వేసవిలో ఉల్లిపాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ లేకుండా ఏ వంటకం పూర్తి కాదు. రోజూ నిత్యం వాడే ఉల్లిపాయలలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. పైగా ఇప్పుడు వేసవి దంచికొడుతుంది. ఉల్లిపాయను చాలామంది వివిధ రకాలుగా వాడుతుంటారు. వంటలలో అయితే ఉల్లిపాయ పులుసు, ఉల్లిపాయ పచ్చడి, ఉల్లికారం పొడి, ఉల్లిపాయ ఇగురు ఇలా ఎన్నో రకాలుగా ఉల్లిపాయను వాడుకోవచ్చు. కొందరు పచ్చి ఉల్లిపాయను సైతం అలాగే తినేస్తూ ఉంటారు. మరికొందరు జుట్టు సంరక్షణకు కూడా ఉల్లిపాయను ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉల్లిపాయలో అంత మంచి గుణాలు కలిగి ఉంటాయి. అందుకేనేమో పెద్దలు చెప్పిన్నట్టు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
చలువ గుణాలు
ఉల్లిపాయలో చలువ చేసే గుణాలు మెండుగా ఉన్నాయి. అందుకే ఎండాకాలంలో ఉల్లిపాయ తినడం తప్పనిసరి. కొందరు ఉల్లిపాయను అస్సలు తినరు. కూరలో వేసిన ఉల్లిపాయల ముక్కలను కూడా ఏరి పారేస్తారు. ఇది మంచి అలవాటు కాదు. మనం తినే ఆహరంలో ఆరోగ్యానికి తోడ్పడే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కనుక ప్రతీ ఒక్కరు ఉల్లిపాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది. దీనిలో యాంటీ ఆక్సీడెంట్స్, యాంటీ అలెర్జీ, యాంటీ కార్సనోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధులను దరిచేరకుండా కాపాడతాయి.
ముఖ్యంగా ఉల్లి వేసవిలో తినడం వల్ల ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. హీట్ స్ట్రోక్ రాకుండా చూస్తుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది. ఇలాంటి ఎన్నో లక్షణాలు ఉల్లిపాయలో ఇమిడి ఉన్నాయి. మరి అలాగే ఈ ఉల్లిపాయ వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
1. వేసవిలో చల్లగా ఉంచడానికి:
ఎండాకాలంలో ఒంట్లో వేడి విపరీతంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత సమంగా ఉండదు. అలాంటి సమయంలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ శీతలీకరణ లక్షణాలు కలిగి ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. హీట్ స్ట్రోక్ నుండి కాపాడుతుంది. వేసవిలో ఉల్లిపాయను ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. పచ్చిగా తినవచ్చు లేదా సలాడ్‌లో భాగం చేసుకోవచ్చు, ఎలా తిన్నా శరీరానికి మంచి ఔషధం.
2. మధుమేహానికి మంచిది:
మధుమేహంతో బాధపడేవారికి ఉల్లిపాయ మంచి ఆహారం. ఇది శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కలిగి ఉంటుంది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అంతేకాదు ఇందులోని సల్ఫర్ సమ్మళనాలు యాంటీ డయాబెటిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
3. గుండె ఆరోగ్యానికి మంచిది:
ఉల్లిపాయ గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఉల్లిపాయలో ప్రీబయోటిక్స్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలను తినడం వల్ల అధిక మొత్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. దీని ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. క్వెర్సిటిన్ ప్లేవనాయిడ్లు స్ట్రోక్ సమస్యలను తగ్గిస్తాయి.
4. ఎముకల బలానికి సరైనది:
ఉల్లిపాయ ఎముకలకు కూడా బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు శరీరంలో ఎముకల ధృడత్వం కాపాడడంలో సహాయపడతాయి. ఉల్లిపాయల్లో కాల్షియం ఉండడం వల్ల ఎముకలకు బలమైన పోషణ అందుతుంది. ఈ విధంగా ఎముకలను బలంగా ఉంచుకోవడానికి ఉల్లిని తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి.
5. జుట్టు సంరక్షణకు :
ఉల్లిపాయ జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలో విటమిన్లు సి, బి ఇంక యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల జుట్టు రాలిపోకుండా నియంత్రిస్తుంది. ఉల్లిపాయ రసంతో జుట్టును కాపాడుకోవచ్చు. తరుచూ దీన్ని తలకు రాయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. జుట్టు బాగా పెరగడంతో పాటు జుట్టు పోషణకు సహయపడుతుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్