coorg tourism: కూర్గ్‌ టూర్‌ అంటే ట్రెక్కింగ్‌ .. వాటర్ ఫాల్స్ .. ర్యాఫ్టింగ్

chiklihole reservoir
Image Credit: kodagu Official site

coorg tourism: కూర్గ్‌ టూర్ .. దక్షిణాదిలో హాలి డే డెస్టినేషన్స్, టూరిజం ప్రాంతాల్లో ప్రముఖంగా చోటు దక్కించుకునే ప్రాంతం కూర్గ్‌. అధికారికంగా ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ‘కొడగు‘ అని పిలుస్తున్నారు. పశ్చిమ కనుమలలో నెలవైన ఈ ప్రదేశం ఇక్కడి ప్రకృతి రమణీయత, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం, కాఫీ తోటల అందాల కారణంగా ‘స్కాట్లాండ్‌ ఆఫ్‌ ఇండియా‘ అనే పేరు సొంతం చేసుకుంది.

ఒకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారెవరైనా రెండోసారి వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కూర్గ్‌ చారిత్రక నేపథ్యం ఏమిటి? కూర్గ్‌ టూర్‌లో  చూడాల్సిన ప్రదేశాలు ఏమిటి? ఇక్కడికి చేరుకోవడం ఎలా? వంటి అంశాలు డియర్‌ అర్బన్‌ పాఠకుల కోసం స్పెషల్‌ ట్రావెల్‌ స్టోరీలో మీకోసం..

కూర్గ్‌ coorg చారిత్రక నేపథ్యం

కర్ణాటక రాష్ట్రంలోని నైరుతి వైపు పశ్చిమ కనుమలలో కొడగు(కూర్గ్‌) ప్రాంతం కేంద్రీకృతమై ఉంది. కొడగు రాజ్యాధినేత చిక్క వీరరాజేంద్ర నుంచి ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1834లో జరిగిన యుద్ధంలో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.

బ్రిటిష్‌ పాలనలో ఇది ‘కూర్గ్‌ ప్రావిన్స్‌‘ గా మారింది. బ్రిటీషర్లు కొడగు ప్రజలకు కాఫీ తోటల సాగు పరిచయం చేసి, వారికోసం విద్యా సంస్థలు స్థాపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూర్గ్‌ కొంతకాలంప్రత్యేక రాష్ట్రంగా ఉంది. 1956లో మైసూర్‌ రాష్ట్రంలో విలీనమైంది. అదే ఇప్పుడు కర్ణాటక.

కూర్గ్‌ coorg కాఫీ తోటల అందాలు చూడతరమా…

కూర్గ్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు అక్కడి సుందరమైన కాఫీ తోటలు. దేశంలో ఉత్పత్తి అయ్యే కాఫీలో అధిక మొత్తం ఇక్కడే పండుతుంది. మీరు కూర్గ్‌లో ఏ ప్రాంతం సందర్శించినా సరికొత్త అనుభూతి పొందుతారనడంలో అతిశయోక్తి లేదు.

పర్వతారోహకులు, ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం ఈ కూర్గ్‌ టూరిజం coorg tourism

కూర్గ్‌ ప్రాంతాన్ని పర్వతారోహకులు, ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పేర్కొంటారు. కొండలను కప్పిన పచ్చని వృక్షాలు, అడవులు, జలపాతాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ హాలిడే ఎంజాయ్‌ చేయాలనుకునే వారికి కూర్గ్‌ ఉత్తమ ఎంపిక. ఇక్కడి అబ్బే ఫాల్స్, రాజా సీటు, ఓంకారేశ్వర ఆలయం, దుబారే ఎలిఫెంట్‌ క్యాంపు వంటి ప్రదేశాలు మనసుకు ఆహ్లాదాన్ని కల్గిస్తాయి.

