మహిళలకు ఎక్కువగా వచ్చే జబ్బులు ఇవే

పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి కారణం శారీరకంగా బలహీనంగా ఉండటమే కారణం. దానికి తోడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటంతో అనారోగ్యానికి గురవుతున్నారు.

అలా జబ్బులను చివరి స్టేజ్‌లో గుర్తించటంతో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో తమ చేతులతోనే ప్రాణలను ప్రమాదంలోకి నెడుతున్నారు. మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అవి గుండె పోటు, రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌, అల్జీమర్స్‌, ప్రెగెన్సీ సమస్యలు, రక్త హీనత, డిప్రెషన్‌ సమస్యలు మొదలైనవి.

మహిళల్లో గుండె జబ్బులు

మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్యల్లో గుండె జబ్బు ఒకటి. గుండె పోటు లక్షణాలు చెస్ట్‌ పెయిన్, శ్వాస అందకపోవటం, విపరీతమైన అలసట, ఇర్రెగ్యూలర్‌ హార్ట్‌ బీట్‌ ఉంటుంది. వీటి పట్ల ప్రతి మహిళ జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. 40 ఏళ్ళ వయసు నుంచి గుండె సంబంధిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

రొమ్ము కాన్సర్‌

రొమ్ము కాన్సర్‌.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న జబ్బు ఏదైనా ఉందంటే అది ఇదే.  ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కాన్సర్‌ నివేదిక ప్రకారం, ప్రతి నలుగురిలో ఒకరు రొమ్ము కాన్సర్‌తో బాధపడుతున్నారు.

ఈ వ్యాధితో ఏటా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మహిళలకు సాధారణంగా వచ్చే కాన్సర్‌లలో రొమ్ము కాన్సర్‌ ఒకటి. ఇది రొమ్ము కణజాలాలో ఉద్భవిస్తుంది. మొదట చిన్న గడ్డగా ఏర్పడి.. కాలక్రమేనా పెద్ద గడ్డగా మారుతుంది. అయితే రొమ్ము గడ్డలు అన్ని ప్రమాదకరమైనవి కావు.

కాన్సర్‌ కారక గడ్డలు కావని భ్రమపడి, పరీక్షలు చేయించుకోకపోవటం సరైన పద్ధతి కాదు. ముందుగానే ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.

రొమ్ము కాన్సర్‌ లక్షణాలు

రొమ్ములో గడ్డులు, వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. వీటి కారణంగా ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. బ్రెస్ట్‌ నిపుల్‌ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి రాలిపోతుండటం, ఛాతిపై ఉన్న చర్మం రంగు మారుతుండటం, నిపుల్స్‌ నుంచి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ద్రవం వస్తుండటం వంటి లక్షణాలు గనుక ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉన్నట్లుగా గుర్తించి డాక్టర్‌ను సంప్రదించాలి.

కానీ రొమ్ము కాన్సర్‌ను మొదటి దశలో గుర్తిచటం చాలా కష్టం. చాలా మంది రొమ్ము కాన్సర్‌ను చివరి దశలో గుర్తిస్తున్నారు. కాన్సర్‌ ముదిరిన తర్వాత గుర్తించడం వలన చికిత్సను అందించినా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల లక్షణాలు గుర్తించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోవటం మంచిది.

గర్భాశయ క్యాన్సర్‌

గర్భాశయ క్యాన్సర్‌ మహిళల్లో కనిపించే రెండవ అతి పెద్ద జబ్బు. ఇది 2019 సంవత్సరంలో ప్రధానంగా 35 – 39 సంవత్సరాల మధ్య ఉన్న 60 వేల మంది మహిళలు చనిపోవటానికి కారణమయింది.  అందువల్ల దీనిపట్ల మహిళలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ప్రపంచంలోని గర్భాశయ క్యాన్సర్ మరణాల్లో దాదాపు నాలుగో వంతు భారతదేశంలోనే నమోదవుతున్నాయి. అయితే దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే సులభంగా నివారించే అవకాశాలు చాలా ఉంటాయి. కొన్ని లక్షణాలను బట్టి గర్భాశయ కాన్సర్‌ను సులభంగానే గుర్తించవచ్చు. గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించి వైద్యుల సలహాలను, సూచనలను పాటిస్తే దాని నుంచి సులభంగా గట్టెక్కవచ్చు.

