ఓటరు నమ్మకాన్ని వమ్ము చేసేలా పార్టీ ఫిరాయింపులు ఉండరాదనేది రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ముఖ్య ఉద్దేశం. ఒక నియోజకవర్గం ఒక ప్రతినిధిని అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ సిద్ధాంతాల ఆధారంగా చట్టసభకు పంపినప్పుడు.. ఆ ప్రతినిధి ఎన్నికైన అనంతరం పార్టీ మారితే ఆ ఓటరుకు నమ్మద్రోహం చేసినందుకు గాను ఆ ప్రతినిధిని సభ్యత్వం నుంచి తొలగించాలన్నది ఈ పదో షెడ్యూలు ఉద్ధేశం.
అయితే ఈ పదో షెడ్యూలు విడిగా సభ్యుడు ఫిరాయిస్తే సభ్యత్వ వేటు పడేందుకు అవకాశం కల్పించినప్పటికీ.. పార్టీలో మూడింట ఒక వంతు చీలిస్తే అనర్హత నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో పార్టీలు క్రమంగా ఈ మూడింట ఒకవంతు ఫిరాయింపుల దిశగా వ్యూహ రచనలు చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో 1990లో గోస్వామి కమిటీ నివేదిక, 1999లో లా కమిషన్ నివేదిక, నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కానిస్టిట్యూషన్(ఎన్సీఆర్డబ్ల్యూసీ) 2002 ఏప్రిల్‌లో ఇచ్చిన నివేదికలు ఈ ఫిరాయింపు వ్యతిరేక నిబంధనల్లో ఉన్న లోపాలను పరిహరించాలని సిఫారసు చేశాయి.
91వ రాజ్యాంగ సవరణ ఇలా..
ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలన్న యోచనలో కేంద్రం రాజ్యాంగ సవరణ (91వ) చట్టం–2003 తెచ్చింది. అయితే ఇక్కడ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లోపాలను సవరించినట్టుగా కనిపించినా.. పార్టీ విలీనం పేరుతో మరోరకమైన ఫిరాయింపుల పర్వానికి అవకాశం కల్పించినట్టయింది. ఒక పార్టీని మరొక పార్టీలో విలీనం చేయడం ద్వారా ఈ మినహాయింపు ఉంటుందని పదో షెడ్యూలులోని నాలుగో పేరాలో పొందుపరిచారు.
మూడింట రెండు వంతుల మంది సభ్యులకు తక్కువ కాకుండా.. తాము మరో పార్టీలో విలీనం అవుతున్నామని చెబితే వారు ఫిరాయింపు వ్యతిరేక చట్టం నుంచి మినహాయింపు పొందుతారు. ఈ నాలుగో పేరాను, మూడో పేరాను తొలగించాలని జస్టిస్ బి.పి.జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ 170వ నివేదిక ద్వారా 1999లోనే సిఫారసు చేసింది. కానీ 91 రాజ్యాంగ సవరణలో గానీ, ఆ తదుపరి గానీ ఈ పేరాలను తొలగించనే లేదు.
ఫిరాయింపులపై నిర్ణయాధికారం ఎవరికి ఉండాలి?
సభ్యుల అనర్హత పిటిషన్లకు సంబంధించి నిర్ణయాధికారం స్పీకర్‌కు వదిలేయరాదని, రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఇవ్వాలని, ఎన్నికల కమిషన్ సలహా మేరకు రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకునేలా ఉండాలని చాలా ఏళ్ల క్రితమే దినేష్ గోస్వామి కమిటీ సిఫారసు చేసింది. లా కమిషన్ 170వ నివేదిక కూడా ఇదే చెప్పింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా 2004లో ఎన్నికల సంస్కరణల ప్రతిపాదనల్లో కూడా దీనిని ప్రస్తావించింది.
‘వివిధ సభాపతుల నిర్ణయాలు.. వివాదాస్పదానికి దారి తీసిన, న్యాయవివాదాల్లో కూరుకుపోయిన సంఘటనలు అన్ని పార్టీలకు తెలిసిందే. అందువల్ల సభ్యుల అనర్హతపై నిర్ణయాధికారం రాష్ట్రపతి, గవర్నర్లకే ఉండాలి. కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకుని రాష్ట్రపతి, గవర్నర్ సదరు చర్యలు చేపట్టే అవకాశం ఉండాలి..’ అని పేర్కొంది.
ఎన్సీఆర్డబ్ల్యూసీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనను ఏకీభవించింది. ‘కొందరు సభాపతులు పదో షెడ్యూలులోని నిబంధనలను పట్టించుకోకుండా పక్షపాత వైఖరులను అవలంబిస్తున్నారు..’ అని కూడా ఎన్సీఆర్డబ్యూసీ వ్యాఖ్యానించింది. ఈ కారణంగానే ఎన్నికల సంఘం ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నట్టు తెలిపింది. జగ్జీత్సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో స్పీకర్ పదవి హుందాతనాన్ని చెబుతూనే ఇటీవలి కాలంలోని సంఘటనలు నిష్పాక్షిత అంశంలో ప్రశ్నలు తలెత్తేలా చేశాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఫిరాయింపుల పిటిషన్లపై లా కమిషన్ సిఫారసులకు మోక్షం ఏది?