పర్వతారోహకులకు తాడియాండమోల్‌ శిఖరాగ్రం చేరుకోవడం మంచి కిక్‌ ఇస్తుంది. ఇది కర్ణాటకలో రెండో ఎత్తైన పర్వతం. పైకి వెళ్లే రహదారిలో కనిపించే ప్రకృతి అందాలు మంత్రముగ్దులను చేస్తాయి.
ఇలాంటిదే కుమార పార్వత. దీని శిఖరం సముద్ర మట్టానికి 1,748 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇవే కాకుండా దుబారే ఎలిఫెంట్‌ క్యాంప్‌ వద్ద ఏనుగు సవారీ, అప్పర్‌ బారాపోల్‌ నదిలో వైట్‌ వాటర్‌ రాఫ్టింగ్‌ వంటివి మీలో ఒత్తిడిని మాయం చేస్తాయి.

కూర్గ్‌ ప్రత్యేకం హోమ్‌ మేడ్‌ వైన్‌

కూర్గ్‌ లో పర్యటిస్తున్నప్పుడు మీకు చాల చోట్ల వైన్‌ షాపులు ఆశ్చర్య పరుస్తాయి. కాని ఇవి నిషా ఎక్కించవు. ఇంట్లో తయారు చేసిన వైన్‌ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. పండ్ల రసాలను ఎంచుకున్నట్లే వివిధ రకాల పండ్ల రుచి గల వైన్‌ ఇక్కడ మీరు టేస్ట్‌ చేయవచ్చు.

కూర్గ్‌లో చూడాల్సిన ప్రదేశాలు (coorg sightseeing places)

1. రాజా సీటు (raja seat)

కూర్గ్‌ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి రాజా సీటు…  దీనినే ‘కింగ్స్‌ సీట్‌’ అని పిలుస్తారు. ఇది మడికేరి పట్టణంలో ఉన్నది. ఒకప్పుడు ఇక్కడ కూర్గ్‌ రాజులు చుట్టూ ఉన్న సుందరమైన అందాలను చూస్తూ ఆహ్లాదంగా గడిపేవారంట, అందుకే దీనిని రాజా సీటు అంటారు.

సూర్యాస్తమయం, సూర్యోదయం ఇక్కడి నుంచి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. మేఘాలు.. ఎగిరితే అందుకోవచ్చు అనేంత దగ్గరగా ఉంటాయి. అద్భుతమైన ఉద్యానవనంతో పాటు ఈ ప్రదేశానికి ఎడమవైపు గాంధీ మంటపం ఉంది. రాజా సీటు చుట్టూ తిరిగే బొమ్మ రైలు పిల్లలను మాత్రమే కాకుండా పెద్దలను కూడా ఆకర్షిస్తుంది.

2. అబ్బే జలపాతం (abbey falls)

కూర్గ్‌లో సందర్శించదగిన ప్రదేశాలలో అబ్బే జలపాతం ఒకటి. మడికేరికి సమీపంలో ఉన్న అబ్బే ఫాల్స్‌లో 70 అడుగుల ఎత్తు నుంచి పడే నీరు ఎంతో అందమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.

ఈ సుందరమైన వైభవం వర్షాకాలంలో అనేక రెట్లు పెరుగుతుంది. రుతుపవనాల సమయంలో నీటి గర్జన మరింత గంభీరంగా ఉంటుంది. చుట్టూ పచ్చని అందాల మధ్య జలపాతం సోయగాలు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.

3. చిక్లిహోలె రిజర్వాయర్‌ (chiklihole reservoir)

చిక్లిహోలె రిజర్వాయర్‌ మడికేరి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అడవితో ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. ఇది గొప్ప పిక్నిక్‌ స్పాట్‌. కుటుంబ విహారానికి సరైనది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఫోటోగ్రఫీ చేసే వారిని మరింత ఉత్సహపరుస్తుంది.

సూర్యాస్తమయ దృశ్యం మంత్రముగ్దులను చేస్తుంది. వర్షాకాలం, శీతాకాలం ఉండే జూన్‌ నుంచి మార్చి వరకు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం.

4. దుబారే ఎలిఫెంట్‌ క్యాంప్‌ (dubare elephant camp coorg)

దుబారే ఎలిఫెంట్‌ క్యాంప్‌  కావేరి నది ఒడ్డున ఉంది. ఇది పర్యాటకులు ఏనుగులకు దగ్గరగా గడపటానికి, వాటికి సంబంధించిన వివిధ కార్యకలాపాలలో పాల్గొనే అవకాశాన్ని అందిస్తుంది.  పర్యాటకులు ఏనుగులకు స్నానం చేయడానికి అనుమతిస్తారు.

dubare elephant camp
దుబారె ఎలిఫెంట్ క్యాంప్

అంతే కాకుండా మీరు వాటికి బెల్లం, చెరకు, అరటి, కొబ్బరి స్వయంగా అందించవచ్చు. 45 నిమిషాలు ఏనుగు మీద సవారి చేస్తూ అడవిలోకి వెళ్ళవచ్చు.

