మీరు నిజంగా స్మోకింగ్ ఎలా మానేయాలి? మానేస్తే ప్రయోజనాలు ఏమిటి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఎవరితోనైనా మాన్పించాలనుకున్నా ఈ కథనం చదవండి. వారు ఆచరించేలా చేయండి. స్మోకింగ్ ఎంత డేంజరో స్మోక్ చేసే వాళ్లందరికీ తెలుసు. కానీ స్మోకింగ్ చేయడం మానేయలేరు. ఎన్నోసార్లు మానేయడానికి ప్రయత్నించి మళ్లీ మొదలుపెట్టే వాళ్లు కూడా చాలా మందే ఉంటారు. ఇలాంటి వాళ్లలో స్మోకింగ్ కచ్చితంగా మానేయాలన్న సీరియస్‌నెస్ కనిపించదు. పైగా స్మోకింగ్ మానేస్తావా.. నేను ఇప్పటికే చాలాసార్లు మానేశాను తెలుసా అంటూ అవతలి వాళ్లను వెక్కిరిస్తూ జోకులేస్తుంటారు.
మానేయాలని చాలా సార్లు అనుకొని విఫలమవుతున్నారా? కాస్త గట్టిగా అనుకోవాలే కానీ సిగరెట్లకు దూరం కావడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా దీనివల్ల మీరేమీ కోల్పోవడం లేదు. మీ ఉద్యోగాన్నో, మీ ఆస్తినో, మరో విలువైన దాన్నో వదులుకోవడం లేదు. మీ ఆరోగ్యాన్ని పాడు చేసే, మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేసే ఓ మహమ్మారి నుంచి బయటపడుతున్నారు. అంతే.. నిజానికి స్మోకింగ్ మానేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కాకపోతే వీటిని పాటించడానికి కాస్త విల్ పవర్, ఇంకాస్త హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి మీరు సిద్ధమైతే.. సిగరెట్ ఎలా మానేయాలన్నదానిపై డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీ చూడండి.
ఎందుకు విఫలమవుతున్నారు?
మీరు గతంలో పలుసార్లు స్మోకింగ్ మానేయాలని ప్రయత్నించి విఫలమై ఉంటారు. దానికి కారణాలు గుర్తించండి. అందులో ప్రధానమైన కారణాలు కొంచెం ఒత్తిడి, లేదా ఎవరితోనైనా మాటామాటా పెరిగినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్తితి తలెత్తినప్పడు, ఆర్థిక లేదా ఇతర సమస్యలు వచ్చినప్పుడు, లేదా ఆఫీసు ఇబ్బందులు, లేదా కుటుంబ సమస్యలు తలెత్తినప్పుడు విఫలమై ఉంటారు. నెలల తరబడి మానేసి ఉన్నా మళ్లీ మొదలుపెట్టి ఉంటారు. లేక మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆల్కహాల్ తో పాటు మళ్లీ సిగరెట్ తాగడం మొదలపెట్టి ఉంటారు.
మళ్లీ ప్రయత్నించాలనుకుంటున్నారా?
ముఖ్యంగా చెయిన్ స్మోకర్స్‌కు సిగరెట్ మానేయడం కాస్త కష్టమైన విషయం. అలాంటి వాళ్లు ముందుగానే ఓ డేట్ ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగని వచ్చే ఏడాదో.. ఇంకో రెండేళ్లకో చూద్దాం అనుకోకండి.. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి కావాల్సిన అతి తక్కువ టైమ్ చూసి ఆ రోజును డిసైడ్ చేయండి. ఇప్పుడు మీ ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి.
– ఒకటి అప్పటికప్పుడు సిగరెట్ మానేయడం లేదా మీరు అనుకున్న రోజు వరకు స్మోక్ చేసి తర్వాత మానేయడం
– రెండోది మెల్లగా సిగరెట్ల సంఖ్యను తగ్గిస్తూ వచ్చి మీరు అనుకున్న రోజు మొత్తానికే ఫుల్స్టాప్ పెట్టడం
వెంటనే మానేయడమా లేక మెల్లగా తగ్గిస్తూ రావడమా అన్నది మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు సిగరెట్ మానేసే రోజు దగ్గర పడుతున్న కొద్దీ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతోంది. అవేంటో ముందు చూడండి.
