Common ITR for all: అన్ని రకాల ఇన్‌కమ్ టాక్స్ రిటర్ను(ఐటీఆర్)లకు ఒకే ఐటీఆర్ ఫారమ్ తీసుకువచ్చే ప్రతిపాదనలు ఉన్నట్టు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న అన్ని రకాల ఐటీఆర్ ఫారాలను ఇంటిగ్రేట్ చేస్తూ కామన్ ఐటీఆర్ ఫారం తీసుకురానుంది. ఈమేరకు ముసాయిదా మార్గదర్శకాలను కూడా ప్రచురించింది. ఛారిటేబుల్ ఇనిస్టిట్యూషన్స్, బిజినెస్ ట్రస్ట్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌కు సంబంధించి వర్తించే ఐటీఆర్- ఫారాన్ని మాత్రం యథాతథంగా ఉంచనున్నట్టు సంకేతాలు ఇచ్చింది.
ఇప్పుడు ఉన్న పలు ఐటీఆర్ ఫారాలు ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారిని చాలా గందరగోళానికి గురిచేస్తాయి. వేతన జీవులకు ఒకటి, వ్యాపారస్తులకు ఒకటి, విభిన్న ఆదాయాలు ఉన్న వారికి మరొకటి.. ఇలా అనేక ఐటీఆర్ ఫారాలు ఉన్నాయి. ఇవి ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు పలు రకాల కేటగిరీలుగా ఉన్నాయి.
కామన్ ఐటీఆర్ ఫారం తీసుకొచ్చినప్పటికీ ఐటీఆర్-1, ఐటీఆర్-4 కేటగిరీలకు కొంతకాలం పాటు పాత ఐటీఆర్ ఫారాలు అందుబాటులో ఉంచుతారని తెలుస్తోంది. అయితే ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-5, ఐటీఆర్-6 ఫారాలు సబ్మిట్ చేసే వారికి మాత్రం కామన్ ఐటీఆర్ ఫారం మినహా మరో ప్రత్యామ్నాయం లేనట్టు ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి అవగతమవుతోంది.
ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు కామన్ ఐటీఆర్ ఫారంలో వారికి సంబంధం లేని పద్దులు గానీ, షెడ్యూళ్లు గానీ కనిపించవు. కేవలం వారికి సంబంధించిన డేటా మాత్రమే ప్రి-ఫిల్లింగ్ రూపంలో కనిపిస్తాయి.
కామన్ ఐటీఆర్ నోటిఫై అయితే ఇక రిటర్నులు దాఖలు చేసేటప్పుడు కొన్ని సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా ఐటీ చెల్లింపుదారులు తమకు వర్తించే షెడ్యూళ్లకు సంబంధించిన సమాధానాల్లో టిక్ చేస్తే ఆయా షెడ్యూళ్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ కారణంగా వారికి సంబంధం లేని కాలమ్స్ ఇక వారికి కనిపించవు. తద్వారా తలనొప్పి తగ్గుతుంది. తక్కువ సమయంలో ఐటీ రిటర్నులు దాఖలు చేయొచ్చు. నిపుణుల సలహా కూడా పెద్దగా అవసరం రాదు.
ప్రస్తుతం ఈ కామన్ ఐటీఆర్‌కు సంబంధించి ముసాయిదాను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసింది. వీటిపైన ఏవైనా సలహాలు, ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటే డిసెంబరు 15లోగా సమర్పించవచ్చు.