Walnut health benefits: వాల్నట్స్ వేసవిలో తినమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ఉండే పోషకాలు, వీటి వల్ల కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు విస్తృతమైనవని చెబుతున్నారు. వేసవి వచ్చిందంటే ఆహారంపై ప్రత్యేక దృష్టి అవసరం.ఎక్కువగా ద్రవాహారాలు తీసుకోమని చెబుతూ ఉంటారు పోషకాహార నిపుణులు. దీనివల్ల వడదెబ్బ బారిన పడకుండా ఉంటారని వారి అంచనా. అలాగే కొన్ని రకాల ఆహారపదార్థాలు ప్రత్యేకంగా తినాలి. వాల్నట్స్ ఆకారం మెదడులా ఉంటుంది. విచిత్రం ఏంటంటే వాల్నట్స్ ఆకారమే కాదు, అది చేసే మేలు కూడా మెదడుకే.ఈ వాల్నట్స్ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వాల్నట్స్ ఎలా తినాలి?
వాల్నట్స్ గింజల్లో ఫైబర్, విటమిన్లు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు. అందుకే వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. ఇలా రోజుకు మూడు వాల్నట్స్ తింటే చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నానబెట్టిన వాల్నట్స్ తినడం వల్ల శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. వాల్నట్స్ ఉపయోగాలు ఇక్కడ తెలుసుకోండి.
వాల్నట్స్ ఉపయోగాలు
1. బరువు తగ్గడానికి
బరువు తగ్గడానికి వాల్నట్స్ మంచి మార్గాన్ని చూపిస్తాయి. ఆకలిగా అనిపించినప్పుడు జంక్ ఫుడ్‌ను తినకుండా నీటిలో నానబెట్టిన వాల్నట్స్ తినడానికి ప్రయత్నించండి. ఇవి పొట్ట నిండిన భావనను ఇస్తాయి. దానివల్ల ఇతర ఆహారాలు ఏవీ తినాలనిపించదు. ముఖ్యంగా చక్కెర నిండిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ తినాలన్న ఆసక్తి పూర్తిగా పోతుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. తద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. ఇదే కాకుండా నానబెట్టిన వాల్నట్స్ తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
2. నిద్ర కోసం వాల్నట్స్
వాల్‌నట్స్‌లో మెలటోనిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది మంచి నిద్రను అందిస్తుంది. గాఢమైన నిద్ర పట్టడంలో ప్రధాన పాత్ర మెలటోనిన్దే. నానబెట్టిన వాల్నట్స్ పడుకునే ముందు తింటే మీకు ఆ రాత్రంతా గాఢంగా గడిచిపోతుంది.
3. వాల్‌నట్స్‌తో రోగ నిరోధక శక్తి
వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక వ్యవస్థ వేసవిలో అవసరం, లేకుంటే త్వరగా అనారోగ్యాల బారిన పడతాం. అందుకోసమే రోజూ మూడు వాల్నట్స్ నీటిలో నానబెట్టి తినాలి.
4. చర్మానికి వాల్‌నట్స్‌తో సంరక్షణ
ఇతర నట్స్ తో పోలిస్తే వాల్నట్స్ లో అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే పాలిఫెనాల్స్ అని పిలిచే మొక్కల రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన చర్మాన్ని రక్షించడానికి సహాయపడతాయి. వేసవిలో అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల తీవ్ర చర్మ సమస్యలు రావచ్చు. ఆ సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో వాల్నట్స్ సహకరిస్తాయి.
5. వాపు రాకుండా..
దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా శరీరంలో ఇన్ఫ్లమేషన్ తోనే మొదలవుతాయి. అవి ఆక్సికరణ ఒత్తిడిని పెంచుతాయి. ఈ ఆక్సీకరణ ఒత్తిడిని, ఇన్ఫ్లమేషన్ ను (వాపు) తగ్గిస్తాయి వాల్నట్స్. వేసవిలో శరీరంలో వాపు, మంట వంటివి రాకుండా ఇవి కాపాడతాయి.
6. చెడు కొలెస్ట్రాల్‌కు వాల్‌నట్స్‌తో చెక్
LDL… దీన్ని చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. వీటిలో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. వాల్నట్స్ ను నీటిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. గుండెపోటు వంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
7. శక్తి కోసం వాల్నట్స్
వాల్నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి వేసవిలో త్వరగా వచ్చే అలసటను అడ్డుకుంటాయి. కావాల్సిన శక్తిని అందిస్తాయి. వీటిని నానబెట్టి చిన్న బాక్సులో పెట్టి ఆఫీసుకు తీసుకువెళ్తే అలసటగా అనిపించినప్పుడు చిరుతిండిగా తినవచ్చు.