కరోనాకు ముందు గడిచిన ఏడాది కాలంలో డిమాండ్ ఊపందుకుని ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెరిగి ఇల్లు కొనాలన్న ఆశలపై నీళ్లు చల్లాయి. దేశవ్యాప్తంగా ఎక్కడాలేనంతగా కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే ఈ పరిస్థితి ఉండేది.
కానీ కరోనా లాక్‌డౌన్ హైదరాబాద్ సహా అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయేలా చేసింది. రానున్న నెలల్లో మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ధరలపై మ్యాజిక్ బ్రిక్స్ తాజాగా ఒక నివేదిక ఇచ్చింది.
ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో హైదరాబాద్‌లో 5.2 శాతం మేర రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయని తెలిపింది. అంటే రూ. 50 లక్షల ఫ్లాట్ ధర రూ. 2.5 లక్షల పైబడి తగ్గిందని అర్థం. కరోనాకు ముందు అమాంతంగా ధరలు పెంచేయడంతో.. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తగ్గుదల శాతం ఒకింత ఎక్కువగానే ఉంది.
అలాగే బెంగళూరులో 2.8 శాతం, చెన్నైలో 3.1 శాతం ధరలు తగ్గాయని సదరు నివేదిక పేర్కొంది. అంతేకాకుండా ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం వెతుకులాట 27 శాతం తగ్గిందని, ఇల్లు అమ్మబడును అని పోర్టల్ పోస్టులు కూడా 42.5 శాతం తగ్గాయని నివేదిక తెలిపింది.
హైదరాబాద్ బిల్డర్లు ఏమంటున్నారు?
లాక్‌డౌన్ కాలంలో నిర్మాణ రంగంలో పనులు ఆగిపోవడంతో అమ్మకానికి అందుబాటులో తక్కువగా ఫ్లాట్లు ఉన్నాయని, అందువల్ల డిమాండ్ తగ్గినా.. సరఫరా కూడా అదే రీతిలో ఉంటున్నందున ధరలు పెద్దగా తగ్గవని బిల్డర్లు చెబుతూ వస్తున్నారు. అలాగే మెటిరీయల్ ధరలు కూడా పెరిగిపోయాయని, కూలీల లభ్యత లేదని, హౌజింగ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గడంతో కొనుగోళ్లు స్థిరంగా ఉంటాయని, అందువల్ల ధరలు తగ్గే అవకాశం లేదని చెబుతూ వచ్చారు.
వాస్తవానికి అంతకుముందు ఏడాది కాలంలో మెటీరియల్ రేట్లు తక్కువగా ఉన్నా, ఫ్లాట్ల లభ్యత చాలా ఉన్నా.. ధరలు మాత్రం అనూహ్యంగా 40 శాతం వరకు పెంచేశారు. ఇప్పుడు ఉద్యోగభద్రత కరువై ఔత్సాహిక కొనుగోలుదారులు ఇల్లు కొనుగోలు చేసే ఆలోచనను విరమించుకుంటున్నారు.
సగటున రూ. 50 లక్షలు వెచ్చించి ఫ్లాట్ కొనాలంటే కనీసం నెలకు రూ. 40 వేల వరకు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది.
ఈస్థాయి వేతనాలు అందించే ఐటీ రంగం సహా అనేక రంగాల్లో ఉద్యోగాల మెడపై కత్తి వేలాడుతోంది. మీడియా రంగంలో పెద్ద పెద్ద పేరు సంపాదించిన సంస్థలు కూడా లేఆఫ్ పేరుతో, వేతనాల కోత పేరుతో ఉద్యోగులకు నిద్ర కరువు చేస్తున్నాయి. ఫలానా రంగం బాగానే ఉందన్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఉపాధినిచ్చే రంగాలన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడేవే.
అందువల్ల కొద్దికాలం పాటు ఇల్లు కొనాలన్న భారీ లక్ష్యాలకు ఉద్యోగులు, వ్యాపారులు దూరంగా ఉండొచ్చు. అందువల్ల సమీప కాలంలో మాత్రం మరింతగా రేట్లు పడిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.