వలస కూలీల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించింది. 2020లో కరోనా వల్ల అత్యంత ఇక్కట్లు ఎదుర్కొన్నది వలస కూలీలే. వందలాది కిలోమీటర్ల దూరం సైతం లెక్కచేయక పట్టణాల నుంచి సొంతూళ్లకు వెనక్కి వెళ్లిన వలస కార్మికులకు ఉపాధి కష్టాలు రానున్నాయని మనం గతంలోనే చెప్పుకున్నాం.
వలస కార్మికులు ఇన్ని కష్టాలు పడుతున్నా కేంద్రం సరైన రీతిలో స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. తాజాగా వారి సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు.
సొంతూళ్లలో ఉపాధి లేక అలమటిస్తున్న వలస జీవులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ పథకం కింద రూ. 50 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు నెలకొల్పుతారు.
ఈ వలస జీవులకు ఉపాధి అందించేందుకు వీలున్న 25 పనులు గుర్తించారు. వలస కార్మికులు ఎక్కువగా తిరిగి వచ్చిన బిహార్, ఉత్తర్ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అత్యధికంగా బిహార్లోని 32 జిల్లా, యూపీలోని 31 జిల్లాల్లో దీనిని అమలు చేయనున్నారు.
12 శాఖలు ఉమ్మడిగా ఈ పనులను అమలు చేయనున్నాయి. రహదారులు, ఇళ్ల నిర్మాణం, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, పశువుల కొట్టాల నిర్మాణం, కోళ్ల ఫారాల నిర్మాణం, మేకల షెడ్ల నిర్మాణం, వ్యవసాయ క్షేత్రాల్లో కుంటల నిర్మాణం వంటి పనులు చేపడతారు.
దాదాపు 125 రోజులపాటు వలస కార్మికులకు పని దొరికేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. భవిష్యత్తులో దీనిని కొనసాగించేందుకు ఒక ప్రణాళిక రూపొందించడానికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.