హిట్టయినా ఫట్టయినా ఓటీటీయే దిక్కా

2020 లాక్‌డౌన్‌ ముందువరకు ప్రేక్షకులకు ఓటీటీలు పరిచయం ఉన్నా.. అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ లాక్‌డౌన్‌ సమయంలో ఈ వేదికలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దాదాపు చాలా సినిమాలు వీట్లోనే విడుదలయ్యాయి. 2020 లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లు తెరుచుకుంటాయో? లేదో? తెరుచుకున్నా వస్తారో? రారో? అన్న సందేహంతో దర్శక, నిర్మాతలు ఓటీటీలలో తమ సినిమాలను విడుదల చేశారు.

థియేటర్‌లోనే సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం ఓటీటీ వేదికలకు అలవాటు పడిపోయారు. దానికి కారణం థియేటర్లు లేకపోవటంతో ఇక తమకు ఉన్న ఒకే ఒక్క దారి ఈ ఓటీటీలు.

నచ్చిన ఓటీటీ వేదికలో సభ్యత్వం తీసుకోవడం… దాన్ని ఇద్దరు లేదా ముగ్గురు స్నేహితులు కలిసి పంచుకుంటూ వారికి నచ్చిన సినిమాల్ని చూసేంతలా అలవాటైపోయింది. తెలుగు సినిమాలే కాదు, ఆయా వేదికల్లో అందుబాటులో ఉన్న ప్రపంచ సినిమాల్ని, వెబ్‌సిరీస్‌ల్ని ఇలా వేటినీ వదలిపెట్టకుండా చూసేసినవాళ్లు చాలామందే.

అది గమనించిన నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీ వేదికల్లో విడుదల చేసుకోవడమే మేలనే అభిప్రాయానికొచ్చారు. ప్రేక్షకుల ఆదరణని దృష్టిలో ఉంచుకుని ఓటీటీ వేదికల ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు రూ. వందల కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన సినిమాలని సైతం సొంతం చేసుకునేందుకు ఈ ఓటీటీలు ఆసక్తి చూపించాయి.

అలా నిర్మాతలకీ, ఓటీటీ యాజమాన్యాలకీ మధ్య బేరాలు కుదరడంతో చాలా చిత్రాలు ఆ వేదికల ద్వారా తమ సినిమాలను విడుదల చేసారు.

ఓటీటీల ద్వారా విజయాలను సాధించలేకపోయారా?

2020లో లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీల ద్వారా విడుదలైన సినిమాలు చాలానే ఉన్నాయి. తెలుగులో అయితే నాని  కథనాయకుడిగా ‘వి’, రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’, అనుష్క ‘నిశ్శబ్దం’, సత్యదేవ్‌ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మొదలుకొని ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘పెంగ్విన్‌’ తదితర చిత్రాలు రకరకాల వేదికల ద్వారా విడుదలై ప్రేక్షకుల్ని పలకరించాయి.

కానీ ఈ సినిమాలేవి అంతగా ప్రేక్షకులు ఆదరణ పొందలేదనే చెప్పాలి. ఊహించనంత విజయాన్ని రాబట్టలేకపోయయి. లాక్‌డౌన్‌ ముగిసాక విడుదలైన సినిమాలు ఘన విజయాలను సాధించాయి.

అందుకే కాబోలు చాలా మంది దర్శక, నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయటానికి సిద్ధ పడట్లేదు.

థియేటర్ల ద్వారా కాసుల వర్షం కురిపించిన సినిమాలు

లాక్‌డౌన్‌ ముగిసాక.. ముఖ్యంగా నాలుగు నెలల కాలంలో విడుదలైన కొన్ని సినిమాలు ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి. అవే సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్‌’ మొదలుకొని మొన్ననే విడుదలైన ‘వకిల్‌ సాబ్‌’ వరకు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పలు సినిమాలు బ్లాక్‌ బస్టర్ అయ్యాయి.

అందులో క్రాక్‌, ఉప్పెన, జాతిరత్నాలు, వకిల్‌ సాబ్‌ సినిమాలు కూడా ఉన్నాయి. ఇవి అనుకున్న దాని కంటే బాగా సక్సెస్‌ అయి.. నిర్మాతలకు కాసులు తెచ్చి పెట్టాయి. సినిమా బాగుదంటే ప్రేక్షకులు దేన్నీ లెక్క చేయకుండా థియేటర్లకి వస్తారనే సంగతి రుజువైంది. అందుకే విడుదలకి సిద్ధంగా ఉన్న కొత్త సినిమాలని, కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయడానికి నిర్మాతలంతా మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ అంతకంతకు పెరుగుతుండటంతో థియేటర్లు మూతపడ్డాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కాలం లాక్‌డౌన్‌ విధించాయి. కానీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు చాలా వరకు ఆగిపోయాయి.

వేచి చూసే ధోరణి

లవ్‌స్టోరి, టక్‌ జగదీష్‌, విరాటపర్వం, ఇష్క్‌ తదితర సినిమాలు ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

దృశ్యం 2, నారప్ప, ఖిలాడి, అఖండ, ఆచార్య చిత్రాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇవన్నీ మేలో విడుదల కోసం సిద్ధమైనవే. కానీ కరోనా విజృంభించటంతో ఈ సినిమాలు వాయిదా పడ్డాయి.

