top web series to watch: వెబ్ సిరీస్.. మన ఇండియన్స్ ఎంటర్టైన్మెంట్ లిస్ట్‌లో కొత్తగా వచ్చి చేరిన పదమిది. రెండు, మూడు దశాబ్దాలుగా వెస్టర్న్ కంట్రీస్‌లో ఈ వెబ్ సిరీస్‌లు పాపులరైనా.. మనకు మాత్రం కొన్నేళ్ల ముందు నుంచే తెలుసు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ 5 వంటివి మన తలుపు తట్టిన తర్వాత వెబ్ సిరీస్‌లు మన జీవితంలో ఓ భాగమయ్యాయి. ఇవి కూడా టీవీల్లో వచ్చే సీరియల్స్లాంటివే. కాకపోతే వెబ్‌లో వస్తాయి కాబట్టి వీటికి వెబ్ సిరీస్ అని పేరు. ఒక్కో సీజన్లో కొన్ని ఎపిసోడ్స్‌తో ఈ వెబ్ సిరీస్ వస్తుంటాయి. కొంతకాలంగా హిందీలోనూ వెబ్ సిరీస్‌లు వస్తున్నా.. ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌ల ముందు ఇవి దిగదుడుపే.
ఒక్కో వెబ్ సిరీస్.. హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోదు. నెట్‌ఫ్లిక్స్‌లాంటి సంస్థలు భారీ బడ్జెట్‌తో వీటిని రూపొందిస్తున్నాయి. 1990ల్లో ఈ వెబ్ సిరీస్ మొదలైనా.. 2000వ దశకంలో బాగా పాపులర్ అయ్యాయి. ఓ పదేళ్లుగా మన దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌లో ఇప్పటి వరకు వచ్చిన ఆల్‌టైమ్ బెస్ట్ వెబ్ సిరీస్‌లు ఏవో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మీరు వీటిని చూడకపోతే వెంటనే చూసేయండి.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of thrones web series)
ఇంగ్లిష్‌లో వచ్చిన ఆల్‌టైమ్ బెస్ట్ సిరీస్ (all time best web series) లో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హెచ్‌బీవో చానెల్ ఈ సిరీస్‌ను నిర్మించింది. 2011, ఏప్రిల్ 17న మొదలైన ఈ సిరీస్ 2019 మే 19తో ముగిసింది. మొత్తం 8 సీజన్లలో 73 ఎపిసోడ్ల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. వెస్ట్రోస్, ఎసోస్ అనే రెండు కాల్పనిక ఖండాల్లోని రాజ్యాల మధ్య సింహాసనం కోసం జరిగే పోరాటమే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్. సింహాసనం కోసం రాజవంశీకుల మధ్య పోరు, వాటి నుంచి స్వాతంత్ర్యం పొందడానికి సామంతులు చేసే పోరాటమే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథాంశం. హెచ్‌బీవో గో,
అమెజాన్ ప్రైమ్‌లలో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ చూడొచ్చు. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, కాస్టూమ్స్‌తో ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా, టీవీ ప్రేక్షకులు విశ్వసించే ఐఎండీబీ ఈ వెబ్ సిరీస్‌కు 9.5 రేటింగ్ ఇవ్వడం విశేషం.
ఫ్రెండ్స్ (friends web series)
ఆరుగురు ఫ్రెండ్స్ జీవితాల చుట్టూ తిరిగే కథాంశంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ చాలా పాపులరైంది. 1994 నుంచి 2004 మధ్య పది సీజన్లపాటు యూత్‌ను ఎంతగానో ఆకర్షించిందీ వెబ్ సిరీస్. నిజమైన స్నేహం అంటే ఏంటో చాటి చెప్పేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. న్యూయార్క్ సిటీలోని మాన్‌హటన్‌లో నివసించే ఈ ఆరుగురు స్నేహితుల కుటుంబాల్లోని కష్టాలు, వాళ్ల మధ్య జరిగే ప్రేమాయణాలు, కొట్లాటలు, కన్నీళ్లు, సరదాలన్నింటినీ మేళవించి యువతను ఆకర్షించేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కు ఐఎండీబీ 8.9 రేటింగ్ ఇచ్చింది. ఎప్పుడో 25 ఏళ్ల కిందట మొదలై 15 ఏళ్ల కిందటే ముగిసిన ఈ ఫ్రెండ్స్ వెబ్ సిరీస్‌కు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్, ఐట్యూన్స్లోనూ ఈ సిరీస్ ఎపిసోడ్స్‌ను కొనుగోలు చేయొచ్చు.
