డిజిటల్ నోమాడ్స్ .. ప్రయాణిస్తూ పనిచేస్తారు!

digital nomad
Photo by Humphrey Muleba on Unsplash

డిజిటల్ నోమాడ్ .. వినడానికి కొత్తగా ఉన్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రపంచమంతా ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి ఉన్న ఈ రోజుల్లో ఆఫీసుకు వెళ్లే పని చేయాల్సిన పనిలేదు. చేతిలో ల్యాప్ టాప్, దాంతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్… ఈ రెండు ఉంటే చాలు ప్రపంచమంతా మన ఆఫీసే అయిపోతుంది. ప్రపంచమంతా తిరుగుతూ, నచ్చిన పని ఆన్ లైన్ ద్వారా చేస్తూ.. నోమాడిక్ లైఫ్ గడుపుతున్నారు చాలామంది. వీరినే డిజిటల్ నోమాడ్స్ అని పిలుస్తున్నారు.

బతకాలంటే ఏదో ఒక వర్క్ చేయాలి.  వర్క్ చేయాలంటే రోజూ ఆఫీసుకు వెళ్లాలి. అయితే రోజూ ఆఫీసుకు వెళ్లడం కూడా కొంతకాలానికి బోర్ కొడుతుంది. అలాగని ఎక్కడికైనా బయటకు వెళ్లి రిలాక్స్ అవుదామంటే.. ఆఫీసులో లీవ్ కొన్ని రోజులే ఉంటుంది. ఇదంతా ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారో ఏమో.. ఇప్పుడు చాలామంది రెగ్యులర్ ఆఫీస్ జాబ్ వదిలేసి ప్రయాణాల బాట పడుతున్నారు. ప్రపంచమంతా తిరిగేస్తూ.. రిమోట్ గా ఏదో ఒక పని చేస్తూ గడిపేస్తున్నారు.

నోమాడ్స్ అంటే..

ఒక ప్లేస్‌లో నివసించకుండా ఊరూరా సంచరిస్తూ గడిపేవాళ్లను ‘నోమాడ్స్’ అంటారు.నోమాడిక్ అంటే ‘సంచారం’ లేదా ‘ఊరూరా తిరగడం’ అని అర్థం. డిజిటల్ నోమాడ్స్ అంటే ప్రపంచమంతా సంచరిస్తూ, డిజిటల్ గా పని చేసేవాళ్లన్న మాట.

డిజిటల్ లైఫ్ ఇలా ఉంటుంది

రోజూ ఆఫీసుకెళ్తూ, ఐదంకెల జీతం సంపాదిస్తూ.. లైఫ్ అంతా బాగానే నడుస్తున్నా.. చాలామందికి ఏదో తెలియని వెలితి వేధిస్తుంటుంది. తీరిక సమయం లేక ఒత్తిడి, యాంగ్జైటీ తో బాధ పడుతుంటారు. సమయం దొరికితే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటారు. అయితే డిజిటల్ నోమాడిక్ లైఫ్ స్టైల్ ఇలాంటి ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది.

ఇప్పుడున్న డిజిటల్ లైఫ్‌స్టైల్‌ను, ట్రావెలింగ్‌ను రెండింటినీ కలిపే లైఫ్‌స్టైల్ ఇది. డిజిటల్ నోమాడిక్ లైఫ్‌ ఎంచుకున్న వాళ్లకు ఒక ప్లేస్ అంటూ ఉండదు. ఇండిపెండెంట్‌గా నచ్చిన ప్లేసుల్లో ఉంటుంటారు. కానీ డిజిటల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు. డిజిటల్ నోమాడ్స్ ఎక్కువగా ఏదో ఒక కంపెనీ కింద లేదా ఫ్రీలాన్సర్స్‌గా పని చేస్తారు.

అయితే వీళ్లు రోజూ ఆఫీసుకు వెళ్లరు, అలాగని ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయరు. నెల లేదా రెండు మూడు నెలలకు ఓ ప్లేస్ మారుతూ..  ట్రావెల్ చేస్తూనే వర్క్ చేస్తుంటారు. ఈ ట్రెండ్ వెస్టర్న్ కంట్రీస్‌లో ఎప్పటి నుంచో ఉంది. మనదేశంలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.