– అసలు సిగరెట్ ఎందుకు మానేయాలని అనుకుంటున్నారో ఆ కారణాలను ఓ పేపర్‌పై రాసి ఉంచండి. ఆ పేపర్‌ను సాధారణంగా మీరు సిగరెట్ డబ్బా ఎక్కడ పెడతారో అక్కడ ఉంచండి.
– పలానా రోజు నేను సిగరెట్ మానేస్తున్నాను అని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్‌తో కచ్చితంగా చెప్పండి. ఇది ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. అందరికీ చెప్పిన తర్వాత మళ్లీ స్మోక్ చేస్తే మీ మాటకు విలువుండదు. ఇదొక్క విషయానికే అది పరిమితం కాదు. మీరు ఏం చెప్పినా.. వాళ్లు తేలిగ్గా తీసుకునే పరిస్థితి వస్తుందని గుర్తుంచుకోండి.
– కొంతమందికి ఎప్పుడూ ఓ సిగరెట్ ప్యాకెట్‌ను వెంట పెట్టుకోవడం అలవాటు. ముందు వాటిని తీసి బయట పారేయండి. ఆష్ ట్రే వాడే అలవాటుంటే.. దాన్ని కూడా చెత్త బుట్టలో వేయండి.
– స్మోకింగ్ ఎలా మానేయాలి? అని చర్చించే గ్రూప్స్ కొన్ని ఉంటాయి.. మీకు ఇష్టమైతే వాటిలో చేరండి.
– అంతకుముందే స్మోకింగ్‌ను విజయవంతంగా మానేసిన వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వాళ్ల నుంచి మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు.
– ఇంతకుముందే సిగరెట్ మానేయాలని మీరు అనుకొని ఉంటారు కదా.. అప్పుడు ఏవి వర్కవుట్ అయ్యాయి.. ఏవి కాలేదు అన్నది ఆలోచించుకోండి.
ఆ రోజు ఏం చేయాలి?
మీరు స్మోకింగ్ మానేయాలి అనుకున్న రోజు వస్తుంది. ఆ రోజు అస్సలు సిగరెట్ కాల్చొద్దు. రోజంతా బిజీగా ఉండేలా ముందే ప్లాన్ చేసుకోండి. నీళ్లు, జ్యూస్‌లు ఎక్కువగా తాగండి. ఒకవేళ మీరు అప్పటికే ఏదైనా స్టాప్ స్మోకింగ్ గ్రూప్‌లో చేరి ఉంటే.. ఆ రోజు వాళ్లను కచ్చితంగా కలవండి.
సిగరెట్ తాగే అలవాటున్న వాళ్లను అసలు కలవొద్దు. ఒకవేళ మీకు మందు తాగే అలవాటు ఉంటే.. ఆ రోజు దాని జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇన్ని చేసినా.. మానేయాలని అనుకున్న రోజు స్మోక్ చేయాలని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. అయితే ఆ ఆలోచనను ఇలా అధిగమించవచ్చు.
ఇలా అధిగమించండి
- స్మోకింగ్ ఆలోచన రాగానే కాస్త ఆగండి. సాధారణంగా ఈ ఆలోచనలు మూడు నుంచి ఐదు నిమిషాల వరకే ఉంటాయి. ఆ తర్వాత వెళ్లిపోతాయి. అందువల్ల ఈ ఆలోచన వచ్చిన వెంటనే టెంప్ట్ అవకుండా ఆ ఐదు నిమిషాలు మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటే చాలు.
- ఇక గట్టిగా ఊపిరి పీల్చి వదలడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ముక్కు ద్వారా గాలిని పీల్చి.. నోటి ద్వారా వదిలితే క్రమంగా మీ మెదడు అన్ని ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడుతుంది. ఇలా కనీసం పదిసార్లు చేయండి.
- నీళ్లు తాగండి. అయితే గబగబా కాకుండా.. మెల్లమెల్లగా టీనో, కాఫీనో సిప్ చేసినట్లుగా తాగితే ప్రయోజనం ఉంటుంది.
- ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఎవరికైనా ఫోన్ చేయండి. కాసేపు ఏదో ఒకటి మాట్లాడండి.
స్మోకింగ్ మానేశారు.. ఇప్పుడేంటి?