బ్రేకింగ్ బ్యాడ్ (breaking bad web series)
క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ సాధారణ కెమెస్ట్రీ టీచర్ ఓ డ్రగ్ స్మగ్లర్‌గా ఎలా మారాడన్న కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 2008 నుంచి 2013 మధ్య ఐదు సీజన్లు, 62 ఎపిసోడ్లపాటు ఈ క్రైమ్ డ్రామా సాగింది. కుటుంబాన్ని పోషించడానికి స్కూల్ టీచర్ ఉద్యోగం చేసే వాల్టర్ వైట్ అనే వ్యక్తి తన మాజీ విద్యార్థి జెస్సీ పింక్మాన్తో కలిసి మేథమ్ఫిటమైన్ అనే డ్రగ్ తయారు చేస్తాడు. ఓ సాదాసీదా స్కూల్ టీచర్ డ్రగ్స్ సామ్రాజ్యంలో రారాజుగా ఎలా మారాడన్న కథాంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఐఎండీబీలో 9.5 రేటింగ్ పొందిన ఈ బ్రేకింగ్ బ్యాడ్ వెబ్ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
13 రీజన్స్ వై (13 reasons why web series)
17 ఏళ్ల ఓ టీనేజర్ ఆత్మహత్య, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవడానికి ఆమె స్నేహితుడు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ 13 రీజన్స్ వై వెబ్ సిరీస్ తెరకెక్కింది. 2007లో ఇదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ సిరీస్‌ను చిత్రీకరించారు. క్లే జెన్సన్ అనే
17 ఏళ్ల యువకుడు, ఆత్మహత్య చేసుకున్న అతని ఫ్రెండ్ హన్నా బేకర్ చుట్టూ కథ తిరుగుతుంది. తనపై జరిగిన లైంగిక దాడి, పుకార్లను తట్టుకోలేక బేకర్ ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే తాను ఆత్మహత్య చేసుకునే కొన్ని వారాల ముందు నుంచి తాను ఎందుకు చనిపోబోతున్నానో చెబుతూ కొన్ని టేప్స్‌ను రికార్డు చేసి పెడుతుంది. తాను చనిపోవడానికి 13 కారణాలు ఉన్నాయని అందులో హన్నా చెబుతుంది. 2017, మార్చి నుంచి ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లలో 26 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ను చూడొచ్చు.
నార్కోస్ (narcos web series)
కొకైన్ తయారీ, అక్రమ రవాణాతో కోట్లు కొల్లగొట్టి బిలియనీర్‌గా మారిపోయిన డ్రగ్ కింగ్‌పిన్ పాబ్లో ఎస్కోబార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. ఈ అమెరికన్ క్రైమ్ డ్రామాను కొలంబియాలో చిత్రీకరించారు. మొత్తం మూడు సీజన్లు, 30 ఎపిసోడ్ల పాటు ఈ వెబ్ సిరీస్ సాగింది. 2015, 2016, 2017లలో మూడు సీజన్లను నెట్‌ఫ్లిక్స్ టెలికాస్ట్ చేసింది. 1970లలో తొలిసారి ఎస్కోబార్ కొకైన్ తయారు చేసినప్పటి నుంచీ ఈ సిరీస్ మొదలవుతుంది. తొలి రెండు సీజన్లు అతని జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించగా.. మూడో సీజన్లో అతని మరణం తర్వాత గిల్బెర్టో రోడ్రిగెజ్ కొకైన్ సామ్రాజ్యాన్ని విస్తరించిన తీరు, వాళ్లకు అడ్డుకట్ట వేయడానికి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వేసిన ఎత్తుగడలతో కథ నడుస్తుంది. ఐఎండీబీ 8.8 రేటింగ్ ఇచ్చిన ఈ నార్కోస్ వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
మరికొన్ని పాపులర్ వెబ్ సిరీస్ (Popular web series)
ఇవే కాకుండా ఆజీ, సిక్స్ ఫీట్ అండర్, షెర్లాక్, ద వైర్, ద బిగ్ బ్యాంగ్ థియరీ, సూట్స్, ద వాకింగ్ డెడ్లాంటి పాపులర్ ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లను కూడా మిస్ కావద్దు. ఇక హిందీలోనూ ఈ మధ్య అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లలో కొన్ని వెబ్ సిరీస్‌లు వచ్చాయి. వాటిలో సేక్రెడ్ గేమ్స్, మీర్జాపూర్, బ్యాంగ్ బాజా
బారాత్, క్రిమినల్ జస్టిస్, ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ, గర్ల్స్ హాస్టల్, ఇమ్మెచ్చూర్, మేడ్ ఇన్ హెవెన్, ఫోర్ మోర్ షాట్స్ లాంటి వెబ్ సిరీస్‌లు బాగా పాపులర్ అయ్యాయి.