Potato Pakodi Recipe: అందరూ మెచ్చే ఆలూ పకోడి రెసిపీ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసే పకోడీలతో బోర్ కొడుతుందనుకున్నప్పుడు ఇలా బంగాళదుంపలను పకోడీలుగా మార్చేసుకుంటే సరి. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఆస్వాదిస్తూ తినేయడమే. సాధారణంగా బంగాళదుంప ఇష్టపడని వారుండరు. కొంతమదికి ఎన్ని కూరలు చేసినా బంగాళదుంప కూర లేకపోతే మాత్రం భోజనం పూర్తికాదు అన్నట్టు అనిపిస్తుంది. పైగా బంగాళదుంప దేనికైనా ఈజీగా సెట్ అవుతుంది. అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, పరోటా, ఇలా ఏది తినాలన్నా వాటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందుకే ఈ బంగాళదుంపను చిన్నా పెద్దా అందరూ ఇష్టంగా తింటారు. మరి సాయంత్రం పూట స్నాక్స్ గా కూడా ఇవి ఉపయోగపడతాయి. ఒకసారి బంగాళదుంపలతో పకోడీ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఇది చాలా బాగా నచ్చుతుంది. మరింకెందుకు ఆలస్యం.. క్రిస్పీగా ఉండే ఈ బంగాళదుంప పకోడి రెసిపీని ఎలా చేయాలో చూసేయండి.
బంగాళాదుంప పకోడికి కావలసిన పదార్థాలు:
- బంగాళా దుంపలు – రెండు
- ఉల్లిపాయలు – రెండు (పెద్దసైజు)
- పచ్చిమిర్చి – ఐదు
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- జీలకర్ర – ఒక స్పూన్
- శనగపిండి – రెండు కప్పులు
- కార్న్‌ఫ్లోర్ – ఒక స్పూన్
- కారం – ఒక స్పూను
- గరం మసాలా – ఒక స్పూను
- ఉప్పు – రుచికి సరిపడా
- నూనె – ఢీ ఫ్రై కి సరిపడా
- అల్లం ముక్క – చిన్నది
ఆలూ పకోడి రెసిపీ తయారీ విధానం:
స్టెప్ 1: ముందుగా బంగాళదుంపలను తీసుకుని పై తొక్క తీసి శుభ్రంగా కడిగి తురుముకోవాలి.
స్టెప్ 2: ఆ బంగాళ దుంపల తురుమును రెండు మూడు సార్లు నీటిలో కడిగి నీటి చుక్క లేకుండా పిండుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోనే బంగాళదుంప తురుము, ఉల్లిపాయలు, ఉప్పు, గరం మసాలా, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి.
స్టెప్ 4: తర్వాత రెండు స్సూన్ల శనగపిండిని జోడించి కలుపుకోవాలి.
స్టెప్ 5: అందులో కొద్దిగా కార్న్‌ఫ్లోర్, కొత్తిమీర వేసుకుని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి.
స్టెప్ 6: ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేయాలి.
స్టెప్ 7: నూనె వేడెక్కాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా తీసుకుని పకోడిల్లా వేసుకోవాలి.
స్టెప్ 8: అన్ని వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి.
స్టెప్ 9: ఆ తరువాత వాటిని తీసి టిష్యూ పేపర్ల మీద వేయాలి. వాటికి అంటుకున్న నూనెను టిష్యూ పేపర్ పీల్చేస్తుంది.
ఈ ఆలూ పకోడీలను టమాటా చట్నీతో లేదా కెచప్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం పూట టైంపాస్‌గా తినేయచ్చు. పిల్లలు కూడా స్నాక్‌ను ఇష్టంగా తింటారు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్