ఇప్పుడే మీకు అసలు పరీక్ష మొదలయ్యేది. మానేసిన తర్వాత కొన్ని గంటలు, రోజులు ఎలా గడుపుతారు అనేదానిపైనే మీకు మాజీ స్మోకర్ ట్యాగ్ వస్తుందా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. అంతకన్నా ముందు సిగరెట్ వదిలేసిన తర్వాత మీ శరీరంలో వచ్చే మార్పుల గురించి మీరు తెలుసుకోవాలి. స్మోకింగ్ మానేయగానే మీ శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి. వీటినే నికొటిన్ విత్ డ్రాయల్ సింప్టమ్స్ అంటాం. మీ శరీరంలో నుంచి నికోటిన్ వెళ్లిపోతున్న కొద్దీ మీకు తొలుత సమస్యలు మొదలై ఆ తరువాత జీవితం సుఖమయం అవుతుంది.
స్మోకింగ్ మానేసిన తరువాత కలిగే ప్రయోజనాలు
- 20 నిమిషాల్లోనే మీ హార్ట్ బీట్, బీపీ తిరిగి సాధారణ స్థితికి వస్తుంది.
- 8 గంటల్లో మీ శరీరంలోని నికోటిన్ సగానికి తగ్గుతుంది. కార్బన్ మోనాక్సైడ్ సగానికి పైగా తగ్గుతుంది.
- 48 గంటలు గడిస్తే మీ నోటికి అసలైన రుచి తెలుస్తుంది. మీ శరీరంలో క్లీనింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ముఖ్యంగా మీ శ్వాసనాళాలు శుభ్రపడడం ప్రారంభమవుతుంది.
- రెండు వారాల్లో మీ రక్త ప్రసరణ మెరుగవుతుంది. తరచూ దగ్గు రావడం ఆగిపోతుంది.
- కాకపోతే వీటితోపాటు కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయి. ఆందోళన, తలనొప్పి, జలుబు, దగ్గు , నిద్ర సరిగా పట్టకపోవడం, ఆకలి, చిరాకు వంటి తాత్కాలిక సమస్యలు మిమ్మల్ని పరీక్షిస్తాయి. ఈ సమయంలో మరింత గట్టిగా ఉండాలి.
- 72 గంటలు గడిస్తే మీరు తేలిగ్గా శ్వాస తీసుకుంటారు. మీ ఊపిరితిత్తులకు కొత్త బలం సమకూరుతుంది.
- రెండు వారాల నుంచి మూడు నెలల్లో మీ రక్తప్రసరణ చాలా మెరుగవుతుంది. తొలుత మీ చక్కెర స్థాయిల్లో మార్పులు ఉన్నా.. కాలక్రమంలో మీ చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకుంటాయి. మీకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం క్రమంగా తగ్గుతుంది.
- 3 నుంచి 9 నెలల్లో మీకు కొత్త శక్తి వస్తుంది. మీ శ్వాస సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
- ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల కాలం గడిస్తే మీరు గతంలో ఎప్పుడూ స్మోకింగ్ చేయనివారుగా మారిపోయినట్టే. అంటే అనేక వ్యాధులకు మీరు దూరం అయినట్టే.
అసలు ఓ స్మోకర్ తన చివరి సిగరెట్ కాల్చిన తర్వాత గంటలోనే శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని పలు పరిశోధనలు తేల్చాయి. మూడు గంటల్లోనే ఆందోళన, ఒత్తిడి, బాధ, ఏ పనిపైనా ఏకాగ్రత కుదరకపోవడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి మరీ ఎక్కువ రోజులు ఏమీ బాధించవు. తొలి మూడు రోజుల్లోనే చాలా వరకు నికోటిన్ మీ శరీరంలో నుంచి వెళ్లిపోతుంది. ఇది రెండు వారాల వరకు ఉంటుంది. ఈ రెండు వారాలు మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. తర్వాత మీ పని కాస్త సులువు అవుతుంది.
