Gongura Pachadi Recipe: గోంగూర పచ్చడి ఒక్కసారి రుచి చూస్తే ఇక వదిలిపెట్టరంతే! ఆంధ్రా వంటకాలలో గోంగూరకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ కూర అయినా రెండు, మూడు సార్లు తినేసరికి బోర్ కొడుతుంది. కాని గోంగూర మాత్రం ఎన్నిసార్లు తిన్నా ఇంక తినాలనిపించే కూర. ఎప్పుడుతిన్నా దాని రుచి మారనే మారదు. భోజనంలో ఎన్ని కూరలు ఉన్నా గోంగూర లేని లోటు అలానే ఉంటుంది. అందుకే ఆంధ్రా అంటే అందరికీ గుర్తొచ్చేది ముందుగా గోంగూర.
ఈ గోంగూరతో రకరకాల వంటకాలను తయారు చేస్తారు. ఇది అన్ని కాలాల్లో దొరికుతుంది. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వండుకుని తినేయచ్చు. అంతేకాదు గోంగూరను గోదారోళ్ల స్పెషల్ అని చెప్పవచ్చు. కొంచెం పుల్లగా కొంచెం స్పైసీగా నోటికి కమ్మగా తిన్నామన్న తృప్తినిస్తుంది. గోంగూరలో అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే మంచి పోషకాలు ఉన్నాయి. చాలామంది వాళ్ల టేస్ట్‌కు తగ్గట్టు గోంగూరను వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. అందులో గోంగూర పప్పు, గోంగూర రొయ్యలు, గోంగూర చికెన్, గోంగూర పచ్చడి ఇలా ఎన్నో రకాలుగా చేస్తారు. నిజానికి గోంగూరతో ఏది కలిపి వండుకున్న మజాగానే ఉంటుంది.
ఈ గోంగూర పచ్చడిని తయారు చేయడానికి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు. చాలా ఈజీగా ఇంట్లోనే తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు. మరి ఈ గోదారోళ్ల స్పెషల్ గోంగూర పచ్చడిని ఈ స్టోరీలో చూసేయండి.
గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు
- గోంగూర కట్టలు – మూడు పెద్దవి
- నూనె- ఒక టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి – ఐదు నుంచి పది
- ఉప్పు – రుచికి సరిపడా
- వెల్లుల్లి – మూడు నుంచి నాలుగు
- మెంతులు – ఒక టీ స్పూన్
- ఆవాలు – ఒక టీ స్పూన్
- ధనియాలు – ఒక టీ స్పూన్
- జీలకర్ర – ఒక టీ స్పూన్
- చింతపండు – కొద్దిగా (చిన్న నిమ్మకాయ సైజంత )
- పోపు పదార్థాలు: పచ్చి శనగ పప్పు – ఒక టీ స్పూన్, సాయిమినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 3, నూనె – రెండు టేబుల్ స్పూన్లు
గోంగూర పచ్చడి తయారీ విధానం:
- ముందుగా గోంగూర ఆకులను తుంచి వాటిని శుభ్రంగా కడిగి ఒక కాటన్ బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక రెండు గంటలు ఆరబెట్టిన తర్వాత స్టౌ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి అందులో ఈ గోంగూర ఆకులను వేసుకుని కొంచెం మగ్గనివ్వాలి. అందలోనే కొద్దిగా చింతపండును వేసుకుని రెండింటిని మగ్గనివ్వాలి. అవి కొంచెం మెత్తబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
- ఇప్పుడు మరో ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చిని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. అదే ప్యాన్‌లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి.
- మిక్సీ జార్లో ఎండుమిర్చిని వేసి కారం పొడి చేసుకోవాలి. తర్వాత అది వేరే గిన్నెలో తీసుకున్న తర్వాత అదే జార్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి కారం పొడి ఇష్టం లేని వాళ్లు పచ్చి కారాన్ని కూడా వేసుకోవచ్చు. కానీ ఎండుమిర్చి కారం పొడి పచ్చడికి చాలా రుచిని ఇస్తుంది.
- ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న గోంగూర మిశ్రమాన్ని మిక్సీ లేదా రోట్లో వేసుకుని దానిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమంలో కొంచెం ఉప్పును వేసుకోవాలి.
- తర్వాత అందులో ఎండుమిర్చి కారం, వేయించిన మెంతుల పొడిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పడు పోపు కోసం పైన చెప్పిన దినుసులతో పోపు పెట్టుకుని గోంగూర మిశ్రమంలో వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్పైసీ అయిన గోంగూర పచ్చడి రెడీ. అన్నంలో కలుపుకుని తింటే రుచిని ఆస్వాదిస్తూనే ఉండొచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్