ఫిరాయింపుల పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఉద్దేశపూర్వక జాప్యం జరుగుతున్నందున ఈ నిర్ణయాధికారాన్ని పార్లమెంటు సభ్యుల విషయంలో అయితే రాష్ట్రపతికి, శాసన సభల విషయంలో అయితే గవర్నర్‌కు అప్పగించాలని భారత లా కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా నేతృత్వంలోని 20వ లా కమిషన్ ‘ఎన్నికల సంస్కరణలు’ పేరుతో 255వ నివేదికను గత ఏడాది కేంద్ర న్యాయశాఖకు సమర్పించింది.
ఎన్నికల్లో మరింత పారదర్శకత, ప్రజల విశ్వాసాన్ని నిలపడం వంటి అంశాలపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. ఇటీవలి కాలంలో అన్ని రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు చెందిన చట్టసభల ప్రతినిధులు ఒక పార్టీ ద్వారా గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తున్న సంఘటనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో లా కమిషన్ చేసిన సిఫారసుల అమలు తక్షణావసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత రాజ్యాంగ రచన సమయంలో దేశంలో రాజకీయ పార్టీల ఉనికి పెద్దగా లేనందున ఈ అంశాలను పెద్దగా ప్రస్తావించలేదని, క్రమంగా సమాఖ్య వ్యవస్థలో బహుళ పార్టీల వ్యవస్థ నెలకొందని, తద్వారా భారీ సంఖ్యలో పార్టీలు పుట్టుకొచ్చాయని కమిషన్ తన నివేదికలో వివరించింది. ఈ నివేదికలో పొందుపరిచిన వివరాల ప్రకారం.. 1967 మార్చి నుంచి 1968 ఫిబ్రవరి మధ్య కాలంలోని దాదాపు 438 ఫిరాయింపులు చోటు చేసుకున్నాయి.
ఈ ఫిరాయింపుల కారణంగా దేశంలో రాజకీయ అవినీతి, ప్రభుత్వాల్లో అస్థిరత పెరిగింది. తరచూ ఫిరాయింపులు చోటుచేసుకోవడంతో పార్టీ వ్యవస్థ ఒక పరిహాసంగా మారింది. తరచుగా ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో ఖజానాపై భారం పడింది. పార్టీల్లో అంతర్గత విభేధాలు, చీలికలు పేలికలుగా మారడం, వర్గపోరు తదితర కోణాలను ఈ ఫిరాయింపులు ఎత్తిచూపాయి.
1967–1969 మధ్య కాలంలో జరిగిన ఫిరాయింపులు తగిన ఫిరాయింపుల వ్యతిరేక చట్ట రూపకల్పన ఆవశ్యకతను చూపాయి. ఈ నేపథ్యంలో అప్పటి హోం మంత్రి వై.బి.చవాన్ నేతృత్వంలోని కమిటీ ఈ ఫిరాయింపుల అంశాన్ని అధ్యయనం చేసి 1969 జనవరిలో ఒక నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగ సవరణ(32వ) బిల్లు–1973, రాజ్యాంగ సవరణ(48వ) బిల్లు–1979లను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
కానీ ఇవేవీ చట్టరూపు దాల్చలేదు. చివరగా 1984 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజ్యాంగ సవరణ(52వ) బిల్లును 1985 జనవరిలో కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును సవరించడం ద్వారా ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలని ఈ బిల్లు ఉద్దేశం. ఈ చట్టం రాజ్యాంగంలోని 101, 102, 190, 191 అధికరణలను కూడా సవరించింది. సభ్యత్వ అనర్హతపై ఈ అధికరణలు నిర్వచిస్తున్నాయి.
ఫిరాయింపులపై లా కమిషన్ సిఫారసులు ఇవీ..
ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా నేతృత్వంలోని 20వ లా కమిషన్ ‘ఎన్నికల సంస్కరణలు’ పేరుతో 2015లో సమర్పించిన 255వ నివేదిక పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక నిబంధనలకు సంబంధించి రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో సవరణలు చేయాలని సిఫారసులు చేసింది.
ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులపై అనర్హత వేటు వేసే నిర్ణయాధికారాన్ని పార్లమెంటు సభ్యుల విషయంలో అయితే రాష్ట్రపతికి, రాష్ట్రాల చట్టసభల సభ్యుల విషయంలో అయితే గవర్నర్‌కు కట్టబెట్టాలని సిఫారసు చేసింది. అనర్హత నిర్ణయం తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ సలహాను రాష్ట్రపతి, గవర్నర్ తీసుకునే వీలు కల్పిస్తూ ఈ సవరణ ఉండాలని అభిప్రాయపడింది. తద్వారా స్పీకర్ కార్యాలయ హుందాతనాన్ని కూడా కాపాడవచ్చని అభిప్రాయపడింది. ఈమేరకు పదో షెడ్యూలులోని 6వ పేరాను సవరించాలని పేర్కొంది.
ఎప్పటికి అమలయ్యేను?
ఎన్నికల సంఘం, ఎన్సీఆర్డబ్ల్యూసీ, లా కమిషన్.. ఇలా అన్ని సంస్థలు ఫిరాయింపుల చట్ట సవరణ చేయాలని ప్రతిపాదించినప్పటికీ కేంద్రం ఇంకా ఈవిషయంలో తుది నిర్ణయానికి రాలేదు. దీనిపై ఒక కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర న్యాయమంత్రి సదానందగౌడ ఇటీవల తెలిపారు. కీలకమైన ఎన్నికల సంస్కరణలు అమలుచేసి ఓటరు విశ్వాసాన్ని పెంపొందించడంలో తీసుకునే చర్యలు దశాబ్దాల కొద్దీ ఆలస్యం అవుతుండడం దురదృష్టకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.