Mamidi pulusu recipe: మామిడి పులుసు కూరను వండారంటే ఇక మాటలు ఉండవంతే! మరి మీరు కూడా ఈ మామిడి పులుసు కూర రెసిపీ ట్రై చూయాలనుకుంటున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఎలా చేయాలో చదివేయండి. వేసవి సీజన్లో ఎన్నో రకాల మామిడి కాయలు మార్కెట్లో ప్రత్యక్షమవుతాయి. వీటిలో కొన్ని మామూలుగా తినదగినవి అయితే మరికొన్ని వంటలలో ఉపయోగించేవి. పుల్ల మామిడి కాయలను పప్పులకు, కూరలకు, పులుసులకు వాడుతుంటారు. ఇవి వేడి వేడి అన్నంలో అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఒక్క పులుసుతోనే అన్నం మొత్తం తినగలిగేలా ఉంటాయి.
అయితే ఈ మామిడి కాయలతో చేసే పులుసు చాలా తక్కువమందికి తెలుసు. ఎందుకంటే ఇది ఆంధ్రాలో కంటే కేరళలో ఎక్కువగా వండే వంటకం. తింటే చాలా రుచిగా పుల్లపుల్లగా, కారంకారంగా ఒక డిఫరెంట్ టేస్ట్ అందిస్తుంది. మరి మామిడి కాయ పులుసు కూరకు కావాల్సిన పదార్థాలేమిటి? ఎలా తయారుచేసుకోవాలో చూసేద్దాం.
మామిడి కాయ పులుసు కూరకు కావలసిన పదార్థాలు:
- పుల్లని మామిడి కాయ – ఒకటి
- పచ్చి మిరపకాయలు – రెండు
- పసుపు పొడి – ఒక స్పూన్
- చింతపండు – నిమ్మకాయ సైజంత
- ఉల్లిపాయలు – రెండు
- టమాటాలు – రెండు
- కారం – ఒక టేబుల్ స్పూన్
- ధనియాల పొడి – ఒక టీ స్సూన్
- ఉప్పు – రుచికి సరిపడ
- నూనె – రెండు టేబుల్ స్పూన్లు
- ఎండు మిరపకాయలు – రెండు
- జీలకర్ర – ఒక టీ స్పూన్
- ఆవాలు – ఒక టీ స్పూన్
- మెంతులు – ఒక స్పూన్
- కరివేపాకు – రెండు రెమ్మలు
- బెల్లం పొడి – కొద్దిగా
మామిడి కాయ పులుసు కూర తయారీ విధానం:
స్టెప్ 1: ముందుగా స్టౌ మీద కడాయి పెట్టుకుని రెండు టీస్పూన్ల నూనెను వేడి చేయండి.
స్టెప్ 2: ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని మీడియం మంటపై ఫ్రై చేసుకోవాలి.
స్టెప్ 3: పోపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలను, పచ్చి మిర్చి ముక్కలను వేసుకుని దోరగా వేయించుకోవాలి.
స్టెప్ 4: టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దీనిలో వేసుకోవాలి. సన్నని మంటపై టమాటాలను కొద్దిగా మగ్గనివ్వాలి.
స్టెప్ 5: టమాటాలు త్వరగా మగ్గడానికి అందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకుని మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉండాలి.
స్టెప్ 6: టమాటాలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకుని అంతా కలిసేలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి.
స్టెప్ 7: ముందే నానబెట్టుకున్న చింతపండు పులుసును ఇందులో కాస్త పోసుకోవాలి.
స్టెప్ 8: ఆపై పులుసు కొద్దిగా మరుగుతున్నప్పుడు మామిడి కాయ ముక్కలను, కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి.
స్టెప్ 9: మీడియం మంటపై ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడి కాయ పులుసు కూర రెడీ.. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే ఆహా.. అనాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్