేవతలను గౌరవించే ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ భక్తులు కాలుతున్న బొగ్గుపై చెప్పులు లేకుండా నడుస్తారు. ఈ ఆలయం నవగ్రహాల వలె విశిష్టమైనది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్