డిజిటల్ నోమాడ్స్ ప్రపంచమంతా తిరుగుతూ పని చేస్తారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కోస్టైల్‌ను ఇష్టపడతారు. బీచ్, రిసార్ట్స్, హిల్ స్టేషన్స్‌, జంగిల్ రిసార్ట్స్.. ఇలా ఎవరికి నచ్చిన ప్లేస్ లో వాళ్లు ఎంచుకుంటారు. పని సమయంలో పని చేస్తూ మిగిలిన సమయంలో రిలాక్స్ అవుతుంటారు. చాలా దేశాల్లో డిజిటల్ నోమాడ్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా ఉంటాయి.

డిజిటల్ నోమాడిక్ లైఫ్‌ను ఎక్కువగా 30 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవాళ్లే ఎంచుకుంటారు. యంగ్‌గా ఉన్నప్పుడు ఇలాంటి జీవితాన్ని గడిపి, రిటైర్ అయ్యే టైంకి ఫైనాన్షియల్ స్టేటస్, కాస్ట్ ఆఫ్ లివింగ్, కరెన్సీను బట్టి నచ్చిన దేశంలో సెటిల్ అవుతారు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా వర్క్ చేసేటప్పుడు రిమోట్ దేశాలను, సెటిల్ అయ్యేందుకు డెవలప్డ్ దేశాలను ఎంచుకుంటారు.

డిజిటల్ నోమాడ్ లైఫ్ ఎవరికి సూటవుతుంది..

డిజిటల్ నోమాడ్ ట్రెండ్ మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది. ట్రావెల్ బ్లాగ్స్ నడిపేవాళ్లు, ఇలస్ట్రేటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, కంటెంట్ రైటర్స్, వెబ్ డెవలపర్స్, ఫొటోగ్రాఫర్స్ లాంటి ప్రొఫెషన్స్‌లో ఉన్నవాళ్లు ఇలాంటి లైఫ్‌స్టైల్ గడపడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మనదేశంలో కొంతమంది ఐటీ కపుల్స్‌తో పాటు, సింగిల్‌గా ఉండాలనుకునే కొంతమంది కూడా డిజిటల్ నోమాడ్స్‌గా  లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

డిజిటల్ నోమాడ్స్‌గా మారాలంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉండగలగాలి. అన్నింటికంటే ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్ ఉంటే ఇంకా బెటర్. డిజిటల్ నోమాడ్స్‌లో ఎక్కువగా వెబ్ డెవలపర్స్, యాప్ డెవలపర్స్, డిజైనర్స్, యానిమేటర్స్, కంటెంట్ రైటర్స్, ప్రోగ్రామర్స్ లాంటి వాళ్లు ఉంటారు.

ఈ లైఫ్‌స్టైల్.. ఐటీ, కమ్యూనికేషన్, క్రియేటివ్, టూరిజం, డిజైన్, మీడియా, కన్సల్టింగ్ రంగాల్లో పని చేసేవాళ్లకు అనువుగా ఉంటుంది. డిజిటల్ నోమాడ్‌గా ఉండాలంటే  ఒక ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, సెల్యులార్ కమ్యూనికేషన్‌తో వర్క్ చేయగలిగే వెసులుబాటు ఉంటే చాలు. ఎక్కువ స్కిల్స్ ఉంటే రెండు మూడు జాబ్స్ చేస్తూ ఫ్రీలాన్సర్స్‌లా కూడా పని చేయొచ్చు.

ప్రయోజనాలేంటి?

