కోడిగుడ్డు జున్ను కూర రెసిపీ గురించి విన్నారా? కూరగాయలు ఏమీ లేనప్పుడు రెడీగా ఉండేవి కోడిగుడ్లే. గుడ్లు ఎంతో పౌష్టికాహారాన్ని కలిగి ఉంటాయి. కోడిగుడ్డు మసాలా కూర, కోడిగుడ్డు పులుసు, కోడిగుడ్డు ఉక్కిరి, ఇగురు కూర, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒక్కటేమిటీ ఎవరి టేస్ట్‌ను బట్టి వాళ్లు వండుతుంటారు. అయితే ఇవన్నీ అందరూ వండుకునేవే. కానీ కోడిగుడ్డుతో జున్ను కూర చాలామందికి తెలియదు. అందరూ వండరు కూడా. దీని రుచి చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. జున్ను ఎంత కమ్మగా ఉంటుందో అంతటి టేస్ట్ ఈ గుడ్డు జున్ను కూరకు కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వంటను మీ ఇంట్లో చేయకపోతే ఇప్పుడు చేసేయండి.
కోడిగుడ్డు జున్ను కూరకు కావలసిన పదార్ధాలు:
- కోడి గుడ్లు – నాలుగు
- ఉల్లిపాయలు – రెండు (పెద్ద సైజు)
- పచ్చి మిర్చి – రెండు
- పసుపు – చిటికెడు
- ఉప్పు – రుచికి సరిపడ
- కారం – రెండు టేబుల్ స్పూన్లు
- ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
- జీలకర్ర పొడి – ఒక స్పూన్
- నూనె – రెండు టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర – కొద్దిగా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
- గరం మసాలా – ఒక టీ స్పూన్
కోడిగుడ్డు జున్న కూర రెసిపీ తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కోడిగుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి.
2. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి.
3. తర్వాత ఇడ్లి వేసుకునే గిన్నె కానీ లేదా కుక్కర్ కానీ తీసుకుని దానిలో కొంచెం నీరు పోసి.. గుడ్ల మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టి దానిపై మూతపెట్టాలి.
4. ఇప్పుడు రెండు, మూడు విజిల్ వచ్చేంతవరకూ ఉడబెట్టుకోవాలి.
5, తర్వాత ఉడికిన గుడ్ల మిశ్రమాన్నినెమ్మదిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
6. ఇప్పడు స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.
7. అవి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేగనివ్వాలి.
8. వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. ఆపై కట్ చేసిన గుడ్లను వేసి వేయించాలి.
9. మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఆపై గుడ్డు ముక్కలలో కొంచెం కారం వేసుకుని సరిపడా ఉప్పు వేసుకోవాలి.
10. తరువాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి.
11. ఇప్పుడు కొద్దిగా నీరు వేసుకుని రెండు నిమిషాలు నీరు దగ్గర పడేవరకూ ఉడికించుకోవాలి.
12. చివరగా కొత్తిమీర వేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఎంతో కమ్మని రుచితో నోటిలో కరిగిపోయే కోడిగుడ్డు జున్ను ముక్కల కూర రెడీ.. ఇది ఒక్కసారి అన్నంలో కలుపుకుని తిన్నారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినాల్సిందే. ఇది చపాతీలోకి కూడా అదిరిపోతుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్