Hampi temple: హంపి టెంపుల్.. చారిత్రక సాక్ష్యాలు.. ప్రకృతి అందాలు

hampi tour
Photo by Srusti Valakamadinni on Unsplash

Hampi temple: చరిత్రతో ముడిపడి ఉన్న ప్రదేశాలను చూసి రావాలన్న తపన కలిగిన వారికి హంపి టెంపుల్ టూర్ మంచి ఎంపిక. విజయనగర సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన నగరం హంపి. 14వ శతాబ్ధంలో వెలిసిన విజయనగర రాజ్యానికి రాజధాని హంపి నగరం. ఆ కాలంలో ఎంతో మంది పర్షియన్, పోర్చుగీస్, యూరోపియన్ పర్యాటకులు హంపి గురించి తాము రాసిన పుస్తకాలలో ప్రస్తావించారు.

తుంగభద్ర నది పక్కన సిరిసంపదలతో, నిర్మాణ కౌశలాన్ని తెలిపే కట్టడాలతో, ప్రకృతి అందాలతో రమణీయంగా వెలిగిన నగరంగా హంపిని వారు వర్ణించారు. ఇప్పుడు హంపి ఆనాటి చారిత్రక కట్టడాలకు సాక్ష్యంగా ఉంది. చరిత్రను ఇష్టపడేవారు కచ్చితంగా సందర్శించాల్సిన నగరం హంపి.

కర్ణాటకలోని బళ్లారి జిల్లా కేంద్రానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హంపి. ఓ వైపు తుంగభద్ర నది, మిగతా మూడు వైపులా ఆనాటి చరిత్రకు శిధిల సాక్ష్యాలుగా మిగిలిన కట్టడాలు, గ్రానైటు శిలలు ఉంటాయి. హంపిని పూర్తిగా చూడాలనుకుంటే మూడు రోజులకు కేటాయించుకోవాలి.

హంపి (hampi weather) చాలా వేడిగా ఉండే ప్రాంతం. హంపి టెంపుల్ చుట్టూ రాతి కట్టడాలు ఎక్కువగా ఉంటాయి కనుక వేసవిలో వెళితే ఆ వేడికి తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. కనుక  అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలోపు హంపికి వెళ్లడం ఉత్తమం.

హంపి ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం (hampi to hyderabad)

హైదారాబాద్ నుంచి 385 కిలోమీటర్ల దూరంలో ఉంది హంపి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ మీదుగా హంపి చేరుకోవచ్చు. లేదా హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బళ్లారి అక్కడి నుంచి హంపి వెళ్లచ్చు. ఎనిమిది గంటల సమయం పట్టొచ్చు.

రైలు మార్గం (hampi railway station):

ట్రైన్లో హంపిని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి హోస్పేట్ జంక్షన్ వరకు టికెట్ బుక్ చేసుకోవాలి. హోస్పేట్ నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది హంపి.

విమాన మార్గం:

హంపికి దగ్గర్లో  రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి బెలగాం, రెండోది హుబ్లీ. బెలగాం ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో 264 కిలోమీటర్లు ప్రయాణించి హంపిని చేరుకోవచ్చు. అదే హుబ్లీ ఎయిర్ పోర్టు నుంచి 164 కిలోమీటర్లు ప్రయాణిస్తే హంపిని చేరచ్చు.

హంపి టూర్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు (hampi places to visit)

నిజానికి హంపి మొత్తం చూసినా తనివితీరదు. చూడాల్సినవి దాదాపు 44 ప్రదేశాలు దాకా ఉన్నాయి. వాటిలో కచ్చితంగా చూడాల్సినవి ఇవీ..

విరూపాక్ష దేవాలయం (hampi virupaksha temple)

విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ముందే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. దాదాపు యాభై మీటర్ల ఎత్తుతో ఈ దేవాలయం గోపురం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెయ్యేళ్ల నాటి దేవాలయంలోకి చెప్పరాని అనుభూతి కలుగుతుంది. ఆలయ శిఖరం నీడ తలకిందులుగా పడడం ఇక్కడి ప్రత్యేకత.

విజయవిఠల దేవాలయం

ఈ దేవాలయం చూడటానికి కనీసం రెండు గంటలు పడుతుంది. విశాలమైన మట్టిదారిలో నడుచుకుంటూ వెళ్లడానికే అరగంట సమయం పడుతుంది. నడవలేని వారి కోసం జీపులు ఉన్నాయి కానీ, టిక్కెట్ తీసుకున్నాక పర్యాటకుల తాకిడిని బట్టి అరగంట నుంచి గంటన్నర వరకు వేచి ఉండాలి.

ఈ దేవాలయంలో మహావిష్ణువును విఠలుడిగా కొలుస్తారు. ఆలయం ముందున్న రాతి రథం అప్పటి శిల్పకళా చాతుర్యానికి ప్రతీక. అందుకే ఈ రథాన్ని కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ తమ పర్యాటక చిహ్నంగా ఉపయోగిస్తోంది.

