టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య బంధం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. చంద్రబాబు కోసం పవన్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేవారని, చంద్రబాబు కూడా పవన్ కు అండగానే నిలిచేవారని ఇద్దరూ నిత్య విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటి వారి విడదీయరాని బంధానికి ఇప్పుడు కాలం చెల్లిందనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరని చరిత్ర చెబుతోంది. రాజకీయ శత్రువులుగా ఉన్న పార్టీలు, నాయకులు పరిస్థితుల కారణంగా మిత్రులుగా మారుతారు. దేశంలో ఇలాంటి ఉదంతాలు అనేకం.
బీహార్‌లో జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), బీజేపీ మధ్య సుదీర్ఘ బంధం ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో 25 ఏళ్ల నాటి చిరకాల బంధాన్ని వదిలి పెట్టి జేడీయూ అధినేత నితీష్ కుమార్…చిరకాల రాజకీయ శత్రువు ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో జతకట్టారు. ఆ ఎన్నికల్లో గెలిపొందారు. అయితే ఏడాదిలోనే మళ్ళీ ఆయన బీజేపీతో జతకట్టారు.
అలాగే మహారాష్ట్రలో బీజేపీతో ధృడమైన బంధాన్ని తెంచుకున్న శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో గత అసెంబ్లీల్లో చిరకాల శత్రువులు…మిత్రులై బరిలోకి దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ… గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ.. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ సందర్భాలు మచ్చుకు కొన్ని మాత్రమే.
దేశంలో ఇలాంటి ఉదాహరణలు వివిధ సందర్భాల్లో అనేకం ఉన్నాయి. ఇలా రాజకీయాల్లో మితృత్వం, శత్రుత్వం పరిస్థితులను బట్టీ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పరిస్థితి కూడా అలానే ఉంది.
ఆంధ్రప్రదేశ్ విభజన, 2014 ఎన్నికలకు ముందు ఏర్పడిన జనసేన మొదటి నుంచి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి మిత్రపక్షంగానే వ్యవహరిస్తూ వచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా జనసేన పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి.. వైఎస్సార్‌సీపీకి లాభం చేకూరుతుందని, టీడీపీకి నష్టం చేకూరుతుందని భావించిన ఆ పార్టీ అధినేత పవన్ పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతుగా మాత్రమే నిలిచారు.
టీడీపీ, బీజేపీ, జనసేన ఒకవైపు.. వైఎస్సార్‌సీపీ కవైపు ఆ ఎన్నికలలో బరిలోకి దిగాయి. జనసేన అభ్యర్థులు పోటీచేయకపోయిన పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ గెలుపునకు కృషి చేశారు. ఆ కూటమి బహిరంగ సభల్లో పవన్ నేరుగా పాల్గొనడంతో, ఆయన మద్దతుదారులు కూడా ఆ కూటమి వైపే నిలిచారు.
ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఆనాడు పవన్ కళ్యాణ్ వెంట నడిచింది. దీంతో టీడీపీ, బీజేపీ కూటమి సునాయాసంగా గెలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు గద్దెనెక్కారు. అక్కడ, ఇక్కడ మంత్రి పదవులను పంచుకున్నారు. జనసేన ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటీకి (పోటీ చేయలేదు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగానే ఉండేది. రెండు, మూడేళ్ల తరువాత పవన్‌కళ్యాణ్ అడపాదడపా చిన్నచిన్న విమర్శలు చేసేవారు.
2019 ఎన్నికల్లో జనసేన ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. కానీ ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా, ఆయన సోదరుడు నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేశారు. అయితే అన్నదమ్ములిద్దరూ ఓటమి చవిచూశారు.
ఆ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని వైఎస్సార్‌సీపీ పదేపదే విమర్శించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం ద్వారా చంద్రబాబుకు సహకారమందించాలని విమర్శించింది.
అందుకే సిపిఎం, సిపిఐ, బిఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, ఫలితంగా ఆయా పార్టీల పొత్తుతో ఓట్లు చీల్చి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారని విమర్శించింది. పవన్ కళ్యాణ్ పోటీచేసే స్థానాల్లో కూడా టీడీపీకి సహకరించాలని చంద్రబాబు లోపాయకారి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా విమర్శించింది.
టర్నింగ్ పాయింట్..
చంద్రబాబు గెలుపు కోసం అహర్నిశలూ కష్టపడిన ఆయన చిరకాల మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే ఆయనకు దూరం అవుతున్నాడన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు కూడా అందుకు సానుకూలంగా ఉన్నాయి.
వై.ఎస్.జగన్ పైన, ఆయన ప్రభుత్వం పైన జనసేన అధినేత విమర్శలు తగ్గించారు. ఇటీవలి విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటనలోనూ పవన్ గతంలో తరహాలో దూకుడుగా ప్రవర్తించలేదు. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మకంగా రాష్ట్రంలో 108,104 వాహనాలను ప్రారంభించినప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
ఇలా పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో ఇటీవలి అరెస్టు అయినప్పుడు కూడా జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆ అరెస్టును స్వాగతించడమే కాకుండా, గతంలో తమ పార్టీ జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన టీడీపీ నేతలకు అలానే జరగాలని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో వైసీపీ తరువాత వైసీపీ వస్తుందని, లేకపోతే జనసేన, బీజెపీ కూటమి అధికారంలోకి వస్తుందని.. అంతేతప్ప టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
పొత్తుపొడుపుతో..
అలాగే ఇటీవల సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు వియ్యంకుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా మెగా ఫ్యామిలీ నొచ్చుకునేలా చేశాయి. దీనికి నాగబాబు కూడా ఘాటుగా స్పందించారు. రాజధాని పేరుతో భూముల అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రతివిమర్శలు కూడా చేశారు.
పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పడు అది చంద్రబాబు నాయుడి ప్లానే అని అంతా అనుకున్నారు. వైఎస్సార్‌సీపీ కూడా ఇదేరీతిలో విమర్శించింది. కానీ క్రమంగా ఆ విమర్శలకు స్వస్తిపలికింది.
ఈ పొత్తుపొడుపు నుంచే చంద్రబాబుకు దూరం జరుగుతున్నట్టు ఇప్పుడు స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ బలహీనపడితే ఆ స్థానం తమదేనన్న ధీమాతో బీజేపీ ఇలా ప్లాన్‌చే సినట్టు అవగతమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.