పర్యాటకుల కోసం ఏనుగు సవారీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య, మరియు సాయంత్రం 4 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.

5. హరంగి ఆనకట్ట (harangi dam)

హరంగి ఆనకట్ట కావేరి నదికి అడ్డంగా నిర్మించిన మొదటి ఆనకట్ట. ఇది 47 మీటర్ల ఎత్తు మరియు 846 మీటర్ల పొడవును కలిగి ఉంది. ఇది ప్రసిద్ధ పిక్నిక్‌ స్పాట్‌. మడికేరి నుంచి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మీరు ఒక రాత్రి లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఇక్కడ అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను ఎంచుకోవచ్చు. పర్యాటకుల కోసం ఇక్కడ గెస్ట్‌ హౌస్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆనకట్టకు సమీపంలో కావేరి ఆలయం ఉంది.

6. హొన్నమన కేరే సరస్సు (honnamana kere lake coorg)

హొన్నమన కేరే సరస్సు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఇక్కడ హొన్నమ్మ దేవత కొలువై ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది. సరస్సు సమీపంలో హొన్నమ్మ దేవత ఆలయాన్ని చూడవచ్చు.

హొన్నమ్మ దేవత ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు సరస్సును సందర్శించి, నైవేద్యాలు చెల్లించి, దేవత యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు.

దీని చుట్టూ పర్వతాలు, కొండలు, కాఫీ తోటలతో పాటు గవి బెట్టా మరియు మోరి బెట్టా అనే రెండు కొండలు ఉన్నాయి. సందర్శనా స్థలంతో పాటు, బోటింగ్, ఫిషింగ్‌ వంటివి ఎంజాయ్‌ చేయవచ్చు.

7. ఓంకారేశ్వర ఆలయం (omkareshwar temple coorg)

మడికేరిలోని ప్రసిద్ధ శివాలయం ఓంకారేశ్వర ఆలయం. దీనిని 1820లో లింగా రాజేంద్ర నిర్మించారు. ఈ ఆలయంలో ఇస్లామిక్, గోతిక్‌ శైలి వాస్తుశిల్పం ఉన్నాయి. ఆలయం ముందు అద్భుతమైన కొలను ఉంది. ఆలయం మధ్యలో నాలుగు మినార్లు, ఒక గోపురం ఉన్నాయి. ఒక ఫుట్‌పాత్‌ మంటపానికి దారితీస్తుంది.

8. కోటేబెట్టా ట్రెక్‌ (kotebetta trek)

కూర్గ్‌ ప్రాంతంలో మూడవ ఎత్తైన శిఖరం కోటేబెట్టా. సముద్ర మట్టానికి సుమారు 1620 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది సోమ్వార్పేట, మడికేరి పట్టణాల మధ్య ఉంది. ఇది పర్యాటకులకు అద్భుతమైన ట్రెక్కింగ్‌ అనుభూతి అందిస్తుంది.

ఇది హట్టిహోల్‌ నుంచి 10 కి.మీ. దూరంలో ఉంటుంది. పర్యాటకులు హట్టిహోల్‌ నుండి తమ ట్రెక్కింగ్‌ ప్రారంభించి శిఖరం వద్ద ముగిస్తారు. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు ట్రెక్కింగ్‌ను మరింత ఆనందదాయకం చేస్తాయి. అక్టోబర్‌ నుండి మార్చి వరకు ఇక్కడ ట్రెక్కింగ్‌ చేయడానికి అనువైన సమయం.

9. మడికేరి కోట (madikeri)

17 వ శతాబ్దం చివరిలో ముదురాజా నిర్మించిన మడికేరి కోటను టిప్పు సుల్తాన్‌ రాళ్ళు, ఇటుకలతో పునరుద్ధరించారు. ఈ కోటకు జాఫరాబాద్‌ అని పేరు పెట్టారు. ఈ కోట అనేక యుద్ధాలు, వారసత్వాలను చూసిన చరిత్ర కలిగి ఉంది.

