CBSE or ICSE: సీబీఎస్‌ఈ ఐసీఎస్ఈ రెండింట్లో ఏది బెటర్?

CBSE or ICSE: సీబీఎస్ఈలో చేర్పించాలా? ఐసీఎస్ఈలో చేర్పించాలా? అంటూ తల్లిదండ్రులు వాకబు చేస్తుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మేలన్న ప్రశ్నకు సమాధానం నేరుగా చెప్పడం కంటే.. రెండింటి ప్రయోజనాలు ముందుగా చర్చిద్దాం.

సీబీఎస్ఈ (cbse) అంటే సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే బోర్డు. సెంట్రల్ సిలబస్ అని తరచుగా మనం పిలుచుకునేది. దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ పోటీ పరీక్షలు జేఈఈ, నీట్ తదితర పరీక్షలకు ఈ సిలబస్ అనుసరించే ప్రశ్నపత్రాలు రూపొందిస్తుంటారు. స్టేట్ సిలబస్ కంటే కాస్త విస్తారంగా సిలబస్ ఉంటుంది. స్టేట్ సిలబస్‌తో పోలిస్తే కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేందుకు ప్రాజెక్టులు ఇస్తుంటారు. సీబీఎస్ఈ కేవలం థియరటికల్ నాలెడ్జ్ అందిస్తుందన్న విమర్శ ఉంది.

పేరున్న పాఠశాలల్లో ఎప్పటికప్పుడు తాజా కరిక్యులమ్ అమలు చేస్తారు. ముఖ్యంగా వృత్తి నైపుణ్యాలను అనుసరించి వెంటవెంటనే కొత్త కొత్త పాఠ్య ప్రణాళికలను చేర్చుతారు. ఉదాహరణకు 9వ తరగతి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఈ బోర్డు పరిధిలో అఫిలియేషన్ ఉన్న పాఠశాలలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఉపాధి, ఉద్యోగ రీతా ఎక్కడికైనా బదిలీ అయ్యే పరిస్థితి ఉన్నా సీబీఎస్ఈ బెటర్ ఆప్షన్.

ఐసీఎస్ఈ(ICSE) ని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) అమలు చేస్తోంది. ఇందులో విస్తృత సిలబస్ ఉండడమే కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది. కేవలం మాథమెటిక్స్, సైన్స్ మాత్రమే కాకుండా ఆర్ట్స్, హుమానిటీస్ సబ్జెక్టులపై కూడా ఫోకస్ ఉంటుంది. అన్నింటికీ సమ ప్రాధాన్యత ఉంటుంది. సీబీఎస్ఈ కంటే ఐసీఎస్ఈ విద్యార్థులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్న పేరుంది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం విదేశీ విద్యను ఎంచుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

అయితే ఐసీఎస్ఈ పరిధిలో అఫిలియేషన్ ఉన్న పాఠశాలలు చాలా స్వల్ప సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలో కేవలం 40 పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్‌లో 59 పాఠశాలలకు మాత్రమే అఫిలియేషన్ ఉంది. సీబీఎస్ఈ నుంచి ఐసీఎస్ఈకి మారడం సులువే. కానీ పాఠశాలల సంఖ్య తక్కువగా ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య వరకు ఒక బోర్డు నుంచి మరొక బోర్డుకు మారినా పెద్ద సమస్య ఉండదు.

Previous articleబెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ రివ్యూ : థ్రిల్లర్ పండిందా?
Next articleAkshaya tritiya: అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి? ఎలా జరుపుకోవాలి?