డిజిటల్ నోమాడ్ గా మారాలని చాలామందికి ఉంటుంది. ట్రావెల్ చేస్తూ.. పని చేయడాన్ని ఎవరు మాత్రం ఇష్టపడరు. అందుకే ఇది చాలామందికి డ్రీం లివింగ్ గా మారిపోయింది.  డిజిటల్ నోమాడ్ గా ఉండడం వల్ల ముందుగా మనకు నచ్చిన చోట నుంచి పనిచేసే వీలుంటుంది. ఆఫీసుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యలు, ఆఫీస్ పాలిటిక్స్, బాస్ తో, కొలీగ్స్ తో ఉండే ఇబ్బందులు ఇక్కడ ఉండవు. మన షెడ్యూల్ అంతా మన చేతిలోనే ఉంటుంది.

డిజిటల్ నోమాడ్స్‌గా ఉండడం వల్ల ఎక్కువ ప్రొడక్టివ్‌గా మారతారు. ప్రతిరోజూ అందమైన ప్రదేశాలలో గడుపుతున్నప్పుడు.. సమయమంతా పని కోసమే వృధా చేయాలనిపించదు. అందుకే కొత్త పరిసరాలను అన్వేషించడం కోసం పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే డిజిటల్ నోమాడ్స్ ఎక్కువ ప్రొడక్టివ్ గా పని చేస్తారు. దాని కోసం వారు ఎక్కువ స్కిల్స్ ను కలిగి ఉంటారు.

రకరకాల ప్రదేశాలను, దేశాలను, కల్చర్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేసే వీలుంటుంది. ట్రావెలింగ్ చేయడాన్ని బాగా ఇష్టపడే వాళ్లు వర్క్ లైఫ్ ఇంకా ట్రావెలింగ్‌ను సెపరేట్‌గా బ్యాలెన్స్ చేయాల్సిన ఇబ్బంది ఉండదు. లైఫ్‌స్టైల్ సింపుల్‌గా, క్రియేటివ్‌గా, ఇండిపెండెంట్‌గా ఉంటుంది. ఒత్తిడి, యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యలు తక్కువగా ఉంటాయి. ఏకాంతంగా గడపడం ఇష్టపడేవాళ్లకు ఈ లైఫ్‌స్టైల్ బెస్ట్ ఆప్షన్.

నోమాడిక్ లైఫ్‌లో సహజంగానే ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. నెలకో లేదా రెండు నెలలకో ఒకసారి మరో ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణాలు జీవితంలో భాగమవుతాయి. ప్రపంచమంతా మన ఇల్లే అన్న భావన కలుగుతుంది. అలాగే డిజిటల్ నోమాడ్స్‌గా ఉండడం వల్ల  పరిస్థితులను అడాప్ట్ చేసుకునే స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి.

రోజూ క్రొత్త ప్రదేశాలకు వెళ్లడం.. మీ కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని బయటకు నెట్టివేస్తుంది. అలాగే ప్రతిరోజూ కొత్త వాతావరణాలకు, వేర్వేరు వ్యక్తులతో, విభిన్న సంస్కృతులతో కలిసి ఉండాలి. ఇవన్నీ కొత్త నైపుణ్యాలు, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని బలపరుస్తాయి.

నోమాడిక్ లైఫ్‌లో మీరు ఇష్టపడే పనులను చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది. కాంక్రీట్ జంగిల్ లో బిజీలైఫ్ స్టైల్ గడిపే చాలామందికి వారానికొకసారి తీరిక దొరకడం గగనం. కానీ నోమాడిక్ లైఫ్‌లో అలా కాదు మనతో మన సమయం గడపడానికి, ఇష్టమైన వారితో టైం స్పెండ్ చేయడానికి చాలా తీరిక దొరుకుతుంది.

ఇకపోతే నోమాడిక్ లైఫ్‌లో వర్క్, ట్రావెలింగ్‌తో పాటు బోలెడంత నెట్ వర్క్ కూడా పెరుగుతుంది. ప్రపంచమంతటా స్నేహితులు ఉంటారు. మీలాగే డిజిటల్ నోమాడ్స్‌గా పని చేస్తున్నవారు పరిచయం అవుతారు. అలా ఒక గొప్ప నెట్‌వర్క్ మీ సొంతమవుతుంది.