దీంతో పలు ఓటీటీలు సినీ దర్శక, నిర్మాతలను ఆశ్రయిస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ క్రాక్‌ సినిమాను ఓటీటీ రిలీజ్ కోసం రూ. 45 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. గతంలో రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీని ఓటీటీ ఆఫర్ వచ్చినా.. డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదల చేసి మంచి ఫలితాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ కరోనా సెకండ్ వేవ్ తగ్గేంత వరకు వేచి చూస్తారా.. అమెజాన్ ఓటీటీ ఆఫర్‌కు ఓకే చెబుతారా అని చూడాలి. మొత్తంగా థియేటర్స్‌ మూత పడటంతో ఇపుడు పెద్ద హీరోల సినిమాలకు భారీ ఓటీటీ ఆఫర్స్ తలుపు తడుతున్నాయి.

కరోనా తర్వాత దేశంలో ఎక్కువ లాభాలు ఆర్జించిన పరిశ్రమ తెలుగే. అందుకే రెండో దశ కరోనా తర్వాత మునుపటిలా థియేట్రికల్‌ వ్యాపారంలో పుంజుకుంటామనే ధీమాతో ఉన్నాయి తెలుగు సినీ వర్గాలు. అందుకే కొత్త సినిమాల్ని గతేడాది తరహాలో ఆ వేదికల ద్వారా విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు చాలా మంది నిర్మాతలు. కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయాలనే సంకల్పంతో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం థియేటర్లు మూసి ఉండటంతో వినోదం కోసం మళ్లీ ఓటీటీని ఆశ్రయిస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ వేదికల ద్వారా ఆనసూయ నటించిన థాంక్యూ బ్రదర్‌ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం మంచి పేరునే సంపాదించుకుంది.

విడుదలవుతున్న చిన్న చిత్రాలు

ఇప్పుడు ఈ బాటలోనే ప్రేక్షకులను ఆలరించడానికి దాదాపు ఆరడజను వరకు చిన్న సినిమాలు ఓటీటీల ద్వారా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. అయితే ఈ సమయంలో ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణను చూసిన నిర్మాతలు ఓటీటీ వేదికలను అందుబాటులోకి తీసుకురావటానికి ఆలోచిస్తున్నారు.

ఆ కోవకే చెందిన వారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. ఆహా పేరుతో తొలి తెలుగు ఓటీటీని అందుబాటులోకి తీసుకొచ్చారు స్టార్‌ ప్రొడ్యూసర్‌. ప్రస్తుతం ఆహా సేవలు ఓ రేంజ్‌లో దూసుకెళుతున్నాయి.

స్పార్క్‌ ఓటీటీలో ఈ వారం రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘డి-కంపెనీ’ విడదలవనుంది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావుద్‌ ఇబ్రహీం నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమిది.

ఒకప్పడు సౌత్‌ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్న ముద్దుగుమ్మ నమిత కూడా ఓటీటీ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. తన పేరుతోనే ఓటీటీ యాప్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. నమిత థియేటర్‌ పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఓటీటీకి నమిత బ్రాండ్‌ పార్టనర్‌ కాగా.. రవివర్మ అనే అతను మేనేజింగ్‌ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రవివర్మ ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.

నిజ జీవితంలో జరిగే సంఘటనల, కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు, అదే విధంగా షార్ట్‌ ఫిల్మ్‌లకు ఇందులో ప్రత్యేకంగా ఎంట్రీ ఉంటుంది. ఈ ఓటీటీ ద్వారా చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులను ఎక్కవగా ప్రోత్సహించనున్నట్లు నమిత ప్రకటించారు.

దాంతో పాటు అక్కినేని నాగార్జున ఓటీటీని రంగంలోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి వస్తోన్న ఈ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ యాప్‌పై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఈ వారం ఓటీటీ వేదికగా మూడు తెలుగు సినీమాలు విడదలవుతున్నాయి. ప్రముఖ దర్శకులు రాజ్‌ డీకే నిర్మించిన ‘సినిమా బండి’, దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించిన ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘డి-కంపెనీ’ సినిమాలు ఈ వారంలోనే ఓటీటీలో విడుదలవుతున్నాయి. ప్రవీణ్‌ కంద్రెగుల దర్శకత్వంలో రూపొందిన ‘సినిమా బండి’ మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం విడుదలైంది.

అదే రోజు జీ5 ‘ఓటీటీలో బట్టల రామస్వామి బయోపిక్కు’ విడుదలైంది. 20న హాట్‌స్టార్‌లో ‘నవంబర్‌ స్టోరీ’ వెబ్‌సిరీస్‌ రిలీజ్‌ కానున్నాయి. అలానే నితిన్‌ నటించిన చెక్‌ సినిమా ఫిబ్రవరిలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా సన్‌నెక్ట్స్ ఓటీటీలో సందడి చేయనుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నడుస్తుండటంతో దర్శక, నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు వేచి ఉంటారా లేక ఓటీటీలలో విడుదల చేస్తారో వేచి చూడాల్సిందే.

Previous articleమహిళలకు ఎక్కువగా వచ్చే జబ్బులు ఇవే
Next articleIsraeli Palestinian conflict: ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధం.. అసలు వివాదం నేపథ్యం ఇదీ…