ఇప్పుడు ఈ కోటను డిప్యూటి కమిషనర్‌ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. కోటలో బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన చర్చి, వివిధ రకాల పురాతన వస్తువులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఇంకా ఇక్కడ మహాత్మా గాంధీ పబ్లిక్‌ లైబ్రరీ, కోటే మహా గణపతి ఆలయం, జిల్లా జైలు వంటి అనేక భవనాలు ఉన్నాయి. మడికేరి దసరా ఉత్సవంలో పాల్గొనే ఆలయాలలో కోటే మహా గణపతి ఒకటి.

10. మండలపట్టి ట్రెక్‌ (mandalpatti peak)

అబ్బే జలపాతం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలపట్టి మడికేరి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రెక్కింగ్‌ ప్రేమికులకు, సాహస యాత్రలు ఇష్టపడే వారికి ఈ ప్రదేశం సరైనది. ట్రెక్కింగ్‌ వెళ్ళడానికి ట్రెక్కర్లు మండలపట్టి బేస్‌ వద్ద అధికారుల నుంచి ప్రవేశ టిక్కెట్లు తీసుకోవాలి.

ఈ పర్వతారోహణలో అందమైన దృశ్యాలు మంత్రముగ్దులను చేస్తాయి.  నవంబర్‌ నుంచి జనవరి వరకు సందర్శించడం మంచిది. ఈ సమయంలో ఈ ప్రదేశం పొగమంచుతో కప్పబడి అద్భుతంగా ఉంటుంది.

11. తలకవేరి ఆలయం talakaveri temple

ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన తలకవేరి బ్రహ్మగిరి కొండలో ఉంది. ఇది మడికేరి నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1276 మీటర్ల ఎత్తులో ఉన్న తలాకావేరిలో తీర్థ కుండికే లేదా బ్రహ్మ కుండికే అని పిలువబడే ఒక ప్రదేశం ఉంది.

ఇది కావేరి నదికి మూలం అని అంటారు. కుండికేకు దగ్గరగా రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒక ఆలయంలో పురాతన శివలింగం, మరొక ఆలయంలో గణేశుడిని  దర్శించుకోవచ్చు.  

అక్టోబర్‌ నెలలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం మంచిది. ఈ సమయంలో శంకరమన పండుగ జరుపుకుంటారు కాబట్టి ఈ సమయంలో చాలా మంది యాత్రికులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు.

ఈ సమయంలో కావేరి దేవత యొక్క రూపాన్ని సూచించే నీటితో చిన్న బావిని చూడవచ్చు. తలకవేరి నుంyì  బ్రహ్మగిరి శిఖరానికి వెళ్లొచ్చు. పురాణాల ప్రకారం సప్త మహా ఋషులు ఈ ప్రదేశంలో ప్రత్యేక యజ్ఞం చేశారు. శిఖరం నుండి లోయ యొక్క దృశ్యం మంత్రముగ్దులను చేస్తుంది.

12. తాడియాండమోల్‌ ట్రెక్‌ (tadiyandamol trek)

తాడియండమోల్‌ కూర్గ్‌ జిల్లాలో ఎత్తైన శిఖరం. సముద్ర మట్టానికి సుమారు 1746 మీటర్ల ఎత్తులో ఉంది. మడికేరి నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రెక్కింగ్‌ కోసం అద్భుతమైన ప్రదేశం ఇది.

ట్రెక్కింగ్‌ కోసం వెళ్ళడానికి ఉత్తమ సమయం డిసెంబర్‌ నుంచి మే. తాడియాండమోల్‌ చేరుకోవడం ఒక సాహసం. పర్యాటకులు జీపుల వంటి ప్రైవేట్‌ వాహనాలను తీసుకొని దాదాపు మూడింట ఒక వంతు దూరం ప్రయాణించవచ్చు.