డిజిటల్ నోమాడ్ అయ్యేందుకు ఆప్షన్స్ ఇవీ..

డిజిటల్ నోమాడ్ గా మారడానికి ఈ  ప్రొఫెషన్స్ బాగా సరిపోతాయి.

బ్లాగింగ్

యూట్యూబర్

కస్టమర్ సర్వీసెస్

కన్సల్టింగ్

మార్కెటింగ్

ఫ్రీలాన్స్ రైటింగ్

SEO ఏజెన్సీ

వర్చువల్ అసిస్టెంట్లు

సాఫ్ట్‌వేర్ డెవలపర్లు

వెబ్‌సైట్ డిజైనింగ్

కంటెంట్ రైటింగ్

గ్రాఫిక్ డిజైనింగ్

ఎడిటింగ్

మోషన్ గ్రాఫిక్స్

ఆన్‌లైన్ టీచింగ్

లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్స్

ఈ స్కిల్స్ ముఖ్యం

డిజిటల్ నోమాడ్‌గా మారాలంటే కొన్ని స్కిల్స్‌ను తప్పనిసరిగా డెవలప్ చేసుకోవాలి.  అవేంటంటే.. రిమోట్ గా పనిచేయడానికి వీలుండే ఏదైనా టెక్నికల్ స్కిల్స్ ను నేర్చుకోవాలి.
ఎలాంటి పరిస్థితులనైనా అడాప్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఎక్కువ ప్రొడక్టివ్‌గా పని చేయగలగాలి. తక్కువ ఖర్చుతో జీవించడం అలవాటు చేసుకోవాలి.

బడ్జెట్ ప్లానింగ్ పక్కాగా ఉండాలి. ట్రావెల్, హెల్త్, లైఫ్ ఇన్స్యూ‌రెన్స్‌ ఉంటే మంచిది. వర్క్ కోసం సరైన గాడ్జె్ట్స్, గేర్ ప్రిపేర్ చేసుకోవాలి. డిజిటల్ నోమాడ్స్ కమ్యూనిటీల్లో జాయిన్ అవ్వాలి. వాళ్లతో కనెక్టెడ్‌గా ఉండాలి. చేస్తున్న వర్క్‌తో పాటు బ్లాగింగ్, బుక్స్, ఇతర వాలంటరీ సర్వీసులు చేస్తూ ఉండాలి.

ప్రతికూలతలు ఇవీ..

ఇక్కడి నుండైనా పనిచేయగలగడం చాలా బాగుంటుంది. కానీ అన్నింటిలో ఉన్నట్టే ఈ లైఫ్‌స్టైల్‌లో కూడా లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి.  డిజిటల్ నోమాడ్ గా పనిచేయడ వల్ల ఉండే నష్టాలేంటంటే..

డిజిటల్ నోమాడ్‌గా పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. చేసేది రిమోట్ వర్క్ కాబట్టి రెగ్యులర్ ఐటీ జాబ్ అంత సాలరీ ఉండకపోవచ్చు.
అలాగే ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్లకు కొన్నిసార్లు ప్రాజెక్ట్ ల కొరత ఏర్పడొచ్చు.

టైం జోన్, ఫుడ్, క్లైమేట్ లాంటి వాటిని సరిగ్గా అడాప్ట్ చేసుకోకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మనకు నచ్చిన ప్రదేశంలో ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ సిగ్నల్స్ లాంటివి ఉండకపోవచ్చు. దేశవిదేశాలు తిరుగుతారు కాబట్టి అక్కడి కరెన్సీని బట్టి ఖర్చుల్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

నోమాడిక్ లైఫ్‌స్టైల్‌లో బతకడానికి కావాల్సిన అన్ని లగ్జరీ వసతులు ఉండవు. కొద్దిపాటి లగేజీతోనే లైఫ్‌స్టైల్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇకపోతే ప్రదేశాన్ని బట్టి సేఫ్టీ, లాంగ్వేజీ ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రతీసారీ ఉండబోయే ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.