అల్జీమర్స్

భారతదేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న వ్యాధి ఏదైనా ఉందంటే అది అల్జీమర్స్‌. భారతదేశంలో దాదాపు 40 లక్షల మంది అల్జీమర్స్‌ వ్యాధి బారినపడ్డారు. చైనా, అమెరికా తర్వాత భారతదేశంలోనే అల్జీమర్స్‌ వ్యాధి గ్రస్తులు ఎక్కువ. 2030 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అల్జీమర్స్‌ అంటే మెదడులో కణాలు చనిపోతుండటం వలన వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీని వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం దెబ్బతింటాయి. జరిగిన సంఘటనలను మరిచిపోతుంటారు. మొదట మరిచిపోవటంతో ప్రారంభించి క్రమంగా చివరకు వ్యక్తి తనెవరో తెలియని స్థాయికి ఈ మతిమరుపు విస్తరిస్తుంది.

అల్జీమర్స్‌ లక్షణాలు

జరిగిన విషయాలను మర్చిపోతుడటం. ఏదైనా విషయాన్ని సరిగ్గా గుర్తుంచుకోలేకపోటం. సరిగ్గా మాట్లాడలేకపోవటం, మాటల్లో తడబాటు, తినటం, స్నానం చేయటం లాంటివి మర్చిపోవటం,
చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేకపోవటం, మనస్తత్వంలో మార్పులు రావటం, ఎక్కువగా భయపడుతుండటం, అయోమయానికి గురవటం.

ఈ వ్యాధి బారి నుండి తప్పించుకోవటానికి, రెండు రకాల మందులు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వ్యాధి ప్రారంభంలో గుర్తించి, జాగ్రత్తలు తీసుకుంటే ఈ మందులు బాగా ఉపయోగపడతాయి. ఇవి జ్ఞాపకశక్తి క్షీణించటం, తికమకపడటం వంటి వ్యాధి లక్షణాలను కొన్నింటిని అదుపు చేస్తుంది. ఇవి కాకుండా అల్జీమర్స్ వ్యాధిని తగ్గించే చికిత్సలేవి అందుబాటులోకి రాలేదు.

గర్భధారణ సమస్యలు

ప్రెగ్నెన్సీ సమయంలో మొదటి ఐదు నెలల చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్లు తిరగడం, వాంతులు వంటి సమస్యలు సహజంగా ఎదురవుతుంటాయి. దీనివల్ల పెద్ద సమస్యలేమి ఉండవు. కానీ ఆఖరి రెండు నెలల్లో కళ్లు తిరిగినట్లు అనిపించినా, కంటి చూపు మందగించినట్లు ఉన్నా డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.

గర్భం దాల్చిన తర్వాత వజైనల్‌ డిశ్చార్జ్‌ సాధారణంగానే కనిపిస్తుంది. కానీ నీళ్లు నీళ్లుగా ఎక్కువగా కనిపిస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

డిప్రెషన్‌

ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని కలవరపెడుతున్న వ్యాధి డిప్రెషన్‌. వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్యలకు ప్రేరేపించే ఈ వ్యాధి ఇప్పుడు ఇండియాకు శాపంగా మారింది. ఒంటరితనం, ప్రేమలో విఫలం అవ్వటం, నిరుద్యోగం ఇలా ఇన్నో కారణాలు మనుషులను డిప్రెషన్‌లోకి నెడుతున్నాయి.

డిప్రెషన్‌లో ఉన్నవారు ఎవరైన మీ చుట్టు పక్కలా ఉంటే వారికి ధైర్యం చెప్పటం లాంటివి చేస్తే తొందరగా డిప్రెషన్‌ నుండి కోలుకుంటారు. వారిని ఎక్కువగా ఒంటరిగా ఉంచకూడదు. మానసిక వైద్యులకు చూపించి కౌన్సిలింగ్‌ ఇప్పించటం ద్వారా సాధారణ జీవితం గడిపే అవకాశాలు ఉన్నాయి.

Previous articleమూడు ఆవులు… మూడు గొర్రెలు.. ఒక ఎమ్మెల్యే
Next articleహిట్టయినా ఫట్టయినా ఓటీటీయే దిక్కా