అగ్రస్థానానికి చేరుకోవడానికి నిటారుగా ఉన్న మార్గం గుండా ట్రెక్కింగ్‌ చేయాలి. శిఖరానికి వెళ్ళేటప్పుడు ట్రెక్కింగ్‌ చేసేవారు నల్క్‌నాడ్‌ ప్యాలెస్‌లో రాత్రి బేస్‌ క్యాంపు ఏర్పాటు చేసుకుని ఆగవచ్చు.  

13. నాగర‌హోలే నేషనల్ పార్క్ nagarahole nagarahole national park

కొడగు మైసూర్ జిల్లాల మధ్య ఉంటుంది. దీనినే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్‌గా కూడా పిలుస్తారు. వైల్డ్ లైఫ్ సఫారీగా పేరుంది. టైగర్ రిజర్వ్ కేంద్రం ఇది. వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం. పార్క్ సందర్శనకు రూ. 50 టికెట్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. నాగరహోలె నది ఈ పార్క్ గుండా ప్రవహిస్తుంది. 

కూర్గ్‌ చేరుకోవడం ఎలా? (how to reach coorg)

కూర్గ్‌కు సమీపంగా ఉండే విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది కూర్గ్ నుంచి 137 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయానికి ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మంగుళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా కూర్గ్‌ చేరుకోవచ్చు. అలాగే మడికేరి(కూర్గ్ జిల్లా కేంద్రం) కి 121 కి.మీ. దూరంలో మైసూర్ విమానాశ్రయం ఉంది. అలాగే కన్నూరు విమానాశ్రయం కూడా మడికేరికి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. 

కేఎస్‌ఆర్టీసీ (కర్ణాటక స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌) బెంగుళూరు, మైసూర్, మంగళూరు వంటి నగరాల నుంచి రోజూ కూర్గ్‌కు డీలక్స్‌ బస్సులను నడుపుతోంది.

కూర్గ్‌కు 95 కి.మీ. దూరంలో ఉండే మైసూర్ జంక్షన్,‌ హసన్ సమీప రైల్వే స్టేషన్లు. అలాగే మంగళూర్, తలసెరి, కన్నూరు రైల్వే స్టేషన్లు కూడా ఇంకొంత దూరం ఎక్కువే. కాచిగూడ నుంచి మైసూర్ రైలు ప్రయాణానికి స్లీపర్ అయితే రూ. 550, థర్డ్ ఏసీ అయితే రూ. 1465, సెకెండ్ ఏసీ అయితే రూ. 2040 ఛార్జీ అవుతుంది. సుమారు 14 గంటల ప్రయాణం.

dubare elephant caచp rafting
దుబారె ఎలిఫెంట్ క్యాంప్ వద్ద ర్యాఫ్టింగ్

కూర్గ్‌ కేవలం ప్రాంతాల సందర్శన, ట్రెక్కింగ్‌ మాత్రమే కాదు ఇక్కడ రిసార్ట్‌లు ప్రకృతి ఒడిలో గడిపేలా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఎక్కువ రోజులు ఇక్కడ గడపాలనుకునేవారికి హోమ్‌ స్టే వసతి కూడా అందుబాటులో ఉంది. హోమ్ స్టే రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ వెబ్ ‌సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

స్థానికులు వారి సాటిలేని ఆతిథ్యంతో మిమ్మల్ని మెప్పిస్తారు. ప్రకృతి సౌందర్యానికి దగ్గరగా గడపటానికి, ఒత్తిడితో కూడిన లైఫ్‌ స్టైల్‌ నుంచి రిఫ్రెష్‌ కావడానికి కూర్గ్‌ ఒక చక్కటి హాలిడే డెస్టినేషన్‌. కూర్గ్ లేదా కొడగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కొడగు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
santosh bojja
– సంతోష్‌ కుమార్‌ బొజ్జా,

ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు 

ఇవి కూడా మీకు నచ్చుతాయి..

గోవా ట్రిప్ ఇలా ప్లాన్ చేయండి

రామాలయం సందర్శన, కిన్నెరసాని అందాలు చూద్దాం ఇలా

Previous articleజాతి రత్నాలు మూవీ ఎందుకు హిట్ అయ్యింది?
Next articleAnemia symptoms: రక్తహీనత (ఎనీమియా) లక్షణాలు.. తగ్గాలంటే ఏం చేయాలి?