వెబ్ సిరీస్ రివ్యూ : బెస్ట్ సెల్లర్
తారాగణం : అర్జన్ బజ్వా, శ్రుతి హాసన్, మిథున్ చక్రవర్తి, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనాలీ కులకర్ణి
దర్శకుడు: ముకుల్ అభ్యంకర్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్లు : 8
బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ రివ్యూ : థ్రిల్లర్ జోనర్లో వచ్చే మూవీ, వెబ్ సిరీస్ ఏదైనా సరే.. నేరగాళ్లు లేదా సూత్రధారులు ఎవరో ముందే తెలిస్తే ఆ కథనం చివరి వరకు నడవాలంటే కనీసం కథలో ట్విస్టులు, డ్రామా సాగాలి. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ ఇందుకు భిన్నంగా సాగుతుంది.
అర్జన్ బజ్వా, శ్రుతి హాసన్, మిథున్ చక్రవర్తి, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనాలీ కులకర్ణి నటించిన ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్
ప్రేక్షకులను మరీ తక్కువగా అంచనా వేసినట్టనిపిస్తుంది.
రవి సుబ్రమణ్యం రాసిన నవల షీ రోట్ ప్రేరణగా ఈ వెబ్ సిరీస్‌ను మలిచారు. ప్రధాన పాత్రధారి అయిన తాహిర్ వజీర్ (అర్జన్ బజ్వా) తాను నవలలు రాయాలని, రచయితగా ఎదగాలని కోరుకుంటాడు. కానీ అడ్డంకులు ఎదుర్కొంటాడు. ఈ సందర్భంలో అభిమానిని అంటూ మీటూ మాథుర్ (శ్రుతి హాసన్) పరిచయం చేసుకుంటుంది. ఈ పరిచయం వల్ల ఆ రచయిత జీవితంలో వచ్చిన మార్పులను ఈ వెబ్ సిరీస్ వివరిస్తుంది.
పదేళ్ల క్రితం తాహిర్ వజీర్ రాసిన రాండ్ సాండ్ సీధీ సన్యాసి నవల సూపర్ హిట్ అవుతుంది. మళ్లీ నవలలు రాయాలంటూ తన పబ్లిషర్ చేసిన కోరిక నెరవేర్చడానికి, రచయితగా ఎదగాలన్న తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎదురు చూస్తున్న తాహిర్‌కు మీటు మాథుర్ పరిచయం కొత్త ఆసక్తి కలిగిస్తుంది. తన సొంత నవల కోసం మీటూ మాథుర్ కథను ఉపయోగించాలని అనుకుంటాడు. ఇది లీకై ఒకవైపు తాహిర్ వజీర్పై సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుండగా.. మరోవైపు మీటూ మాథుర్‌పై దాడి జరుగుతుంది. ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి సీఐడీ అధికారి మిథున్ చక్రవర్తి రంగంలోకి దిగుదాడు. అయినా దాడులు ఆగవు. పైగా వజీర్ భార్య స్నేహితుడు సంజయ్ చనిపోతాడు. అయితే వీటిల్లో ఎలాంటి ట్విస్టులు ఉండవు. మీటూ మాథుర్ నిజంగా అభిమానేనా? తాహిర్‌కు ఎందుకు దగ్గరవ్వాలనుకుంటుంది? తన నేపథ్యం ఏంటి? ఇవన్నీ ఇక్కడ చెప్పేస్తే ఇంక చూడడానికి ఏమీ ఉండదు. సరిగ్గా ఇదే రీతిలో.. వెబ్ సిరీస్ సగంలోకి వచ్చే సరికే.. సూత్రధారులు ఎవరు? తాహిర్ వజీర్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఇక అక్కడి నుంచి కథనంలో ఏ మెలికా లేకపోయే సరికి.. ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. థ్రిల్లర్‌ను ఇంత చెత్తగా ఎలా మలిచారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన పాతాల్ లోక్, తదితర వెబ్ సిరీస్‌లు సూపర్ హిట్‌గా నిలిచాయి. కానీ బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా నిరాశపరిచిందనే చెప్పాలి.
స్క్రీన్ ప్లే లో లోపం..
బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ విఫలమవడానికి కారణం.. స్క్రీన్ ప్లే అనే చెప్పొచ్చు. కథలోని కీలక అంశాలు ముందే తెలిసిపోయేలా స్క్రీన్ ప్లే ఉండడమే అసలు సమస్య. బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ క్లైమాక్స్‌ను మరో నాలుగు ఎపిసోడ్లు ఉండగానే ప్రేక్షకులు ఊహించగలుగుతారు. సూత్రాధారులను, నేరానికి గల మోటివ్ను ప్రేక్షకులు తెలుసుకున్నాక ఇక గ్రిప్ ఏం ఉంటుంది?
ఆకట్టుకున్న మిథున్, శృతి హాసన్
వెబ్ సిరీస్ ఆకట్టుకోకపోయినా సీఐడీ ఏసీపీ అధికారి లోకేష్ ప్రామాణిక్ పాత్రలో మిథున్ చక్రవర్తి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే అప్పుడప్పుడు కొన్ని అనవసర సన్నివేశాలతో కథను సాగదీసినట్టు కనిపిస్తుంది. అలాగే శృతి హాసన్ మీటూ మాథుర్ పాత్రలో ఒదిగిపోయారు. తాహిర్ వజీర్ భార్య మయాంక పాత్రలో గౌహర్ ఖాన్ కూడా మంచి నటన కనబరిచారు. సత్యజీత్ దూబే తన పార్థ్ పాత్రకు న్యాయం చేశాడు. అయితే ప్రారంభంలో అతడో పెద్ద క్రిమినల్‌గా ఊహించుకునేలా చేసిన దర్శకుడు.. చివరికి ఆ పాత్రలో ఎలాంటి పసలేకుండా తేల్చేస్తాడనిపిస్తుంది.
రేటింగ్ 2/5