చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించారన్న వార్తలు మనం తరచుగా వింటున్నాం. ఈ రోజుల్లో మారుతున్న జీవన శైలిలో అనేక అనారోగ్య సమస్యల బారిన పడడం సర్యసాధారణమైపోయింది. వయసుతో సంబంధం లేకుండా రకరకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. అందులో ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులే ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1 కోటీ 79 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధుల వలనే చనిపోతున్నారంట..
గుండె శరీర అవయాలకు రక్తం ద్వారా ఎన్నో పోషకాలను, ఆక్సీజన్‌ను అందిస్తుంది. అయితే యుక్త వయసులోనే ఎక్కువ మంది ఈ గుండె పోటు మరణాల బారిన పడుతుండడం అత్యంత ఆందోళన, బాధను కలిగిస్తున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన శరీర భాగాలన్నీ కూడా సరైన పద్ధతిలో పనిచేస్తుంటాయి. అందువల్ల గుండెను కాపాడుకోవడంలో ప్రతి మనిషి నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అసలు గుండెపోటు ( హార్ట్ ఎటాక్) అంటే ఏమిటీ? ఎలా వస్తుంది? దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
గుండెపోటు లక్షణాలు ఏంటి?
గుండెకు రక్తాన్ని సరఫరా రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల గుండె పనితీరు స్తంభించడాన్ని గుండెపోటు (హార్ట్ ఎటాక్ ) అంటారు.
దీని లక్షణాలు:
- ప్రధానంగా ఛాతిలో నొప్పి రావడం
- ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది పడడం
- ఛాతీ బరువుగా అనిపించడం
- ఎడమ చేయి, ఇంక ఎడమ డవడ నొప్పిగా ఉండడం
- విపరీతంగా చెమటలు పట్టడం
- మెడ మరియు భుజాల వరకూ నొప్పి, తిమ్మిరి, లాగుతూ ఉండడం
- నడిచేటప్పుడు గుండె నొప్పి అధికంగా మారి ఉన్నట్టుండి పడిపోవడం
గుండెపోటుకు ప్రధాన కారణాలు:
- ఒబెసిటి (అధిక బరువు) కలిగి ఉండడం
- మధుమేహం (షుగర్)
- అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రజర్ )
- స్మోకింగ్ ( ధూమపానం )
- కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం
- జన్యుపరమైన కారణాలు
- శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం
గుండెపోటును నియంత్రించే చర్యలు:
- రోజూ మనం తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులు మరియ ఇతర అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. కనుక మొదటగా ఆహరం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. సమతుల్యమైన పోషకాహారం తీసుకోవడం ఉత్తమమైన మార్గం.
- అధిక రక్తపోటు వల్ల గుండెకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రక్తపోటు పెరగడం వల్ల గుండె పనితీరు దెబ్బతిని గుండెపోటు రావడానికి దారితీస్తుంది. రక్తపోటు ఎక్కువ, తక్కువ కాకుండా సరైన క్రమంలో, స్థిరంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలి.
- సమతుల ఆహారం తీసుకోవడమే కాకుండా వయసుతో సంబంధం లేకుండా అందరూ చురుకుగా ఉండాలి. తేలికపాటి వ్యాయామాలు, రోజులో కనీసం 7- 8 గంటలు నిద్ర కలిగి ఉండడం అవసరం.
- మధుమేహం వల్ల కూడా గుండె జబ్బులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్లయితే రక్త నాళాలు దెబ్బతింటాయి. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు మీ చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆహరంలో చక్కెర స్థాయిలు తగ్గించే ఫుడ్ తీసుకోండి.
- మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. మానసికంగా ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో మన శరీర అవయవాలు కూడా తగిన పద్దతిలో పనిచేయగలుగుతాయి. ఎక్కువ ఒత్తిడి వల్ల మన మెదడు రుగ్మతల బారిన పడుతుంది. అప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం అధికం. దీనికోసం మీరు రోజులో కొంత సమయం వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం తప్పనిసరి.
- ఊబకాయం ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. వీరు ఎక్కువగా ఊబకాయం వల్ల గుండెపోటుకు గురవుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి ఆరోగ్యమైన జీవనశైలి అలవాటు చేసుకోండి.
- ధూమపానం మానేయండి. ఆల్కహాల్ పరిమితం చేయండి. తద్వారా మీ జీవనశైలి మెరుగుపరుచుకోండి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్