జస్ట్ ఇదొక్కటే.. అస్సలు వద్దు
చాలా మంది స్మోకర్స్‌కు ఉండే అలవాటు ఇది. అసలు సిగరెట్ మానేసిన వాళ్లు కూడా మళ్లీ దానికి బానిసలవడానికి ప్రధాన కారణాల్లో ఈ ఆలోచన కూడా ఒకటి. సిగరెట్ మానేసిన తర్వాత ఎప్పుడైనా మళ్లీ స్మోక్ చేయాలనిపిస్తే.. ఒక్కటి కాలుద్దాం.. ఈ ఒక్కదానికీ ఏమవుతుందిలే అని చాలా మంది అనుకుంటారు. కానీ అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. అసలు సిగరెట్ ఓ వ్యసనంలా మారడానికి కారణం అందులోని నికొటిన్. అది ఒక్కసారి టేస్ట్ చూసి వదిలేద్దాంలే అనుకుంటే వదిలిపెట్టేది కాదు. అసలు మీకు కూడా స్మోకింగ్ అలవాటైంది ఇలాగే అని గుర్తుంచుకోండి. అందుకే ఒక్కటే కదా అన్న ఆలోచనను దూరం పెట్టండి.
సబ్స్టిట్యూట్స్ ఏమీ లేవు.. మానేయడమే..
చాలా మంది సిగరెట్ మానేయడానికంటూ వేరే అలవాట్లు చేసుకుంటారు. నికొటిన్ ఉన్న చూయింగ్ గమ్స్ అని, పాచెస్ అని, నాజల్ స్ప్రేస్ అని, ఈ-సిగరెట్లని.. ఇలాంటివి మీకు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. అసలు మీరు వీటిని ఎప్పుడు తీసుకుంటున్నారు.. సిగరెట్ తాగాలని అనిపించినప్పుడే కదా. అలాంటప్పుడు సిగరెట్‌ను బలవంతంగా త్యాగం చేస్తున్నామన్న ఫీలింగ్ వీటిని తీసుకున్నప్పుడల్లా మీకు కలుగుతుంది. ఇది మెల్లగా మళ్లీ సిగరెట్ వైపు మనసు మళ్లేలా చేస్తుంది. పైగా ఈ నికొటిన్ సబ్స్టిట్యూట్స్ వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కాస్త ఎక్కువో, తక్కువో.. మీ శరీరంలోకి ప్రమాదకర నికొటిన్ వెళ్తూనే ఉంటుంది. స్మోకింగ్ ఎలా మానేయాలి? అని చర్చించే ఫోరంలలో ఇప్పటికే మానేసిన గాథలు తెలుసుకోండి. ప్రత్యామ్నాయాలేవీ లేవని అర్థమవుతుంది.
ఆలోచించొద్దు అనుకోకండి.. వర్కవుట్ కాదు
మీరు ప్రత్యేకంగా ఓ విషయం గురించి అస్సలు ఆలోచించొద్దు అనుకున్నారు అనుకోండి.. ఏమవుతుంది? కచ్చితంగా అదే ఆలోచన మీలో కలుగుతుంది. ఇది కూడా అంతే.. స్మోకింగ్ మానేసిన తర్వాత అస్సలు దాని గురించి ఆలోచించొద్దు అని అనుకుంటారు. కానీ అది వర్కవుట్ కాదు. మీరు ఎంతగా ఆ ఆలోచన రావద్దు అనుకుంటారో.. అంత ఎక్కువగా వస్తుంది. అందువల్ల స్మోకింగ్ ఆలోచన రానివ్వండి. కాకపోతే ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా అయ్యో నా దగ్గర సిగరెట్ లేదే అనుకోకుండా.. నేనిప్పుడు సిగరెట్ మానేశాను కదా.. నాకు దాని అవసరం లేదు అనుకోండి చాలు.
వాటి జోలికి వెళ్లకండి
సిగరెట్ అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికీ స్మోకింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఓ ప్లేస్ ఉంటుంది. కొంతమంది బార్‌కు వెళ్తే ఎక్కువగా సిగరెట్లు కాల్చేస్తుంటారు. కొందరికి టీతోపాటు స్మోక్ చేసే అలవాటు ఉంటుంది. ఇలాంటి ప్లేస్‌లకు వెళ్లినపుడు స్మోక్ చేయాలన్న ఆలోచన మరింత ఎక్కువగా వస్తుంటుంది. ముందు వాటిని గుర్తించండి. ఆ ప్లేస్‌లకు కొన్నాళ్లు దూరంగా ఉండండి.
