Heat Stroke preventive foods: మేలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా తినాలి. మరికొన్ని ఆహారాలను తినడం మానేయాలి. మే నెలలో రోహిణి కార్తెలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో రోళ్లు పగిలినంత వేసవి వేడి ఉంటుందని చెబుతూ ఉంటారు.
వడదెబ్బ పడకుండా తినాల్సిన ఆహారాలు
వడదెబ్బ పడకుండా ఉండాలంటే మిమ్మల్ని హైడ్రెటెడ్‌గా ఉంచే ఆహారాలకు ప్రథమ స్థానం ఇవ్వాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి.
- పుచ్చకాయ, కర్బూజా, బెర్రీలు, మామిడి, ద్రాక్ష వంటి పండ్లను అధికంగా తినాలి. ఇవన్నీ కూడా శరీరానికి తేమను అందిస్తాయి. శక్తిని పెంచుతాయి. వేసవిలో కలిగే అలసటను తగ్గిస్తాయి.
- వేసవిలో విపరీతంగా చెమట పట్టేస్తుంది. ఈ చెమట వల్ల శరీరంలోని అవసరమైన లవణాలు బయటికి పోతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి అధికంగా తాగాలి. సలాడ్లను తినడం అలవాటు చేసుకోవాలి.
- వేసవి సీజన్లో మజ్జిగతో పాటు పెరుగు తినడం కూడా ఆరోగ్యమే. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ వేసవిలో పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
- పండ్లు, కూరగాయలతో స్మూతీలను చేసుకుని తింటే శరీరానికి వేసవి కాలంలో వడదెబ్బను తట్టుకునే శక్తి వస్తుంది. రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచుతాయివి.
- ప్రోటీన్ పౌడర్ కలుపుకొని పాలు వంటివి తాగడం కూడా చాలా ముఖ్యం.
- పెరుగులో మామిడిపండు తప్ప మిగతా పండ్లను వేసుకొని తింటే మంచిది. శరీరానికి శక్తి కూడా అందుతుంది.
తినకూడని ఆహారాలు…
- మే నెలంతా ఎండలు మండుతాయి. ఈ నెల రోజులు పాటూ వేపుళ్లకు దూరంగా ఉండండి. ఎండ బారిన పడి వచ్చాక భోజనంలో వేపుళ్ళు తినడం వల్ల శరీరంలో డిహైడ్రేషన్ పెరిగిపోతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.
- సంతృప్తి కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్లు అధికంగా ఉండే ఆహారాలు తగ్గించాలి. ఇది గుండె జబ్బులకు కారణం అవుతాయి.
- వేసవి సీజన్లో ఆల్కహాల్ వంటివి దూరం పెట్టాలి. ఆల్కహాల్ తాగడం వల్ల డిహైడ్రేషన్ పెరిగిపోతుంది. బీర్లు చల్లగా ఉంటాయి కదా, తాగితే మంచిదే కదా అనుకుంటారు. తాగినప్పుడు మాత్రమే అవి చల్లగా ఉంటాయి, పొట్టలో చేరాక అది చలువ చేసే లక్షణాలను కలిగి ఉండదు. కాబట్టి అన్ని రకాల ఆల్కహాల్‌కు వేసవి కాలంలో గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఉంది. ఆల్కహాల్ తాగడం వల్ల అధిక మూత్ర విసర్జన జరుగుతుంది. దీనివల్ల అధిక స్థాయిలో ద్రవాలు బయటికి పోతాయి. వెంటనే డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది.
- వేసవి కాలంలో ఎక్కువ పరిమాణంలో భోజనాలు తినడం మానేయాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినే కన్నా రెండు మూడు గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా తినడం మంచిది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే భారీ భోజనాలు చేస్తే అలసటలా అనిపించి నిద్రా, మగత కమ్మేస్తాయి. దీనివల్ల మీరు పనులు చేసుకోలేరు. అంతేకాదు జీర్ణ వ్యవస్థ పై భారీగా ప్రభావం పడుతుంది.
- వడదెబ్బ పడకుండా తేలిగ్గా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే భోజనం తింటే మంచిది. చక్కెర, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.
- ఎండాకాలంలో ఐస్ క్రీమ్, డిజర్ట్లు, పేస్ట్రీలు, కేకులు, శీతల పానీయాలకు ఓ నెల రోజులు దూరం పెట్టాల్సిందే. ఇవి వేడి వాతావరణం లో అప్పటికప్పుడు ఉపశమనంగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత శరీరానికి చేసే నష్టం ఎక్కువే. పండ్ల రసాలు తాగాల్సి వచ్చినప్పుడు అందులో చక్కెర వేసుకోవడం మానేయండి. స్వచ్ఛమైన పండ్ల రసాలు తాగడమే మంచిది. చక్కెర వేయడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంది. నిమ్మరసం, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి వాటితో ఈ వేసవిని తట్టుకునే శక్తిని పొందాలి.