జీవితంలో ఎక్కువ శాతం రిసార్ట్స్, బ్యాక్ ప్యాకర్ హాస్టల్స్, ఎయిర్ బీయన్బీ అపార్ట్‌మెంట్స్‌లో, హోమ్ స్టేస్‌లో గడపాల్సి వస్తుంది. నిరంతరం ప్రయాణించడం కొంతమంది ఆరోగ్యానికి పడకపోవచ్చు.

స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి?

నోమాడ్స్ అంటే ఎక్కువగా మగవాళ్లే ఉంటారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిజిటల్ నోమాడ్స్ లో 70 శాతం  స్త్రీలు 30 శాతం పురుషులు ఉన్నారు. ఇంకా డిజిటల్ నోమాడ్స్ కు సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇలా ఉన్నాయి.

డిజిటల్ నోమాడ్స్ తరచూ ప్రయాణిస్తూ ఉంటారని మనకు తెలుసు. అయితే వీళ్లు ఒక ప్రదేశంలో రెండు వారాల నుంచి నెల రోజుల వరకూ గడుపుతారు. ఓ సర్వే ప్రకారం ఒక ప్రదేశంలో 2 లేదా 3 వారాలు గడిపే నోమాడ్స్ 22 శాతం ఉన్నారు. ఒకే స్థలంలో ఒక వారం కన్నా ఎక్కువ ఉండని వారు 17 శాతం ఉన్నారు. ఇకపోతే 3 నుంచి 4 నెలల పాటు ఒకే ప్లేస్‌లో గడిపే వాళ్లు 12 శాతం మంది ఉన్నారు.

నోమాడ్స్‌లో 51 శాతం మంది హోటల్స్, రిసార్ట్స్, హోమ్ స్టేలు, హాస్టల్స్‌లో నివసిస్తున్నారు. 41 శాతం మంది స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇకపోతే అచ్చంగా వాహనాలు, క్యారవాన్స్‌లో గడిపే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు.

ఓ సర్వే ప్రకారం డిజిటల్ నోమాడ్స్‌లో 22 శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఉన్నారు. వీడియో మేకింగ్, గ్రాఫిక్ డిజైన్ రంగాల్లో 21 శాతం మంది ఉన్నారు. అలాగే 13 శాతం రైటర్స్, 9 శాతం కన్సల్టెంట్స్, 7 శాతం కామర్స్ రంగాల్లో పనిచేస్తున్నారు.

డిజిటల్ నోమాడ్స్ ఎంచుకునే డెస్టినేషన్స్ లో టాప్ 10 ఇవే..

బాలి, ఇండోనేషియా

లండన్

చియాంగ్ మాయ్, థాయ్ లాండ్

లిస్బన్, పోర్చుగల్

బార్సిలోనా, స్పెయిన్

న్యూయార్క్

బ్యాంకాక్

లాస్ ఏంజిల్స్

పారిస్, ఫ్రాన్స్

బెర్లిన్, జర్మనీ

ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు..

డిజిటల్ నోమాడ్‌గా మారాలంటే ముందు ఆన్‌లైన్‌లో డబ్బు ఎలా సంపాదించాలో గుర్తించాలి. రెగ్యులర్ జాబ్ లాగా ఇందులో నిలకడైన ఆదాయం ఉండదు. కాబట్టి ఫైనాన్షియల్ విషయాలను పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. కోవిడ్‌తో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కు అందరూ అలవాటయ్యారు కాబట్టి ఫ్యూచర్‌లో చాలామంది డిజిటల్ నోమాడ్స్‌గా మారే అవకాశం ఉంది.

అందుకే సక్సెస్ ఫుల్ నోమాడ్‌గా ఉండాలంటే సరైన ప్లానింగ్, కృషి, బడ్జెట్ ప్లానింగ్, నెట్ వర్కింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి.

– తిలక్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleCalcium rich foods: కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు .. వీటితో ఎముకలు స్ట్రాంగ్
Next articleవాలంటూరిజం : సేవ కోసం ఒక టూర్!