నడవండి.. పరుగెత్తండి..
స్మోక్ చేయాలని అనిపించినప్పుడల్లా కాస్త ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. వాకింగ్, జాగింగ్‌తోపాటు కొన్నిసార్లు ఊరికే అలా మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండండి.. కచ్చితంగా మీలో స్మోక్ చేయాలన్న ఆలోచన తగ్గిపోతుంది. ఇంట్లో ఉన్నా.. ఆఫీస్‌లో ఉన్నా.. ఇలాంటివి చేయొచ్చు.
లాభమే.. నష్టం కాదు..
స్మోకింగ్ మానేయడం అనేది అన్ని విధాలుగా మీకు లాభం చేకూర్చేదే తప్ప నష్టం కలిగించేది కాదు. అందువల్ల తరచూ మీకు కలిగిన లాభాల గురించి గుర్తు చేసుకుంటూ ఉండండి. అంటే.. స్మోకింగ్ మానేసిన తర్వాత నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను.. నా శరీరంలో సానుకూల మార్పులు వస్తున్నాయి.. పైగా సిగరెట్ల కోసం పెట్టిన ఖర్చు కూడా ఆదా చేయగలిగానులాంటి విషయాలను గుర్తు చేసుకోండి. కావాలంటే వీటిని ఓ పేపర్‌పై రాసి పెట్టుకోండి. అప్పుడప్పుడూ వాటిని చూస్తూ ఉండండి.
మందులూ ఉన్నాయి
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రెండు నాన్ నికోటిన్ మందులను స్మోకింగ్ మానేయడానికి సిఫారసు చేస్తోంది. నికోటిన్ మీ శరీరంలో నుంచి వెళ్లిపోయే సమయంలో కనిపించే లక్షణాలను కూడా ఇవి నియంత్రిస్తాయి. మీ వ్యక్తిగత డాక్టర్‌ను సంప్రదించి ఈ మందులను ట్రై చేస్తే మంచిది.
కాకపోతే అన్ని మందులలాగే వీటితోనూ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒత్తిడి, ప్రవర్తనలో మార్పులతోపాటు ఒక్కోసారి దూకుడుగా కూడా వ్యవహరిస్తుంటారు.
తమకు తాముగా సిగరెట్‌ను మానేయడం కుదరడం లేదు అనుకున్న వాళ్లే ఈ మందుల జోలికి వెళ్లడం మంచిది. కేవలం తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి సమస్యలు ఉంటే ఆమేరకు వైద్యుడి సలహా తీసుకోండి.
మీలో ఒక యోధుడిని చూడండి
మీరు ఒక పోరాటం చేస్తున్నట్టుగా భావించండి. మీకు ఈ స్మోకింగ్ తో ఇప్పటివరకు ఎదురైన పరాభవాలు, భవిష్యత్తులో చేకూరే విజయాలు చూడండి. ఈ దురలవాటుతో మీరు సమాజంలో, కుటుంబంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తించండి. స్మోకింగ్ మానేస్తే తగ్గే ఖర్చును పొదుపుగా మార్చి మీ కుటుంబ ప్రయోజనాలకు వాడితే బాగుంటుందని గుర్తించండి.
చివరగా ఒక్క మాట.. మీరు సిగరెట్ ఎందుకు మానలేకపోతున్నారంటే..
ఇక జన్మలో ఎప్పుడూ ఇలా తాగే వెసులుబాటు ఉండదన్న భావనే మిమ్మల్ని మానకుండా అడ్డుకుంటోంది. కానీ ఒక్కసారి మీ కోసం.. మీ పై ఆధారపడిన మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం ఆలోచించి మానేయండి. మానేశాక దానిలో ఉన్న అద్భుతాన్ని చవిచూడండి.
మానేస్తే మీకు మీరు ఒక గొప్ప బహుమతి ఇచ్చుకున్నట్టే..
మీ ప్రయత్నాలు సఫలమవ్వాలని ఆశిస్తున్నాం. స్మోకింగ్ ఎలా మానేయాలి? అని ఆలోచిస్తున్న మీ బంధు మిత్రులకు ఈ కథనం షేర్ చేయడం మరవకండి.
ఇవి కూడా చదవండి