నరసింహ స్వామి దేవాలయం

ప్రముఖ ఏకశిలా విగ్రహం ఇది. ఎత్తు 6.7 మీటర్లు ఉంటుంది. దీన్ని 15వ శతాబ్ధంలో నిర్మించారు. కాకపోతే మొఘలుల దండయాత్ర సమయంలో పాక్షికంగా దెబ్బతింది.

మాతంగా హిల్స్ పై ట్రెక్కింగ్

హంపి అందాల్ని అంత ఎత్తు నుంచి చూడాలంటే మాతంగా హిల్స్ ట్రెక్కింగ్ కు వెళ్లండి. అక్కడి నుంచి హంపి నగరమంతా సుందరంగా కనిపిస్తుంది. ఆ కొండలపై ఉన్న వీరభద్ర ఆలయాన్ని కూడా దర్శించవచ్చు.

హిప్పీ ఐలాండ్

హంపి నుంచి చిన్న ఏరు దాటితే వచ్చేదే హిప్పీ ఐల్యాండ్. హంపి వచ్చిన విదేశీయులంతా ఇక్కడే వసతి పొందుతారు. ఇక్కడ పాశ్చాత్య కల్చర్ ప్రతిబింబించేలా ఆహార పదార్థాలు లభిస్తాయి. రాత్రి సంగీత కార్యక్రమాలు హోరెత్తుతాయి. రకరకాల చేత్తో చేసిన చాలా రకాల ఉత్పత్తులు ఇక్కడ అమ్మకానికి ఉంటాయి. హిప్పీ ఐల్యాండ్ ఓ పక్క పచ్చని పొలాలతో కళకళలాడుతుంది. కేఫ్లు, రెస్టారెంట్లు ఆధునికంగా ఉంటాయి. ఇక్కడ గుడిసెల్లాంటి కట్టడాలల్లో వసతి కూడా అందుబాటులో ఉంది.

సనాపూర్ లేక్

sanapur lake  హిప్పీ ఐల్యాండ్ లో బైకులు అద్దెకు ఇస్తారు. బైక్ పై ఐల్యాండ్ అంతా తిరిగి చూడచ్చు. దగ్గర్లో ఉన్న సనాపూర్ లేక్ ను కచ్చితంగా చూడాలి. తొట్టెల్లో సరస్సుపై కాసేపు షికారు కూడా చేయచ్చు. అయితే ఉచితం కాదు, రుసుము చెల్లించాలి.

హంపిలో ప్రతి కట్టడమూ, ప్రదేశమూ సుందరంగా, చరిత్రకు సాక్ష్యంగానే ఉంటుంది.  వీలైతే ఇవి కూడా చూడండి.

1. కొడలేలు గణపతి
2. హజరా రామాలయం
3. మహానవమి దిబ్బ
4. బడవి లింగ (ఏకశిలా లింగం)

badavi linga
badavi linga

5. తుంగభద్ర డ్యామ్
6. లోటస్ మహల్
7. యంత్రోధారక హనుమాన్ ఆలయం (కొండపై)
8. క్వీన్స్ బాత్ (రాణి వారి స్నానాల కట్టడం)
9. ఏకశిలా నంది (విరుపాక్ష దేవాలయం ఎదురుగా)

హంపిలో వసతి ఎలా? hampi resorts or hampi hotels

హోస్పేట్ లో ఉండేకన్నా నేరుగా హంపిలోనే వసతి తీసుకోవడం చాలా ఉత్తమం. హంపిలోని స్థానికులు తమ ఇళ్లనే గదులుగా విభజించి వసతి కల్పిస్తారు. రోజుకు రూ. 600 నుంచి మొదలవుతుంది. హంపిలో ప్రతి స్థానికుడు చిన్న హోటల్ నడపడం లేదా వసతి గదులను అద్దెకివ్వడం చేస్తాడు. అదే వారి ప్రధాన ఆదాయం.

హంపిలో హోటళ్లకు లోటు లేదు, అడుగుకో హోటల్ కనిపిస్తుంది. అయితే నాన్ వెజ్ దొరకదు. ఎక్కడో ఓ చోట గుడ్డుతో చేసే వంటలు దొరికే అవకాశం ఉంది. ఆల్కహాల్ వంటి వాటికి చోటు లేదు.

hampi village starting point
hampi village starting point

అన్నింటి కన్నా ముఖ్యంగా అక్కడ దగ్గరలో ఎలాంటి మెడికల్ షాపులు ఉండవు. కనుక పిల్లలతో లేదా పెద్దవాళ్లతో వెళ్లినప్పుడు జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్య సమస్యలకు సంబంధించిన మెడికల్ కిట్ తీసుకెళ్లడం అత్యవసరం.

ఇవి కూడా చదవండి:

కూర్గ్‌ టూర్‌ : ట్రెక్కింగ్‌ .. వాటర్ ఫాల్స్ .. ర్యాఫ్టింగ్

Previous articleలాక్టోజ్ ఇంటోలరెన్స్: కన్నబిడ్డకు తల్లిపాలే పడకపోతే..?
Next articlemental health: మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏంచేయాలి?